కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా జననేత జగన్ చేస్తున్న నిరంతర పోరాటానికి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నాగులాపల్లి ధనలక్ష్మి ఆకర్షితురాలయ్యారు. తన ఉద్యోగాన్ని వదిలి తాను కూడా వైఎస్సార్ సీపీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆమె అభిష్టానికి అనుగుణగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రంపచోడవరం మండలం యర్రంపాలెం ఆశ్రమపాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నాగులాపల్లి ధనలక్ష్మిని రంపచోడవరం నియోజకవర్గ పార్టీ కో–ఆర్డినేటర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బీఏ, బీఈడీ చేసిన ధనలక్ష్మి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె తల్లి రాఘవ 2001 నుంచి 2006 వరకు అడ్డతీగల మండలం గొండోలు సర్పంచిగా పనిచేశారు. తిరిగి 2013లో వైఎస్సార్ సీపీ మద్దతుతో మరోసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలంపాటు తల్లి ప్రజాసేవలో కొనసాగుతున్న నేపథ్యంలో... కుమార్తె ధనలక్ష్మి వైఎస్సార్ సీపీలో చేరి జననేత జగన్‌తో పాటు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్(బాబు) ప్రోద్భలంతో ఆమెకు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగానికి రాజీనామా
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ధనలక్ష్మి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతిని కలిసి శనివారం తన రాజీనామా లేఖను అందజేశారు.
గిరిజనులకు అండగా ఉంటా...
గిరిజనుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ రంపచోడవరం కో–ఆర్డినేటర్‌గా నియమితులైన నాగులాపల్లి ధనలక్ష్మి తెలిపారు. గిరిజనులతో పాటు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, వీటి పరిష్కారమే తన ప్ర«ధాన కర్తవ్యమని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జగన్ సీఎం కావడమే లక్ష్యంగా పార్టీ పట్ల నిబద్దతతో పని చేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టత కోసం కష్టపడి పని చేస్తానన్నారు. తనను కో–ఆర్డినేటర్‌గా నియమించిన పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ప్రాంతీయ పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కో–ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment