
సెటిల్‌మెంట్లు చేస్తే చర్యలు
రంపచోడవరం, మారేడుమిల్లి:న్యాయం కోసం బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వస్తే వెంటనే కేసు నమోదు చేయాలని, అలా చేయకుండా సెటిల్‌మెంట్లు చేస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ హెచ్చరించారు. రంపచోడవరం డివిజన్‌లో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తూర్పు సరిహద్దు ప్రాంతంలో మావోల కదలికలు ఎక్కువగా ఉన్నాయని గాలికొండ, కోరుకొండ దళాలు సరిహద్దులో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు ఏజెన్సీలో 2008 నుంచి మవోల కదలికలు పూర్తిగా తగ్గాయని, ప్రస్తుతం గుర్తేడు ఏరియాలో మావోల కదలికలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు.
మావోయిస్టుల కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రాలో విలీనమైన మండలాల నుంచి ఆరు పోలీస్ స్టేషన్లు తూర్పు పరిధిలోకి వచ్చాయని, కొత్తగా మరో సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం ఏర్పాటు అవసరం ఉందన్నారు. మావోల ప్రభావం ఎక్కువగా ఉన్న చత్తీస్‌గడ్ కుంట ఏరియాలో శబరి ప్లాటూన్ సంచారం ఉందని, మావోలకు చెక్ పెట్టేందుకు కూంబింగ్ జరుగుతుందని, వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు. విలీన ప్రాంతంలో పోలీస్ సిబ్బంది నియమకానికి సమయం పడుతుందని, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం గుర్తేడులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఉందని ఎస్పీ చెప్పారు.
గిరిజన యువత మావోల ఉద్యమంవైపు ఆకర్షితులు కావడం లేదని, ఇందుకు ఉపాధి అవకాశాలు పెరగడం చైతన్యం రావడమే కారణమని పేర్కొన్నారు. మావోల ప్రభావిత ప్రాంతాల్లో ఐఏపీ నిధులతో చేపట్టిన పనుల ప్రగతిపై పరిశీలించామని, గిరిజన యువత చైతన్యానికి వివిధ అంశాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టామన్నారు. తూర్పు సరిహద్దులోని గ్రామాల్లో గంజాయి సాగు చేస్తూ ఏజెన్సీ ప్రాంతం మీదుగా బయటకు రవాణా చేస్తున్నారని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
పోలీసులు గంజాయి అక్రమార్కులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సి.హెచ్.విజయరావు ఉన్నారు. అనంతరం ఆగస్టు 15 సందర్భంగా రంపచోడవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి పోలీస్ మీట్ విజేతలకు ఎస్పీ ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు కృష్ణారావు, రాంబాబు, ఉమర్, ముక్తేశ్వరరావు, ఎస్సై విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.