వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ‘పెనాల్టీ’ చెల్లించి ప్రయాణించే పద్ధతి ఇక బంద్
అలా దొరికితే.. పెనాల్టీ వసూలు చేసి రైలు దించేలా నిబంధనలు కఠినతరం
జనరల్ క్లాస్ రుసుము వసూలు చేసి వాటిల్లోకి తరలింపు
వాటిల్లో ఖాళీలు లేకుంటే రైలు దిగిపోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..
రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.
కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్‌లో కొనుగోలు చేసిన రిజర్వ్‌డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.
అలా పట్టుబడితే పెనాల్టీనే
టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్‌లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్‌లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.
వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలు
కన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్‌డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్‌డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్‌డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment