నెల్లిపాక/చింతూరు (రంపచోడవరం): మరో నాలుగు రోజుల్లో బందువు వివాహం..ఎంతో ఆనందంగా పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు కానరానిలోకాలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఎటపాక మండలంలోని లింగాలపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం విదితమే. వారి మృతదేహాలకు శనివారం భద్రాచలం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.
మృతులు కలముల బాబూరావు, కట్టం కన్నయ్య, తెల్లం రాము సొంతూరు.. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి సమీప గ్రామం బలిమెలలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. తెల్లం రాము మేనమామ సుందరయ్య వివాహానికి ఈ నెల 19న ముహూర్తం పెట్టుకున్నారు. వివాహ శుభలేఖలు పంచేందుకు వెళ్లిన బంధువులకు ప్రమాదానికి గురవడంతో ఆ పెళ్లింట కళ తప్పింది.
ప్రమాదానికి కారణమైన లారీని చింతూరు మండలం చట్టి సమీపంలో పోలీసులు అ దుపులోకి తీసుకున్నారు. లారీ ఒడిశాకు చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో రాము అవివాహితుడు. బాబూరావు, కన్నయ్యలకు వివాహాలయ్యాయి. వీరిద్దరికీ ఇద్దరేసి చొప్పున చంటిపిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment