గిరిజన వృద్ధురాలి కాళ్లు కడుగుతున్న కలెక్టర్ మిశ్రా
వైరామవరం (రంపచోడవరం) : వై.రామవరం మండలం శేషరాయి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. మండలంలోని యార్లగడ్డ పంచాయతీ పరిధిలోని మరుమూల ప్రాంతమైన శేషరాయిని గురువారం ఆయన సందర్శించారు. ఆ గ్రామస్తులు ఆయనకు గిరిజన సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి, పూలమాల వేసి స్వాగతం పలికారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్ అధ్యక్షతన ఆ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
అర్హులైన వారందరికీ కులధ్రువీకరణ పత్రాలు అందించాలనే లక్ష్యంతో ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. శేషరాయి గ్రామంలో రచ్చబండ, అంగన్‌వాడీ కేంద్రం, అందరికీ పక్కాగృహాలు నిర్మిస్తామన్నారు. వీధివీధికీ సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. వై.రామవరం నుంచి శేషరాయికి, వై.రామవరం నుంచి మఠం భీమవరం మీదుగా గుర్తేడు రోడ్డుకు అటవీశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను తొలగించి, త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు.
అనంతరం సుమారు 40 మందికి కుల ధ్రువీకరణ పత్రాలు అందించారు. మహిళా సంఘాలకు ట్యాబ్‌లు అందించారు. రైతులకు పురుగుమందుల స్ప్రేయర్స్, బరకాలు అందించారు. చవిటిదిబ్బలు పీహెచ్‌సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అందిస్తున్న దోమతెరలను పరిశీలించారు. ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణం ప్రారంభం కాగానే గ్రామంలోని ఇద్దరు యువకులకు జీపులు కొనిస్తామని చెప్పారు.
ఆ గ్రామంలోని పిల్లలను యార్లగడ్డ గ్రామంలోని పాఠశాలకు తరలించడానికి వాహనాన్ని సమకూరుస్తామన్నారు. అనంతరం అక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో, దారలోవ గ్రామ సమీపంలో ఉన్న దుమ్ముకొండ జలపాతాన్ని సందర్శించారు. 10 కిలోమీటర్ల దూరం నిటారుగా ఉన్న పెద్దకొండపైకి కాలినడకన వెళ్లారు. ఆ జలపాతంతోపాటు, అటవీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను తిలకించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా జలపాతం వద్దకు రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రం వల్ల శేషరాయి గ్రామానికి ఆదాయం చేకూరుతుందన్నారు. అనంతరం మార్గమధ్యలోని గురమంద విశ్వనాథుని దర్శించుకున్నారు.
వృద్ధురాలి కాళ్లు కడిగిన కలెక్టర్
శేషరాయిలోని పల్లాల లక్ష్మమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలికి కలెక్టర్ కార్తికేయమిశ్రా పసుపునీళ్ళతో కాళ్ళు కడిగారు. ఆమెను తనను దీవించమని కోరారు. నూరేళ్లూ సుఖసంతోషాలతో జీవించాలని ఆ వృద్ధురాలు కలెక్టర్‌ను దీవించింది.
కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, వెలుగు ఏపీడీ సత్యంనాయుడు, మండల ప్రత్యేకాధికారి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ పీకే నాగేశ్వరరావు, అడ్డతీగల సీఐ ఎ.మురళీకృష్ణ, తహసీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ, ఎంపీడీఓ కె.బాపన్నదొర, ఎం ఈఓ కె.ప్రసాదబాబు, సర్పంచ్‌లు దాగేరి పొట్టమ, గుడ్ల సత్యవతి, మాజీ సర్పంచ్ పల్లాల కాశీ విశ్వనాథరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లాల వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్, గ్రామపెద్దలు దాగేరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment