రుణవిముక్తి కాకుంటే రణమే..
రంపచోడవరం : ఓట్లు రాబట్టుకోవడానికి ఇచ్చిన రుణమాఫీ హామీని.. గద్దెనెక్కాక గడ్డిపరకంత ఖాతరు చేయని చంద్రబాబు తమ కన్నెర్రకు గురి కాక తప్పదని మన్యసీమలోని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టు తమ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఎలుగెత్తారు. డ్వాక్రా రుణాల మాఫీ విషయమై ఇచ్చిన మాటకు కట్టుబడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరిని నిరసిస్తూ ఏజెన్సీలోని ఆ సంఘాల మహిళలు సోమవారం రంపచోడవరంలో కదం తొక్కారు. రహదారి సదుపాయం లేని మారుమూల గ్రామాల నుంచి, కాలినడకన కొండకోనలను అధిగమించి సైతం తరలి వచ్చిన మహిళలు సీపీఎం కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించి చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
మహిళలు, రైతుల ఓట్లతో గెలుపొంది, ఇప్పుడు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. మహిళా సంఘం నాయకురాలు కె.చెల్లాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటించి, నేటి వరకూ పట్టించుకోకపోవడం మహిళలను మోసగించడమే అన్నారు. డ్వాక్రా సంఘాలకు సంపూర్ణ రుణమాఫీ చేయకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వాగ్దానానికి ఎగనామం పెట్టడానికి ఇప్పుడు అనేక రకాల కారణాలు చూపడం సిగ్గుచేటన్నారు. కాగా ఇందిరా క్రాంతిపథం అధికారులు డ్వాక్రా సంఘాల నుంచి అనధికారంగా రూ.1000 వసూలు చేయడంపై విచారణ జరిపించాలని పీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. పీఓ గంధం చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
స్థానికంగా ఉన్న డ్వాక్రా మహిళా సంఘాల సమస్యలను సమగ్ర నివేదిక ద్వారా తెలియజే స్తే పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఎం.సుబ్రమణ్యం మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ జరిగే వరకూ అన్ని సంఘాలను కలుపుకొని ఆందోళన చేస్తామన్నారు. రుణాల వసూలు కోసం బ్యాంకులు తీవ్ర ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం నుంచి రుణమాఫీ విషయంలో సృష్టమైన హామీ వచ్చేవరకు కూడా డ్వాక్రా మహిళా సంఘాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గి రిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.బాపన్నదొర, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు సిరిమల్లి రెడ్డి, ఆశ వర్కర్స్ యూ నియన్ అధ్యక్షురాలు కె.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.