మూడేళ్లలో చిన్నచిన్న కారణాలతో 420 మంది సిబ్బందిని తొలగించిన ఆర్టీసీ
తొలుత 600 మందిని తీసేసినా అప్పీళ్ల మేళాలో 180 మందికి తిరిగి పోస్టింగ్
ముఖ్యమంత్రి రేవంత్‌కు మూకుమ్మడిగా ఫిర్యాదు చేసిన మిగిలిన వారు
డిమాండ్ల సాధనకు ఉద్యోగులు గొంతెత్తుతున్న వేళ తాజా పరిణామంపై ఆరీ్టసీలో చర్చ
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్‌ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.
ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్‌లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది.
రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.
దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.
వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్
ఊరికే ఉద్యోగాలు తొలగించం..
ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట
Comments
Please login to add a commentAdd a comment