సాక్షి, తూర్పు గోదావరి : ఈ చిత్రంలో ఆమెను చూస్తే ఏమనిపిస్తోంది? దూర ప్రయాణంలో భాగంగా బస్టాండులో బస్సు కోసం ఒడిలో చిన్నారితో మండుటెండలో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది కదా! కానీ గుండెలు పిండేసే నిజం ఏమిటంటే...ఆ పసిబిడ్డకు అనారోగ్యంగా ఉండడంతో దగ్గర్లోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు... పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కానీ రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఆ శిశువు తల్లి ఒడిలోనే కన్నుమూసింది.
ఎతైన కొండలు... ఆ కొండలతో పోటీ పడుతున్నట్టుగా పొడవాటి చెట్లు ... ఈ రెంటింటి మధ్య గలగలా పారే సెల ఏళ్లు పక్షుల కిలకిలారావాలు, ఎటు చూసినా పచ్చదనమే ... అప్పుడప్పుడు వెళ్లే పర్యాటకులకు కనువిందే..మానసిక ఆనందమే...ఆహ్లాదమే...కానీ.. ఆ గూడెంలో ఉండే గిరిజనుల గుండెల నిండా ఉండే వ్యధ... కన్నతల్లుల కన్నీటి వెత ఎందరికి తెలుసు? వైద్యం అందక కన్నుమూస్తున్న మాతా, శిశు దేహాలను తీసుకువెళ్లేందుకు నానా చావు చావాలి.
ఎత్తైన కొండలు, రవాణా సదుపాయాల లేని కుగ్రామాలు, వైద్యం కోసం రోగులను తీసుకుని కాలినడకన ఆస్పత్రులకు వెళ్లడం గిరిజనులకు సర్వసాధారణ అయింది. రెండు నెలల చిన్నారికి అస్వస్థతగా ఉండడంతో తల్లిదండ్రులు పరుగుపరుగున ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. విషమంగా ఉన్న శిశువు ప్రాణాలు దక్కలేదు. పుట్టేడు దుఃఖంతో శిశువు మృతదేహంతో కన్నీరుమున్నీరుగా వారు విలపించారు. అచేతన స్థితిలో ఉన్న వారిద్దరూ.. శిశువు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ అంబులెన్స్ కోసంస్థానిక ఏరియా ఆస్పత్రిలో విలపిస్తూ కూర్చుండిపోయారు. వారి వేదన అందరినీ కంటతడిని పెట్టించింది.
వై.రామవరం మండలం పలకజీడి గ్రామానికి చెందిన సాదల అమ్మాజీ, రాంబాబు రెండు నెలల శిశువు అనారోగ్యంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందాడు. జ్వరం, న్యూమోనియాతో బాధపడుతోన్న శిశువును పలకజీడి నుంచి వై.రామవరం ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్య సిబ్బంది శిశువును రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అతడి పరిస్థితి అలాగే ఉండడంతో రంపచోడవరం ఆస్పత్రి వైద్యులు అత్యవసర వైద్యం రాజమహేంద్రవరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతలోనే శిశువు మృతి చెందాడు.
అంబులెన్స్ లేక నిరీక్షణ
రంపచోడవరం ఏరియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ లేక సాయంత్రం ఆరు గంటల వరకు తల్లిదండ్రులు నిరీక్షించారు. ఆస్పత్రి అంబులెన్స్ మోతుగూడెంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి వెళ్లింది. ఐటీడీఏకు చెందిన రెండు అంబులెన్స్‌లు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులతో రాజమహేంద్రవరం వెళ్లాయి. రక్తదాన శిబిరానికి వెళ్లిన వాహనం తిరిగి రావడంతో సాయంత్రం ఆరు గంటలకు శిశువు మృతదేహాన్ని తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment