aadivases
-
ఆదివాసీ హక్కుల కోసం నిలదీద్దాం
మాయదారి ఎన్నికలు మళ్లీ వచ్చాయి. ఆంధ్ర, తెలంగాణ అగ్రవర్ణ గిరిజనేతరులు అడ్డగోలుగా దోచుకుని తిని మళ్లీ దోచుకోవడానికి ఆదివాసీ సమాజంలోకి వస్తున్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ దొరల పాలైయింది. ఐదు సంవత్సరాలు పాలించమని అధికారం ఇస్తే నాలుగేండ్లకే కాడి కిందేసిండు. ఫలితంగా వందల కోట్ల ప్రజల సొమ్ము వృధా చేస్తూ ఎన్నికల జాతర మొదలైయింది. అగ్రకుల సంపన్నులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పెట్టుబడిదారులు పెద్ద భూస్వాముల నుంచి మొదలుకొని వీధి రౌడీల వరకు అందరూ ఎత్తులు పైఎత్తులతో జిత్తులమారి వేషాలు వేస్తూ రంగురంగు జెండాలతో వస్తున్నారు. 70 ఏండ్లుగా రాజకీయ పార్టీలు ఇదే దొంగ మాటలు చెప్పి ప్రజ లనూ, ఆదివాసీలనూ మోసం చేస్తున్నాయి. గిరిజనేతర పార్టీలలో చేరి ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యి, ఆది వాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఓట్లేసిన ఆది వాసీల బతుకులు మాత్రం మారడం లేదు. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీల జీవన విధానం ఏం మారిందో ఈ గిరిజనేతర పార్టీలు సమాధానం చెప్పాలి. ఆదివాసీల అస్తి త్వాన్నీ, సంప్రదాయాలను కాపాడేవారికే మా ఓట్లు వేస్తామని నేడు తెగేసి చెబుతున్నారు. తెలంగాణ విప్లవ వారసత్వాన్ని ఈ రాజకీయ పార్టీలు అపహాస్యం చేశాయి. ఆనాడు వాకిట్లో బట్టలూడదీసి దొరలు బతుకమ్మలాడిస్తే, నేడు ఫామ్ హౌస్ నుంచి నయాదొరలు పాలన సాగిస్తున్నారు. ఇసుక, బొగ్గు, ఇనుము, అటవీ సంపద, సహజ సంపదలను అంది నకాడికి దోచుకుని ఆదివాసీ ప్రాంతాలను దోపిడీ కేంద్రాలుగా మార్చివేశారు. నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల జీవితాలు నలుగురి కుటుంబ స్వార్థానికి బందీ అయ్యాయి. ఆదివాసీ యువతరానికి ఉద్యోగాలు లేవు. ఆదివాసీ రిజర్వేషన్లను లంబాడీలు కబ్జా చేస్తున్నా, ఈ రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. ఆ పార్టీ నినాదాలు మార్చిందిగానీ, విధానాలను మాత్రం మార్చుకోలేదు. ఈ గిరిజనేతర పార్లమెంటరీ పార్టీలన్నీ ఒకే చెట్టుకు కాసిన విషపు కాయలే. ఈ పార్టీల విధానాలు మారనంత కాలం ఆదివాసీ జీవితాలు మారవు. ఆదివాసీల ఉమ్మడి రాజకీయ చైతన్యమే ఆదివాసీ స్వయం పాలనకు దోహదం చేస్తుంది. జల్, జంగిల్, జమీన్‌పై సంపూర్ణ అధికారం ఆదివాసీలకే ఉండాలి, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి, ఎస్టీ జాబితాలో ఏ ఇతర కులాలను కలుపకుండా చట్టం తీసుకురావాలి, ఐటీడీఏలో పైస్థాయి నుండి కింది స్థాయి వరకు ఆదివాసీలతోనే నియామకాలు జరపాలి, ఏజెన్సీలోని గిరిజనేతరుల ఓటు హక్కును రద్దు చేయాలి, 1/70 చట్టాన్ని అమలు చేయాలి, ఏజెన్సీలో భూ దురాక్రమణపై కమిటీ వేయాలి, ఏజెన్సీ ప్రాంతాలన్నిటినీ ఒకే యూనిట్‌గా కలిపే స్వయంపాలన కల్పించాలి, ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా ఆదివాసీలకే కేటాయించాలి, గోండు, కోయ తెగలవారికి 10వ తరగతి వరకు వారి మాతృభాషలోనే బోధన చేయాలి, జీవో నెం.3ని అమలు చేయాలి, జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా గాక, చారిత్రక ప్రాంతంగా గుర్తించాలి. ఇంద్రవెల్లి అమరుల స్థూపంపై ఆంక్షలను ఎత్తివేసి, నిర్వహణ బాధ్యత ఆదివాసీ సంఘాలకు అప్పగించాలి, ఆదివాసీలను నిర్వాసితులను చేసే ప్రాజెక్టులను విరమించుకోవాలి, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, గ్రూప్–1 పరీక్షలు నిర్వహించాలి–ఈ డిమాండ్ల సాధన కోసం ప్రతి ఆదివాసీ కృషి చేయాలి. ఓట్ల కోసం ఆదివాసీ ప్రాంతాలకు వచ్చే గిరిజనేతర పార్టీలను డిమాండ్ల సాధన కోసం నిలదీయాలి. గూడెంలోని ఓట్లు అడిగేవారిని ప్రశ్నించాలి. అడుక్కుంటే హక్కులు రావు, పోరాడితేనే హక్కులను సాధించుకోగలం. పోరాటం ద్వారానే సహజ వనరులు, ఖనిజాలపై హక్కులను దక్కించుకోవాలి. సారా సీసాలకు, డబ్బుకు ఆదివాసీలు అమ్ముడుపోరని గర్వంగా ప్రకటిద్దాం. ఆదివాసీ అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. వ్యాసకర్త : వూకె రామకృష్ణ దొర, అధ్యక్షులు, ఆదివాసీ రచయితల సంఘం మొబైల్ : 98660 73866 -
వణుకుతున్న వెంకటాపురం
సాక్షి, రాజమహేంద్రవరం/చింతూరు: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో 16 మంది మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే చింతూరు ఏజెన్సీలోని వెంకటాపురం గ్రామం అంతుచిక్కని వ్యాధులతో వణుకుతోంది. పదిహేను రోజుల్లో గ్రామంలో ముగ్గురు మృత్యువాత పడగా మరో పది మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామస్తులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఆదివాసీలు భయంతో గ్రామాన్ని వీడి ఇతర గ్రామాలకు వెళ్లిపోతున్నారు. 30 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని గాదిరాస్ నుంచి వలస వచ్చిన 20 కుటుంబాలకు చెందిన 110 మంది చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో నివాసముంటున్నారు. వీరంతా గ్రామ సమీపంలోనే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు వారాల్లో ముగ్గురు మృతి గ్రామానికి చెందిన మడకం వుంగయ్య(18) అనే యువకుడు 15 రోజుల క్రితం అంతుచిక్కని వ్యాధితో మృతిచెందగా వారం క్రితం కొవ్వాసి జోగయ్య(25) అనే యువకుడూ అకస్మాత్తుగా మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మంగమ్మ భర్త మడివి గంగయ్య(60) బుధవారం మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మడకం సుక్కమ్మ, మడివి దేవయ్య, పొడియం లింగయ్య ఒళ్లంతా మంట, జ్వరం, దగ్గు, నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా వుంది. కాగా, వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులు ఏడుగురాళ్లపల్లిలోని ఆసుపత్రికి వెళ్లకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సదరు నాటువైద్యుడు కుండల్లో ఏవో ఆకులు పెట్టి మంత్రాలు చదువుతూ ఆకులతో ఆమె ఒంటిపై నిమురుతున్నాడు. కాగా, వ్యాధుల కారణంతో చాలామంది భయాందోళనలతో గ్రామాన్ని వీడుతున్నారు. వాగు నీరే తాగునీరు... గ్రామంలో 20 కుటుంబాలు నివాసముంటున్నా తాగునీటి కోసం ఇక్కడ ఒక్క బోరు కూడా లేదు. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని వాగుకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి ఏడు కిలోమీటర్ల దూరాన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి చిన్నపాటి కాలిబాట మాత్రమే ఉంది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరిగినా విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత మరణాలు కూడా కాటుకపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సవలం సత్తిబాబు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో వైద్య సిబ్బంది కూడా అడపాదడపా వస్తున్నారని.. తామే వారాంతపు సంత రోజుల్లో ఆసుపత్రికి వెళ్తుంటామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వ్యాధుల పరిస్థితిని తెలుసుకున్న ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి చెందిన వైద్య బృందం శుక్రవారం ఆ గ్రామానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించింది. సకాలంలో వైద్యం అందకే మరణాలు వివిధ వ్యాధుల వల్లే గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయి. సకాలంలో వైద్యం తీసుకోకపోవడంతో వ్యాధులు ముదురుతున్నాయి. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తాం. – డాక్టర్ పుల్లయ్య, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో. -
ఆదివాసీలపై దాడులు ఆపాలి
కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎంఎల్) ధర్నా ముకరంపుర : ఆదివాసీలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపి వారి హక్కులు కాపాడాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు తెలంగాణ చౌక్‌నుంచి కలెక్టరేట్‌వరకు ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. హరితహారం పేరిట ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు పోలీసుల అండతో లాక్కుంటున్నారని పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో దాడులు సైతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో పోలీసులు ఆదివాసీలను నిర్బంధిస్తున్నారని, అరెస్టులు చేస్తూ.. ఆస్తులు ధ్వంసం చేస్తూ.. పంటలను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాల పోడుభూమి గుర్తించి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జేవీ.చలపతిరావు, నాయకులు రాజమ్మ, రాజు, నరేష్, శ్రీనివాస్, భీమేశ్వర్, రాములు తదితరులున్నారు.