మృతి చెందిన నబీరసూల్, యూనిస్
ఆత్మకూరురూరల్: సప్తనదీ సంగమంలో కలిసే నదుల్లో ఒకటైన పరమపావన బవనాసి నది ఇద్దరు బాలుర ప్రాణాలు బలి తీసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రంజాన్ మాసం, వేసవి సెలవులు నేపథ్యంలో బండిఆత్మకూరు మండలం ఏ కోడూరుకు చెందిన ముర్తుజావలి తన కుమారుడు యూనిస్(13)ను శ్రీపతిరావుపేటలో ఉండే తన మామ వన్నూర్‌సాబ్ ఇంటికి పంపాడు. గ్రామంలో వన్నూర్‌సాబ్ ఇంటికి ఎదురుగా ఉండే ముర్తుజా కుమారుడు నబీరసూల్(14)తో యూనిస్‌కు స్నేహం కుదిరింది. దీంతో ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. మంగళవారం ఉదయం నబీరసూల్ తాత దస్తగిరి పశువులకు మేత కోసం తన పొలం వైపు వెళుతుంటే స్నేహితులిద్దరూ వెళ్లారు.
అక్కడ పొలంలో కాసేపు తాతతో కలిసి గడ్డి కోసిన వారు గడ్డి కోసం సమీపంలోని బవనాసి నది ఒడ్డుకు వెళ్లారు. ఎంతసేపటికీ రాకపోవడంతో దస్తగిరి చుట్టుపక్కల వారితో కలిసి పిల్లల కోసం వెతికారు. ఓ చోట వాగు గట్టున పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి వాగులో గాలించగా ఇద్దరి మృతదేహాలు బురదలో చిక్కుకుపోయినట్లు గుర్తించి బయటకు తీశారు. ఆత్మకూరు ఎస్‌ఐ రమేష్‌కుమార్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా నబీరసూలు సోదరి వివాహ శుభలేఖల పంపిణీలో నిమగ్నమైన ముర్తుజా కుటుంబసభ్యులకు సమాచారం తెలియడంతో బోరున విలపించారు. అలాగే సెలవులకని వెళ్లిన కుమారుడు ఇక లేడని తెలుసుకున్న యూనిస్ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment