గుడిసె.. అందాలు మెరిసె.. | Tourists Interested In Staying In The Hills Of Grassland | Sakshi
Sakshi News home page

గుడిసె.. అందాలు మెరిసె..

Published Sun, Dec 12 2021 10:46 AM | Last Updated on Sun, Dec 12 2021 11:18 AM

Tourists Interested In Staying In The Hills Of Grassland - Sakshi

రంపచోడవరం: తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో(గ్రాస్‌ల్యాండ్‌) ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరిసే ప్రాంతం గుడిసె.. ఎత్తయిన కొండలపై క్యాంపెయిన్‌ టెంట్లలో రాత్రంతా ఉండి తెల్లవారుజామున సూర్యోదయం, తాకుతూ వెళ్లే మబ్బులు ఇక్కడ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఈ గుడిసె అందాలు తనివితీరా చూసేందుకు రాష్ట్రాలు దాటి మరి  తరలివస్తున్నారు.  

మారేడుమిల్లికి 40 కిలోమీటర్లు దూరం 
మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీలో గుడిసె గ్రామం ఉంది. గుడిసె గ్రామం చేరుకోవాలంటే మారేడుమిల్లి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏడు కొండలు ఎక్కిన తరువాత విశాలమైన మైదానం పచ్చని గడ్డి ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఈ కొండలు ఉంటాయి. అక్కడి నుంచి మరో నాలుగైదు కొండలు దిగితే గుడిసె గ్రామం వస్తుంది. పర్యాటకులు పచ్చని కొండలపైన రాత్రి బస చేస్తున్నారు. సాయంత్రానికి గుడిసె కొండలపైకి చేరుకుంటున్నారు. రాత్రంతా ఉండేందుకు కావల్సిన ఆహారం కూడా వెంట తెచ్చుకుంటున్నారు. గుడిసెలో పర్యాటకులు గడిపేందుకు సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు  అనుకూలంగా ఉంటుంది. మారేడుమిల్లి నుంచి గుర్తేడు రోడ్డులో ఆకుమామిడి వరకు ప్రయాణించి అక్కడి నుంచి పుల్లంగి మీదుగా గుడిసె వెళ్లే మార్గం వస్తుంది. 

క్యాంపెయిన్‌ టెంట్లకు పెరిగిన గిరాకీ
గుడిసె వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగిన తరువాత క్యాంపెయిన్‌ టెంట్లు అద్దెకు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. రంపచోడవరం, మారేడుమిల్లిలో టెంట్లను అద్దెకు ఇస్తున్నారు. టెంట్‌ సైజును బట్టి రూ.500 నుంచి 750 వరకు వసూలు చేస్తున్నారు. దీనిలో వాటర్‌ ఫ్రూప్‌ టెంట్‌ ఇద్దరు పట్టేది రూ.500, ముగ్గురు ఉండేందుకు రూ.750 చార్జ్‌ చేస్తున్నారు. సాధారణ టెంట్లకు రూ.300 నుంచి రూ.450 వరకు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ వర్షం, చలి నుంచి పర్యాటకులకు పూర్తిగా రక్షణ కల్పిస్తాయి. రోజుకు సుమారుగా 2000 మంది పర్యాటకులు గుడిసె వెళుతున్నారు. వీరిలో కొంత మంది మారేడుమిల్లిలోని రిసార్ట్స్‌లో బస చేసి తెల్లవారు జామునే గుడిసె వెళుతున్నారు. మారేడుమిల్లి నుంచి పర్యాటకులను తరలించేందుకు ఆరుగురు పట్టే వాహనం రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేలు వసూలు చేస్తున్నారు.

 

గుడిసె అందాలు మైమరిపిస్తున్నాయి 
ఎత్తయిన కొండలతో పచ్చని గడ్డి పరుపులుగా ఉన్న గుడిసె  అందాలు మైమరిపిస్తున్నాయి. వణికించే చలిలో రాత్రంతా గడపడం ఎంతో సంతోషంగా ఉంది. ఉదయం కొండల మధ్య నుంచి సూర్యోదయం ఎంతో ఆనందం కలిగించింది. మబ్బులు తాకుతూ వెళుతుంటే ఆ ఆనందం ఎక్కడికి వెళ్లినా దొరకదు. 
– యూసఫ్‌ ఖాన్, పర్యాటకుడు, రాజమహేంద్రవరం 

పర్యాటకుల రాకతో ఉపాధి దొరకుతుంది
ఏజెన్సీకి పర్యాటకుల రాకతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. క్యాంపెయిన్‌ టెంట్లు ఎక్కువ మంది అద్దెకు తీసుకుంటున్నారు. కళ్యాణ్‌ క్యాంయిన్‌ టెంట్స్‌ అండ్‌ టూరిజం పేరుతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కావాల్సిన రీతిలో భోజనం, వసతి ఏర్పాటు చేస్తున్నాం.        
– కళ్యాణ్, రంపచోడవరం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement