మళ్లీ పేలిన మావోల తూటా | Mao fired again, bullet | Sakshi
Sakshi News home page

మళ్లీ పేలిన మావోల తూటా

Published Sun, Sep 14 2014 1:23 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

మళ్లీ పేలిన మావోల తూటా - Sakshi

మళ్లీ పేలిన మావోల తూటా

 వై.రామవరం/రంపచోడవరం/అడ్డతీగల : వై.రామవరం మండలం చామగడ్డ పంచాయతీ పరిధిలోని జంగాలతోట గ్రామంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు తమ మాజీ కమాండరైన మువ్వల నరేష్ అలియాస్ లచ్చి అలియాస్ లక్ష్మణరావు (25)ను కాల్చి చంపారు. నరేష్ మూడురోజులుగా మండలానికి సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వేమనపాలెంలో అత్త వారింట్లో ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి 8 మంది సాయుధ మావోయిస్టులు అక్కడికి వెళ్లారు.
 
 నరేష్‌ను  బలవంతంగా జంగాలతోట తీసుకువచ్చి, నడిరోడ్డుపై గుండెలకు తుపాకీ గురిపెట్టి కాల్చడంతో అక్కడికక్కడే మరణించాడు. 2006లో పోలీసులకు లొంగిపోయిన నరేష్ అప్పటి నుంచి వారికి ఇన్‌ఫార్మర్‌గా మారాడని, హెచ్చరించినా మారకపోవడంతో హతమార్చామని గాలికొండ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు హత్యాస్థలంలో లేఖ పెట్టారు. హత్య వార్త తెలిసిన సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సై ఎస్.లక్ష్మణరావు, సిబ్బంది జంగాలతోట చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
 చిన్నవయసులోనే దళంలో చేరిన నరేష్
 విశాఖ జిల్లా ఎండకోటకు చెందిన నరేష్ 12 ఏళ్ల వయసులోనే 2001లో మావోయిస్టు దళంలో సభ్యునిగా చేరాడు. 2005లో ఏరియా  కమిటీ సభ్యునిగా, 2006లో పలకజీడి ఏరియా కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2006లోనే పోలీసులకు లొంగిపోయాడు. మావోయిస్టుల నుంచి ప్రాణభయం ఉండడం తో వై.రామవరంలో నివసిస్తున్నాడు. లొంగిపోయాక దారకొండ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదివిన నరేష్ మూడేళ్లుగా  వ్య వసాయం చేస్తున్నాడని, ఇప్పుడిలా పొట్టన పెట్టుకున్నారని తల్లిదండ్రులు రోదించారు. నరేష్ రెండేళ్ల క్రితం హేమలతను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు ఒక పాప. తనకు, బిడ్డకు ఎవరు దిక్కని హేమలత సంఘటనా స్థలంలో బోరున విలపించింది.
 
 2007లో అదే గ్రామంలో ఘాతుకం..
 జిల్లా మన్యం చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలు లేకుండా ప్రశాంతంగా ఉంది.  2007లో జంగాలతోటలోనే ఊలెం రాంబాబు అనే వ్యక్తిని పోలీసు ఇన్‌ఫార్మర్ అన్న నెపంతో మావోయిస్టులు హతమార్చారు.  2011లో వై.రామవరం మండలం పాతకోట వద్ద రోడ్డు నిర్మాణ యంత్రాలను తగులబెట్టిన మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని ఇలా చాటుకున్నారు. కొంత కాలంగా చాప కింద నీరులా క్యాడర్‌ను బలోపేతం చేస్తూ వచ్చి, ఇప్పుడు వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ హత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.  షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్న ఈ ప్రాంతంలో హత్యకు తెగబడడం పోలీసుల్ని సై తం ఆశ్చర్యపరిచింది. ఈ హత్యతో కొన్నేళ్లుగా తూర్పు ఏజెన్సీలో ఉన్న ప్రశాంతత భగ్నమైనట్టయింది. మావోయిస్టులు పొరుగున విశాఖ, ఒడిశా, ఖమ్మంల్లో దాడులకు పాల్పడినప్పుడు ఇక్కడే తలదాచుకుంటున్నారు.  గతంలో గిరిజనులను ఇన్‌ఫార్మర్లన్న నెపంతో చంపిన మావోయిస్టులు ఇప్పుడు మళ్లీ అలాంటి ఘాతుకానికి పాల్పడడం, ఈ నేపథ్యంలో పోలీసులు మరింత కరకుగా వ్యవహరించే అవకాశం ఉండడం వారిని కలవరపరుస్తోంది.
 
 ముఖ్యనేతల ఆధ్వర్యంలో దాడులకు సిద్ధం!
 కొంత కాలంగా మావోయిస్టు అగ్ర నాయకులు సైతం జిల్లాలో సంచరిస్తున్నట్టు వచ్చిన వార్తలకు ఈ సంఘటన బలం చేకూర్చుతోంది. మావోయిస్టులు విశాఖ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఉద్యమంలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వీరు దాడులకు సిద్ధమవుతున్నట్టు ని ఘా వర్గాలు భావిస్తున్నాయి. కార్యకలాపాలను విస్తృతం చేసేం దుకు పక్కా ప్రణాళికతో ఉన్నారనడానికి నరేష్ హత్యే సాక్ష్యమంటున్నారు. 2004లో మావోయిస్టులతో చర్చల అనంతరం ప్రభుత్వం నిపేధం విధించింది. దీంతో నల్లమల, ఉత్తర తెలంగాణ ల్లో  ఉద్యమం బలహీనపడి, ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి కార్యకలాపాలు సాగించారు. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్లలో అగ్రనాయకులు దేవన్న, సుధాకర్ చనిపోవడంతో ఇక్కడ ఉద్యమానికి పెద్దదెబ్బ తగిలింది. గోపన్న అరెస్టు తరువాత విశాఖ, తూర్పు ఏజెన్సీలో క్యాడర్ లొంగుబాట్లతో పట్టును కోల్పోయా రు. ఇంత కాలానికి తిరిగి పంజా విసరడం.. ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారనడానికి సంకేతంగా భావించొచ్చు.
 
 గిరిజన యువకుడి హత్య హేయం
 రంపచోడవరం : ఇన్‌ఫార్మర్ అన్న నెపంతో మావోయిస్టులు గిరిజన యువకుడిని హతమార్చడం హేయమని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. మావోయిస్టుల విషయంలో ఇక దూకుడుగా వ్యవహరిస్తామని, విశాఖ ఎస్పీతో చర్చించి గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దింపి, గాలిస్తామని చెప్పారు. వై.రామవరం మండలం జంగాలతోటలో మావోయిస్టులు కాల్చి చంపిన నరేష్ మృతదేహాన్ని ఎస్పీ రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్య కేవలం మావోయిస్టులు ఉనికి చాటుకోవడానికే చేశారన్నారు. గాలికొండ ఏరియా దళ సభ్యులు శరత్, ఆనంద్, జాంబ్రి, ఆజాద్‌తో పాటు 12 మంది వరకూ దళ సభ్యులు ఈ హత్యకు కారకులని తెలుస్తోందన్నారు.
 
 దీనిపై వై.రామవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. విశాఖ సరిహద్దులో పని చేస్తున్న గాలికొండ ఏరియా కమిటీ  తూర్పులోనూ సంచరిస్తూ దళాల్లో యువకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. 2001లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన నరేష్ అనంతరం బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశాడని, వ్యాన్ కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నాడని చెప్పారు. మావోయిస్టులకు సహకరించినా, చందాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తేడు ప్రాంతంలో మావోల కదలికలు ఉన్నాయని, సరిహద్దు రాష్ట్రంలోని మల్కనగిరిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
 
 ఏజెన్సీలో ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశామని, ఏజెన్సీలోని పోలీస్‌స్టేషన్‌లకు గట్టి భద్రత ఉందని చెప్పారు. ఖమ్మం నుంచి విలీనమైన ఆరు పోలీస్ స్టేషన్‌లు సోమవారం నుంచి తూర్పు గోదావరి పోలీసు విభాగం ఆధ్వర్యంలో నడుస్తాయన్నారు. ఆయన వెంట ఏఎస్పీ విజయరావు ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement