వణుకుతున్న వెంకటాపురం | Venkatappuram was shaking with deaths | Sakshi
Sakshi News home page

వణుకుతున్న వెంకటాపురం

Published Sat, Oct 7 2017 4:19 AM | Last Updated on Sat, Oct 7 2017 7:15 PM

Venkatappuram was shaking with deaths

సాక్షి, రాజమహేంద్రవరం/చింతూరు: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో 16 మంది మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే చింతూరు ఏజెన్సీలోని వెంకటాపురం గ్రామం అంతుచిక్కని వ్యాధులతో వణుకుతోంది. పదిహేను రోజుల్లో గ్రామంలో ముగ్గురు మృత్యువాత పడగా మరో పది మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామస్తులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఆదివాసీలు భయంతో గ్రామాన్ని వీడి ఇతర గ్రామాలకు వెళ్లిపోతున్నారు. 30 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని గాదిరాస్‌ నుంచి వలస వచ్చిన 20 కుటుంబాలకు చెందిన 110 మంది చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో నివాసముంటున్నారు. వీరంతా గ్రామ సమీపంలోనే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

రెండు వారాల్లో ముగ్గురు మృతి
గ్రామానికి చెందిన మడకం వుంగయ్య(18) అనే యువకుడు 15 రోజుల క్రితం అంతుచిక్కని వ్యాధితో మృతిచెందగా వారం క్రితం కొవ్వాసి జోగయ్య(25) అనే యువకుడూ అకస్మాత్తుగా మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆశా వర్కర్‌ మంగమ్మ భర్త మడివి గంగయ్య(60) బుధవారం మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మడకం సుక్కమ్మ, మడివి దేవయ్య, పొడియం లింగయ్య ఒళ్లంతా మంట, జ్వరం, దగ్గు, నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా వుంది. కాగా, వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులు ఏడుగురాళ్లపల్లిలోని ఆసుపత్రికి వెళ్లకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సదరు నాటువైద్యుడు కుండల్లో ఏవో ఆకులు పెట్టి మంత్రాలు చదువుతూ ఆకులతో ఆమె ఒంటిపై నిమురుతున్నాడు. కాగా, వ్యాధుల కారణంతో చాలామంది భయాందోళనలతో గ్రామాన్ని వీడుతున్నారు.  

వాగు నీరే తాగునీరు...
గ్రామంలో 20 కుటుంబాలు నివాసముంటున్నా తాగునీటి కోసం ఇక్కడ ఒక్క బోరు కూడా లేదు. గ్రామానికి కిలోమీటర్‌ దూరంలోని వాగుకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి ఏడు కిలోమీటర్ల దూరాన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి చిన్నపాటి కాలిబాట మాత్రమే ఉంది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరిగినా విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత మరణాలు కూడా కాటుకపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సవలం సత్తిబాబు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో వైద్య సిబ్బంది కూడా అడపాదడపా వస్తున్నారని.. తామే వారాంతపు సంత రోజుల్లో ఆసుపత్రికి వెళ్తుంటామని గ్రామస్తులు తెలిపారు.  గ్రామంలో వ్యాధుల పరిస్థితిని తెలుసుకున్న ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి చెందిన వైద్య బృందం శుక్రవారం ఆ గ్రామానికి చేరుకుని  వైద్య పరీక్షలు నిర్వహించింది.

సకాలంలో వైద్యం అందకే మరణాలు
వివిధ వ్యాధుల వల్లే గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయి. సకాలంలో వైద్యం తీసుకోకపోవడంతో వ్యాధులు ముదురుతున్నాయి. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తాం.
– డాక్టర్‌ పుల్లయ్య, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement