వైఎస్సార్‌సీపీ జిల్లా సారథి జ్యోతులకు ఘన స్వాగతం
కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యాక తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చిన ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘన స్వాగతం లభించింది. వివిధ ప్రాంతాల్లో ఆయనను పార్టీ శ్రేణులుపూలమాలలతో ముంచెత్తారు. జ్యోతుల హైదరాబాద్ నుంచి ఉదయం జగ్గంపేట నియోజకవర్గంలోని స్వగ్రామమైన ఇర్రిపాక చేరుకున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనను కలిసి అభినందించారు. అనంతరం అన్నవరం వెళ్లిన జ్యోతులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావుతో కలిసి జ్యోతుల సత్యదేవుని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకున్న ఆయనకు సర్పవరం జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, రెడ్డి వీరవెంకటసత్యప్రసాద్, తోట సుబ్బారావునాయుడు, కాకినాడ సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.
పెద్ద ఎత్తున బాణా సంచాకాల్చి జ్యోతులను పూలమాలలతో ముంచెత్తారు. అనంతరం జ్యోతుల జేఎన్‌టీయూ, భానుగుడి, టూ టౌన్, మెయిన్‌రోడ్ మీదుగా బాలాజీచెరువు సెంటర్‌కు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా ప్రచార, ఎస్సీ సెల్, రైతు విభాగం కన్వీనర్లు రావూరి వెంకటేశ్వర్లు, శెట్టిబత్తుల రాజబాబు, రెడ్డి రాధాకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, పి.గన్నవరం నియోజకవర్గ నాయకుడు విప్పర్తి వేణుగోపాలరావు తదితరులున్నారు.