ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీ ఫిరాయించడంపై ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆమె తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రంపచోడవరం: ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అప్పుడు రూ.20 కోట్లు ఇస్తామని టీడీపీ వాళ్లు ఆఫర్ ఇచ్చినా పార్టీ వదిలివెళ్లలేదని చెప్పి ఇప్పుడు ఎంత మొత్తంలో డబ్బులు తీసుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, డివిజన్ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు పండా రామకృష్ణదొర డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ కార్యాలయం ఆవరణలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాజేశ్వరి పార్టీ మారినంత మాత్రాన ఏజెన్సీలో పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజలు వంతల రాజేశ్వరిని చూసి ఓట్లు వేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అ«ధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ ఎంతో కష్టపడి ఏజెన్సీలో పార్టీని అభివృద్ధి చేసి, ఆమె గెలుపునకు కృషి చేశారని చెప్పారు. ఎమ్మెల్యే కాక ముందు ఆమె తల్లికి ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దయతలచి రూ.5 లక్షలు ఖర్చు చేసి కేర్ ఆస్పత్రిలో వైద్యం చేయించిన విషయం ఆమెకు గుర్తు లేదాని ప్రశ్నించారు. నేడు డబ్బుకు ఆశ పడి పార్టీ మారి విలువలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు పార్టీకి అండగా నిలుస్తారన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాంజనేయులు, ఎంపీటీసీలు కారుకోడి పూజ, పొలోజు కాంతం, మహిళ అధ్యక్షురాలు కాపారపు రూతు, నాయకులు పాల ప్రసాద్, నేరం రమేష్, పండా నాగన్నదొర, మంగ పాల్గొన్నారు.
స్వప్రయోజనాల కోసమే పార్టీ ఫిరాయింపు
రంపచోడవరం: ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి స్వప్రయోజనాల కోసమే వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలోకి వెళ్లారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ విమర్శించారు. ఆమె ఎప్పుడూ పార్టీకి ఏ విధమైన సేవలు చేయలేదన్నారు. ఆమె పార్టీ వీడినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు కొదవలేదన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి తొలగించిన చోటా నాయకులతో కలసి ఆమె టీడీపీలో చేరారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ నుంచి వెళ్లిపోయేందుకే ఆమె గ్రూపు రాజకీయాలకు పాల్పడి పార్టీని బలహీన పరిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
వంతలపై వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహం
రంపచోడవరం: ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆమె నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, పండా చెల్లన్నదొర, ఆవుల మరియదాస్, మాచర్ల గంగులు, రాజవొమ్మంగి, ఎటపాక, వీఆర్‌పురం మండలాల కన్వీనర్లు సింగిరెడ్డి రాజకృష్ణ, తానికొండ వాసు, పొడియం గోపాల్, జిల్లా కార్యదర్శి కొవ్వూరి రాం బాబు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జెర్రి ఉమామహేశ్వరి తదితరులు తప్పుబట్టారు. తెలుగుదేశం పార్టీకి ఎంత డబ్బుకు అమ్ముడుపోయారని ప్రశ్నించారు. రాజేశ్వరి పార్టీని వీడినంత మాత్రాన వైఎస్సార్ సీపీకి వచ్చిన నష్టమేమీ లేదని పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు పేర్కొన్నారు.
పార్టీ మారినా నష్టం లేదు
దేవీపట్నం: రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొంది, పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రాన నియోజకవర్గంలో పార్టీకి వచ్చిన నష్టమేమి లేదని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుంజం చెల్లన్నదొర, ఎంపీపీ పండా జయలక్ష్మి, సర్పంచి సోదే వెంకన్నదొర, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు తుర్రం జగదీష్ శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎక్కడో మారుమూల గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్న సాధారణ మహిళను తీసుకువచ్చి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చిన జగన్‌మోహనరెడ్డిని, వెన్నంటి ఉండి ఆమె గెలుపునకు శాయశక్తులా కృషిచేసిన అనంత ఉదయభాస్కర్‌ను, కార్యకర్తలను మోసం ఆమె పార్టీ మారారని విమర్శించారు. ఎన్నికల డిపాజిట్ సైతం కట్టలేని స్థితిలో ఉన్న ఆమెతో అనంత బాబు, కార్యకర్తలు సొమ్ము చెల్లించి నామినేషన్ వేయించారని తెలిపారు. ఆమె ఉన్నతి కారణమైన పార్టీని కాదని నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారారని విమర్శించారు. నియోజకవర్గంలో ఎన్నికల ముందు నుంచి ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ సీపీ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ఆమె తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని సవాల్ చేశారు.
ఎమ్మెల్యే వంతలపై ఏజెన్సీలో ఆగ్రహం
మారేడుమిల్లి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ కుండ్ల సీతామహాలక్ష్మి, మండల కో–ఆష్షన్ సభ్యుడు బులసుమిల్లి వెంకట్రావు (చంటి), పార్టీ జిల్లా కార్యదర్శి గొర్లె బాలజీబాబు స్థానిక విలేకరులతో శనివారం మాట్లాడారు. నమ్మి ఓట్లు వేసిన ఏజెన్సీ ప్రాంత ప్రజలకు రాజేశ్వరి తీరని ద్రోహం చేశారన్నారు. గతంలో టీడీపీ నాయకులు రూ.20 కోట్లు ఆఫర్ చేసినా తాను డబ్బుకు లోగలేదని, జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పిన రాజేశ్వరి ఇపుడు ఎందుకు పార్టీ మారారని ప్రశ్నించారు. కేవలం డబ్బు కోసమే ఆమె పార్టీ మారారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలంతా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారని, ఆమె పార్టీ వీడినంత మాత్రన నష్టం ఏమిలేదన్నారు. సమావేశంలో మారేడుమిల్లి, సున్నంపాడు, తాడేపల్లి ఎంపీటీసీ సభ్యులు గొర్లె అనిల్ ప్రసాద్(బాబి), కానెం విజయలక్ష్మి, ఉలుగుల చిన్న సోమిరెడ్డి, వైస్ ఎంపీపీ సాదల రామయమ్మ, జీఎం వలస, సున్నంపాడు సర్పంచులు చెదల అరుణ కుమారి, చెదల రామిరెడి, మండల కార్యదర్శి బి.గంగరాజు, సొసైటీ ఉపాధ్యక్షుడు కుండ్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment