పోలవరంతోపాటు గిరిజనులూ ముఖ్యమే: జగన్
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన గిరిజనులకు న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో వైఎస్ జగన్ బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అందరికీ అవసరమని, ఆ ప్రాజెక్టు వస్తేనే ఏపీ బాగుపడుతుందని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. గిరిజనుల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారని, వారికి న్యాయంగా రావాల్సిన పరిహారం కూడా ఇవ్వడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై చూపిస్తున్న ధ్యాస.. భూములిచ్చిన వారిపై ప్రభుత్వం చూపడం లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు వల్ల నిర్వాసితులు పడుతున్న కష్టాలను తెలిపేందుకు స్వయంగా వారికే మైక్ ఇచ్చి మాట్లాడించారు.