రబ్బరు చెట్టు నుంచి రబ్బరు పాలు సేకరణ
ఏజెన్సీలో రబ్బరు సాగుకు ప్రోత్సాహం కరువైంది. గతంలో ఈ పంటను పరిచయం చేసిన రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డుల నుంచి గత కొన్నేళ్లుగా సహకారం అందడం లేదని గిరి రైతులు వాపోతున్నారు. అనుకూలమైన వాతావరణం, అందుబాటులో మార్కెటింగ్ ఉన్నందున సాగు చేపట్టేందుకు చాలా మంది గిరి రైతులు ముందుకు వస్తున్నారు. సాగుకు సహకారం అందిస్తే నిలకడగా ఆదాయం పొందే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
రంపచోడవరం: రబ్బరు సాగుపై ఏజెన్సీ ప్రాంత గిరి రైతులు ఆసక్తి చూపుతున్నారు. రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డు సంయుక్తంగా ఇప్పటికే మన్యంలో రబ్బరు సాగు చేపట్టాయి. రబ్బరు సాగుకు మారేడుమిల్లి, వై.రామవరం మండలాల వాతావరణం అనుకూలం. గతంలో రబ్బరు సాగును ఐటీడీఏ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. తరువాత కాలంలో రబ్బరు సాగుకు ఐటీడీఏ నుంచి సహకారం అందడం లేదని గిరి రైతులు వాపోతున్నారు.
మొట్టమొదటిగా దేవరపల్లిలో..
మారేడుమిల్లి మండలంలోని దేవరపల్లి గ్రామం రబ్బరు సాగుకు అనుకూలమని గుర్తించిన రబ్బరు బోర్డు 1994లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో రబ్బరు మొక్కలు నాటించింది. ఆ గ్రామంలో 35 గిరిజన కుటుంబాలను భాగస్వామ్యులను చేసి మొక్కలను పెంచింది. రెండో దశలో 1998లో మారేడుమిల్లి మండలంలోని పూజారిపాకలు, వేటుకూరు గ్రామాల్లో 45 హెక్టార్లలో రబ్బరు సాగు చేపట్టింది.
గిరిజన రైతులు తమ భూముల్లో రబ్బరు మొక్కలను సంరక్షణ చేసుకునేందుకు రబ్బరు బోర్డు రోజు వారి కూలి చెల్లించి ప్రోత్సహించేది. మూడో దశలో పందిరిమామిడికోట గ్రామంలో 2009–2015 మధ్య 75 కుటుంబాలకు చెందిన100 హెక్టార్ల భూమిలో రబ్బరు మొక్కలు నాటింది. మంచి ఫలితాలు రావడంతో రంపచోడవరం ఐటీడీఏ రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. 2009 నుంచి 2010 వరకు దఫదఫాలుగా 10 వేల ఎకరాల విస్తీర్ణంలో రబ్బరు మొక్కలు నాటించింది.
సాంకేతిక సలహాలు అందక..
భారీ విస్తీర్ణంలో రబ్బరు సాగు చేపట్టడం, వీటి మొక్కల పెంపకంలో గిరిజనులకు సరైన సాంకేతిక సలహాలు అందకపోవడంతో అనేక చోట్ల నాటిన రబ్బరు మొక్కలు చనిపోయాయి. చివరకు 2500 ఎకరాల్లో మాత్రమే రబ్బరు తోటలు ఉన్నాయి. రబ్బరు సాగు ద్వారా ఆర్థికంగా బలపడిన గిరిజన రైతులు రబ్బరు మొక్కలు పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. గత పదేళ్ల కాలం నుంచి గిరిజన రైతులు సొంతంగా రబ్బరు షీట్లు తయారు చేసి మార్కెట్ చేసుకుంటున్నారు.
మారేడుమిల్లి రబ్బరు మంచి గిరాకీ..
మారేడుమిల్లి ప్రాంతంలో తయారు చేస్తున్న రబ్బరుకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. రబ్బరు షీట్ల అమ్మకంలో గిరిజన రైతులు మోసపోయే పరిస్థితి లేదు. రబ్బరు షీట్ల మార్కెట్ రేటును రబ్బరు బోర్డు అధికారులు రోజు ఆన్‌లైన్‌లో తెలియజేస్తారు. అదే రేటుకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. రబ్బరు సాగుకు చల్లని వాతారణం అనుకూలంగా ఉంటుంది.
ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం ఎగువ ప్రాంతాలు సముద్రమట్టానికి ఎత్తుగా ఉండడంతో ఇక్కడ వాతావరణం అన్ని పంటలకు అనుకూలం. ఎకరాలో 200 వరకు రబ్బరు మొక్కలు నాటుకోవచ్చు. ఏటా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు రబ్బరు ట్యాపింగ్ (రబ్బరు పాలు సేకరణ)అనుకూలం. ఉదయం రెండు గంటల పాటు ఒకరు కష్టపడితే ఎకరా విస్తీర్ణంలో ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.
రబ్బరు బోర్డు ఎత్తివేసే దిశగా..?
ఏజెన్సీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నాటిన రబ్బరు మొక్కలు ప్రస్తుతం పాల సేకరణకు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రంపచోడవరంలోని రబ్బరు బోర్డు కార్యాలయాన్ని ఎత్తివేసే దిశగా కేంద్ర రబ్బరు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ పనిచేసే ఏడీ, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసింది. రంపచోడవరం రబ్బరు కార్యాలయంలో ప్రస్తుతం ఒక్క రికార్డ్ అసిస్టెంట్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
ఐటీడీఏ సహకారం అందించాలి
పొలంలో రబ్బరు మొక్కలను నాటుకోవాలని ఉంది. అనేక సార్లు ఐటీడీఏ అధికారులను మొక్కలు అడిగాం. ఐటీడీఏ మొక్క లు సరఫరా చేస్తే రబ్బరు తోట వేసుకుంటాం. గ్రామంలో అనేక మంది రబ్బరు మొక్కలు పెంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఐటీడీఏ సహకారం అందించాలి. గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసుకుంటాం. అందుకు సహకారం అందించాలి.
– కత్తుల సోమిరెడ్డి, పందిరిమామిడికోట
రబ్బరు సాగును ప్రోత్సహించాలి
ఏజెన్సీలో రబ్బరు సాగుకు అనుకూలమైన మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో రబ్బరు సాగుకు అధికారులు చర్యలు చేపట్టాలి. గిరిజనులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎంతో అవకాశం ఉన్న రబ్బరు సాగుపై మారేడుమిల్లి ప్రాంత గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు.
– దూడ స్మిత్ , మారేడుమిల్లి
40 ఏళ్లపాటు ఆదాయం
రబ్బరుమొక్క నాటిన ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో పాల సేకరణ చేసుకోవచ్చు. రబ్బరు మొక్క 40 ఏళ్ల పాటు ఆదాయం ఇస్తుంది. మొక్కలను జాగ్రత్తగా పెంచుకుంటే ఎకరానికి రూ. లక్ష వరకు పొందవచ్చు. మణిపూర్ లాంటి చల్లని ప్రాంతంలో కొండల్లో కూడా రబ్బరు సాగు చేస్తున్నారు. పాడేరు , అరకులో వాతావరణ పరిస్థితులు రబ్బరు సాగుకు అనుకూలం. రంపచోడవరం ఐటీడీఏ నాటిన రబ్బరు మొక్కలు పాల సేకరణకు వచ్చాయి. ఇలాంటి సమయంలో రైతులకు రబ్బరు బోర్డు టెక్నీషియన్ల సహకారం అవసరం ఉంది.
– సరిపల్లి సాల్మన్‌రాజు, ఫాం ఆఫీసర్, మణిపూర్
Comments
Please login to add a commentAdd a comment