క్వారీల్లో బినామీల కాసుల వేట
యంత్ర పరికరాలు సీజ్ చేసిన అధికారులు
రాజకీయ ఒత్తిళ్లకు అక్రమార్కుల యత్నాలు
రంపచోడవరం :అమాయక గిజనుల పేరిట లీజులు సంపాదిస్తున్న బడాబాబులు అనధికారికంగా క్వారీలు నిర్వహిస్తూ దర్జాగా కాసుల వేట సాగిస్తున్నారు. కొండలు కరిగించేసి దర్జాగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇదంతా నిజమేనని నిర్ధారిస్తున్న అధికారులు కూడా ఏ చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అడ్డతీగల మండలం పులిగోగులపాడు పరిసరాల్లో సర్వే నంబర్-24లో ఉన్న నల్ల మెటల్ క్వారీయే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ క్వారీ నిర్వహణకు లీజు మంజూరైంది. కానీ దీనిని బినామీలు నడుపుతూ, కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని గత ఏడాది ఫిర్యాదులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అప్పటి రంపచోడవరం సబ్‌కలెక్టర్ గంధం చంద్రుడు ఈ క్వారీని తనిఖీ చేశారు. బినామీల ఆధ్వర్యంలోనే క్వారీ నడుస్తున్నట్లు తేల్చి, క్వారీ లీజు రద్దు చెయ్యాలని సూచిస్తూ మైనింగ్ శాఖకు నివేదిక పంపించారు. కొద్ది రోజులు పనులు నిలిపివేసిన బినామీదారులు క్వారీని తిరిగి ప్రారంభించారు. దీనిపై రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గనుల శాఖ డెరైక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లీజు పొందిన ప్రాంతంతోపాటు అనుమతి లేని ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరుపుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ విజిలెన్స్ అధికారులు ఆరు నెలల క్రితం తనిఖీలు చేశారు.
ఎమ్మెల్యే పేర్కొన్న అంశాలు వాస్తవమేనని తేల్చారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని మైనింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌ను ఆదేశించారు. అయినప్పటికీ అధికారులను మేనేజ్ చేసుకుని ఈ క్వారీలో నల్లమెటల్‌ను బినామీదారులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఆర్డీఓ జీవీ సత్యవాణి నాలుగు రోజుల క్రితం క్వారీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. నల్లమెటల్ సేకరణకు వాడుతున్న యంత్ర పరికరాలను సీజ్ చేశారు. కాగా బినామీదారులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి, క్వారీని యథాతథంగా నడుపుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలియవచ్చింది.
కొండలు కరిగించి..కోట్లు కొల్లగొట్టి..
Published Wed, Jul 29 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement