ధర్నా చేస్తున్న సీపీఐ (ఎంఎల్) నాయకులు
-
కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎంఎల్) ధర్నా
ముకరంపుర : ఆదివాసీలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపి వారి హక్కులు కాపాడాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు తెలంగాణ చౌక్‌నుంచి కలెక్టరేట్‌వరకు ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. హరితహారం పేరిట ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు పోలీసుల అండతో లాక్కుంటున్నారని పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో దాడులు సైతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో పోలీసులు ఆదివాసీలను నిర్బంధిస్తున్నారని, అరెస్టులు చేస్తూ.. ఆస్తులు ధ్వంసం చేస్తూ.. పంటలను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాల పోడుభూమి గుర్తించి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జేవీ.చలపతిరావు, నాయకులు రాజమ్మ, రాజు, నరేష్, శ్రీనివాస్, భీమేశ్వర్, రాములు తదితరులున్నారు.