
వైఎస్సార్ సీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు తదితరులు
అడ్డతీగల (రంపచోడవరం) : టీడీపీ ప్రభుత్వం నయవంచక పాలన వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతఉదయభాస్కర్ అన్నారు. గురువారం ఎల్లవరంలో అనంత ఉదయభాస్కర్ సమక్షంలో రంపచోడవరం మండలానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ,సర్పంచ్ మరికొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఉదయభాస్కర్ సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల్లోనూ విశ్వాసం సన్నగిల్లిందన్నారు. అందుకే టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు పెరిగాయన్నారు. భవిష్యత్తులో టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి చేరడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రజల పక్షాన పోరాడే పార్టీగా వైఎస్సార్ సీపీ నిలబడడాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.
పార్టీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు
రంపచోడవరం మండలం బందపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు కారం బాపన్నదొర, తామరపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ శారపు బాపిరాజుదొర, గోపవరం టీడీపీ నాయకుడు శారపురామకృష్ణ, ఇతర ముఖ్య కార్యకర్తలు కారం చెల్లన్న దొర, కారం సత్తిబాబు, కారం బాపన్నదొర, కారం శ్రీనివాసరావుతో పాటు మరి కొంతమంది గురువారం ఎల్లవరంలో అనంతఉదయభాస్కర్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
బందపల్లి ఎంపీటీసీ సభ్యుడు కారం బాపన్నదొర మాట్లాడుతూ టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచిన తాను తన ఎంపీటీసీ స్థానంలో ఏవిధమైన అభివృద్ధి చేయలేకపోయానన్నారు. ప్రభుత్వం నుంచి గానీ, పెద్ద పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి గాని ఎటువంటి సహాయసహకారాలు లేవన్నారు. నాలుగేళ్లుగా ఇటువంటి పరిస్థితే ఉందన్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరానన్నారు.
అభివృద్ధి పనులు ఇస్తామని నమ్మబలికి పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు ఏవిధంగానూ మా గ్రామాల్లో అభివృద్ధికి సహకరించలేదని తామరపల్లి సర్పంచ్ శారపు బాపిరాజుదొర అన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ళ రామాంజనేయులు, రంపచోడవరం డివిజన్ సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు పండారామకృష్ణదొర, రంపచోడవరం మండల పార్టీ కన్వినర్ జల్లేపల్లిరామన్నదొర, యువజన విభాగం అధ్యక్షుడు రాపాక సుధీరాజు, మండల ప్రచారకమిటీ అధ్యక్షుడు వియ్యంకన్నబాబు, గంగవరం మండల పార్టీ కన్వీనర్ అమృతఅప్పలరాజు, బోలగొండ ఎంపీటీసీ సభ్యుడు వలల ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.