వైఎస్ జగన్ వస్తున్నారని..
కాకినాడ/రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో విషజ్వర బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలియగానే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జ్వర బాధితులను హడావుడిగా ఇంటికి పంపించేశారు.
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది చాపరాయి విషజ్వర బాధితులను శుక్రవారం డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. వైఎస్ జగన్ రాకముందే బాధితులను పంపించేయాలన్న టీడీపీ నేతలు ఒత్తిళ్లకు వైద్యులు తలొగ్గారు. జ్వరం నయంకాక ముందే తమను డిశ్చార్జ్ చేశారని గిరిజనులు మీడియా ముందు వాపోయారు.
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోనూ వైద్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో జ్వర బాధితులను డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ డాక్టర్ల తీరుపై బాధితులు మండిపతున్నారు. వ్యాధి పూర్తిగా నయంకాకుండా తమను పంపించేయాలనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.