సాక్షి, రాజమండ్రి : ఆహ్లాదకరమైన చల్లని వాతావారణంలో సేదతీరడానికి ఏజెన్సీ ప్రాంతానికి విహార యాత్రకు వచ్చిన ఇద్దరు స్నేహితులను మృత్యువు కాటేసింది. ఆ యువకుల కుటుంబంలో పెనువిషాదాన్ని మిగిల్చింది. మారేడుమల్లి మండలం పాములేరు గ్రామం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోకవరం మండలానికి చెందిన ముగ్గురు స్నేహితులు ద్విచక్ర వాహనంపై పాములేరు గ్రామానికి వచ్చారు.
అప్పటి వరకు ప్రకృతిలో అనందంగా గడిపిన వారు మధ్యాహ్నం భోజనాలు చేసి ముగ్గురు యువకుల్లో జుత్తుక నరేష్(24), గేదెల సీతారామ్(22) అనే ఇద్దరు యువకులు వాగులోకి స్నానానికి దిగారు. ఆ ప్రదేశం లోతు ఎక్కువగా ఉండడంతో ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. ఆ సమయంలో ఒడ్డుపైన ఉన్న మరో యువకుడు బంటిమిల్లి నాగబాబు తన స్నేహితులు ఇంకా వాగులోంచి పైకి రాకపోవడంతో ప్రమాదాన్ని గమనించి మారేడుమిల్లి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రాజు, గొర్లె సతీష్ తన సిబ్బందితో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు గ్రామస్తుల సహాయంతో వాగులో మునిగిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. వారి బంధువులకు సమాచారం అందించారు.
మృతులు జుత్తుక నరేష్‌ది గోకవరం గ్రామం. ఇతడు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గేదెల సీతారామ్‌ది గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామం ఇతడు ఇంటర్ పూర్తిచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రంపచోడవరం ఏఎప్పీ రాహుల్ దేవ్ సింగ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.
గతంలో వాగులో మునిగి పలువురు మృతి
పాములేరు వాగులో స్నానానికి దిగి అనేక మంది మృతి చెందారు. చాలా వరకు ఇక్కడి వచ్చే వారిలో ఎక్కవగా మద్యం సేవించేవారే. అక్కడ ఉండే గ్రామస్తులు, సిబ్బంది వాగులో స్నానాలకు దిగవద్దని చెప్పినా మద్యం మత్తులో లెక్క చేయకుండా వాగులోకి దిగి ప్రాణలు కోల్పోయే వారే అధికం. మరోవైపు అటవీశాఖ అధికారులు వాగులో స్నానాలు చేయడం, దిగడం నిషేధమని ప్రమాదాల ఫొటోలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment