ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. మారేడుమిల్లి మండలం
14 బస్తాల గంజాయి పట్టివేత
Published Thu, Nov 21 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
రంపచోడవరం, మారేడుమిల్లి, న్యూస్‌లైన్ :ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. మారేడుమిల్లి మండలం ఆకుమామిడికోట గ్రామం వద్ద వ్యాన్‌లో 14 బస్తాలలో తరలిస్తున్న 420 కేజీల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శివశంకర్, రంపచోడవరం డీఎస్పీ చైతన్యకుమార్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఏజెన్సీ లోతట్టు ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఆకుమామిడి కోట నుంచి ఐషర్ వ్యాన్‌లో లోడ్ చేసి తరలిస్తున్నారంటూ తమకు అందిన సమాచారం మేరకు మారేడుమిల్లి సీఐ రవీంద్ర, ఎస్సై కోటేశ్వరరావు, సిబ్బంది ఈ దాడి నిర్వహించారు.
స్వాధీనపర్చుకున్న గంజాయిని విశాఖ జిల్లా నేలజర్త ప్రాంతం నుంచి ఆకుమామిడికోట చేర్చినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ వాహనానికి ముందుగా వస్తున్న పెలైట్ మోటారు వాహనాల్లోని వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. మొత్తమ్మీద ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తమిళనాడుకు చెందిన పాండే, కలై, నాగరాజన్, విజయకుమార్, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీను, రాజు, జగత్‌రాయ్ వీరిలో ఉన్నారు. కాగా పట్టుబడిన గంజాయి విలువ రూ. 12 లక్షలు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా పోలీసులకు తెలపాలని కోరారు.
Advertisement
Advertisement