సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పంపకాలకు తెరలేవనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం మూగబోనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో నేటి సాయంత్రం 4 గంటలతోనే ప్రచార కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. నేటి సాయంత్రం తర్వాత ఇక రాజకీయ నేతలు, స్టార్ క్యాంపైనర్లు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై మీడియాతో మాట్లాడరాదని, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ప్రలోభాలపై దృష్టి
పోలింగ్‌కు రెండు రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఓ వైపు పోల్ మెనేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేసుకుంటూ మరోవైపు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.2వేల నుంచి రూ.3వేలు చొప్పున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది.
గ్రామీణ నియోజకవర్గాల్లో ఇప్పటికే డబ్బులు, మద్యం పంపిణీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి నాటికే ఓటర్లకు డబ్బులు, మద్యం చేరవేసేందుకు ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఇక పోలింగ్‌కు ముందు రోజు రాత్రి మద్యం నిల్వలను బయటకి తీసి ఓటర్లకు పంపిణీ చేయనున్నారని చర్చ జరుగుతోంది. డబ్బులు, మద్యం పంపిణీని ఎన్నికల యంత్రాంగం ఎంత మేరకు నియంత్రించ గలుగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment