కనీస మార్కులొస్తేనే హోంగార్డులకు ఉద్యోగాలు | Police Recruitment Board Chairman Ravi Prakash counters in High Court | Sakshi
Sakshi News home page

కనీస మార్కులొస్తేనే హోంగార్డులకు ఉద్యోగాలు

Published Sun, Nov 24 2024 5:30 AM | Last Updated on Sun, Nov 24 2024 5:30 AM

Police Recruitment Board Chairman Ravi Prakash counters in High Court

హైకోర్టులో పోలీసు నియామక బోర్డు చైర్మన్‌ రవిప్రకాశ్‌ కౌంటర్‌

సాక్షి, అమరావతి: ప్రాథమిక రాత పరీక్షలో కనీస మార్కులు రాని హోంగార్డులకు ఉద్యో­గాలు ఇవ్వలే­మని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (ఎస్‌ఎల్‌పీ­ఆర్‌బీ) చైర్మన్‌ ఎం.రవిప్రకాశ్‌ హైకోర్టుకు నివేదించారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను అనర్హులుగా ప్రకటించారంటూ పలువురు హోంగార్డులు హైకోర్టులో వేర్వే­రుగా పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన అభ్య­ర్థులను దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు నియా­మక బోర్డు చైర్మన్‌ రవిప్రకాశ్‌ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ నియా­మకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హులు కాని వారికి పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రశ్నించే హక్కులు ఉండవని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 

పోస్టు­లకు దరఖాస్తు చేసే సమయంలోనే నోటిఫికే­షన్‌లో పేర్కొన్న షరతుల గురించి పిటిషనర్లందరికీ స్పష్టంగా తెలుసని, వాటికి అంగీకరించిన తరువాతే వారంతా ప్రాథమిక రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపో­వడంతో వారంతా ఇప్పుడు నోటిఫికేషన్‌ను తప్పుప­డు­­తు­న్నారని తెలిపారు.

నోటిఫికేషన్‌లోని పేరా–7­లో పేర్కొన్న స్పెషల్‌ కేటగిరీలు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ (హోంగార్డులు, ఎన్‌సీసీ, ప్రతిభావంతులైన క్రీడాకారులు, పోలీసు సిబ్బంది పిల్లలు, మరణించిన పోలీసుల పిల్లలు తదితరాలు)  కిందకు వస్తాయన్నారు. ఈ హారిజాంటల్‌‡ రిజర్వేషన్‌ కిందకు వచ్చే పోస్టులను కచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు­నకు అనుగుణంగా భర్తీ చేసి తీరాల్సిందేనని తెలిపారు.

అలా చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయి
రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా హోంగార్డుల కోసం కేటాయించిన కోటాలో హోంగార్డులకు ప్రత్యేక మెరిట్‌ జాబితా తయారు చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమవుతుందని రవిప్రకాశ్‌ వివరించారు. పిటిషనర్ల అభ్యర్థనను ఆమోదిస్తే మెరిట్‌కు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టవుతుందని, పిటిషనర్లు తమ కులం ఆధారంగా వయసు మినహాయింపు కోరుతున్నారని పేర్కొన్నారు.

అయితే, తమ కేటగిరీ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కింద కనీస అర్హత మార్కులను మాత్రం ఆమోదించడం లేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. స్పెషల్‌ కేటగిరీ కింద హోంగార్డుల్లో కూడా ఓసీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీ­లకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామన్నారు. 

కనీస అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్థులకు లేదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో సైతం స్పష్టం చేసిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసు­కుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసి సంబంధిత పిటిషన్లన్నీ కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement