తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అత్యాచారం జరగడంతో ఆమె గర్భం దాల్చింది!!
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని గర్భం దాల్చింది!! రంపచోడవరం మండలం జాగరంపల్లి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె గత సంవత్సరం ఐదో తరగతి చదివింది. అదే సమయంలో అక్కడున్న హాస్టల్ వార్డెన్, విద్యుత్ సంబంధిత పనులు చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ అప్పట్లో భయంతో ఆమె ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
కాగా, ఆ బాలిక ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల మారింది. తాజాగా మారేడుమిల్లి మండలం బోదునూరు ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతిలో చేరింది. ఇటీవలి కాలంలో తరచు అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేశారు. తీరా చూస్తే అప్పుడు ఆమె గర్భవతి అన్న విషయం తెలిసింది. ఏమైందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయినులు ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు రంపచోడవరం పోలీసు స్టేషన్లో ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. డీఎస్పీ చైతన్యకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.