tribal area
-
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకి ఆ గ్రామానికి ‘కరెంట్’ కనెక్షన్
శ్రీనగర్: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్నా ఇంకా చాలా గ్రామాలు కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మారుమూల ప్రాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే కోవకు చెందుతుంది జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా డూరు బ్లాక్ పరిధిలోని టెథాన్ గ్రామం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంలో భాగంగా ఆ ఊరికి విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేశారు అధికారులు. అనంతనాగ్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి 75 ఏళ్ల తర్వాత కరెంట్ సరఫరా జరుగుతోంది. అనంతనాగ్ కొండ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామం టెథాన్‌లో సుమారు 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం డెవలప్మెంట్ ప్యాకేజీ స్కీమ్‌లో విద్యుత్తు సరఫరాను అందించారు అధికారులు. గ్రామంలో 75 ఏళ్ల తర్వాత తొలి విద్యుత్తు దీపం వెలిగింది. తమ ఇళ్లల్లో విద్యుత్తు కాంతులు చూసి అక్కడి ప్రజలు మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు తమ అవసరాల కోసం సాంప్రదాయ కలప, దీపాలను వాడేవారు. ‘ఈరోజు తొలిసారి విద్యుత్తు కాంతులను చూస్తున్నాం. ఇకపై మా పిల్లలు విద్యుత్తు దీపాల కింద చదువుకుంటారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. కరెంట్ లేకపోవడంతో చాలా కష్టాలు పడ్డాము. ఇప్పటి వరకు మా అవసరాల కోసం సంప్రదాయ కలపను ఉపయోగించాం. ఇప్పుడు మా సమస్యలకు ఓ పరిష్కారం లభించింది. ప్రభుత్వానికి, విద్యుత్తు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.’ అని ఫాజుల్ ఉదిన్ ఖాన్ అనే గ్రామస్థుడు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యుత్తు కాంతులను చూసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు. ఇదీ చదవండి: ‘కశ్మీర్లో భాగం కావడమే మంచిది’.. విలీనానికే లద్దాఖ్ నేతల మొగ్గు! -
యుగ పురుషుడు.. ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆ తర్వాత..
ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలీరాజపూర్‌లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు. అనంతరం మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. 15 ஆண்டுகள் 3 பெண்களுடன் லிவிங் டுகெதர்.. 6 குழந்தைகள் முன்னிலையில் நடைபெற்ற திருமணம்..! #MadhyaPradesh | #Alirajpur | #LiveInRelationship pic.twitter.com/lUVxNdwkuX — Polimer News (@polimernews) May 3, 2022 ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి కూడా మౌర్యను అనుమతించలేదని అన్నాడు. కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. Madhya Pradesh: A man living in a live-in relationship with three women entered into a wedlock with all the three in the presence of the entire village. The wedding took place in Nanpur village in the tribal-dominated Alirajpur district. pic.twitter.com/oePIwFb5ss — Free Press Journal (@fpjindia) May 2, 2022 -
రక్తపు వాంతులు.. అంతుపట్టని వ్యాధి
సాక్షి, ములుగు : ఓ వింతవ్యాధి ఆ గ్రామాన్ని కబలిస్తోంది. వరుస మరణాలు ఆ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో ఆరుగురు బలయ్యారు. దీంతో తమ గ్రామానికి ఎవరో చేతబడి చేశారని ఆందోళన చెందుతున్న అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోతున్నారు. ప్రాణ భయంతో ఊరు వదిలి వలస వెళ్ళిపోతున్నారు. వారిని బలి తీసుకుంటున్న ఆ వ్యాదేంటో వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇది ములుగు కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామం. వరంగల్‌కు 145 కి.మీ దూరంలో, ములుగు జిల్లా కేంద్రానికి 95కి.మీ దూరంలో వుండే ఏటూరునాగారం ఏజెన్సీలోని ఓ మారుమూల గ్రామం ఇది. ఈ కుగ్రామం గత 20 రోజులుగా మృత్యు భయంతో బెంబేలెత్తిపోతోంది. (20 రోజుల్లో ఆరుగురు మృతి.. కారణం?) ఎవరిని పలుకరించినా మృత్యు భయమే గ్రామంలో ఏ ఒక్కరికి కంటిమీద కునుకు లేదు. ఏ ఇంట్లో అలికిడి అయినా ఏదో జరిగి పోతుందనే ఆందోళన వెంటాడుతుంది. కడుపునొప్పి జ్వరంవస్తే చాలు.. ఇక చావు తప్పదని ఆందోళన. అందుకు కారణం గత 20 రోజుల్లో ఈ గ్రామానికి చెందిన ఆరుగురు చనిపోవడమే. వాళ్లకు కడుపునొప్పి వచ్చిన కొద్దిసేపటికే కడుపంతా ఉబ్బి రక్తంతో వాంతులు చేసుకొని కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఎర్రయ్య, లక్ష్మీనారాయణ, కుమారి, దుర్గమ్మ, రమేష్, రాధిక అనే ఆరుగురు ఒకే రకమైన వింతవ్యాధితో చనిపోయారు. అంతా కడుపు ఉబ్బి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో ఎవరికైనా కడుపునొప్పి వచ్చిందంటేచాలు చావు తప్పదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముప్పునపల్లిలో ఎటు చూసినా విషాద వాతావరణమే అలముకొని ఉంది. మరణించిన వారి ఫ్లెక్సీలు, ఇళ్లకు తాళాలే వేలాడుతున్నాయి. ఎవరిని పలుకరించినా మృత్యు భయమే కనిపిస్తుంది. ఇప్పటివరకు మరణించిన వారంతా అంతా ఒకే విధంగా వింత వ్యాధితో మృతి చెందడంతో ఊరికి ఎవరో చేతబడి చేశారని, ఏదో శక్తి ఈ ఊరిని ఆవహించిందని ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులకూ అంతు చిక్కని రోగం ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అంతుచిక్కని వింత వ్యాధి వారి ప్రాణాలు మింగేస్తుండడంతో ఊరంతా ప్రాణభయంతో ఊరి విడిచి వలసబాట పట్టారు. ఇప్పటికే 40కి పైగా కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ళు, ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో ఏ ఇంటికి చూసినా ఇలా తాళాలు వేలాడుతున్నాయి. ఏదో శక్తి ఊరిని ఆవహించిందని ఆందోళన చెందుతున్న ఇక్కడి ప్రజలు ఇక్కడ ఉంటే ప్రాణాలు మిగలవనే ఆందోళనతోనే ఊరువిడిచి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. వింతవ్యాధితో ఊరంతా మృత్యువాత పడుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించారు. చనిపోయిన వారితోపాటు ప్రస్తుతం బ్రతికి ఉన్నవారి కుటుంబ సభ్యులకు మలేరియా, కరోనా, డెంగ్యూ టైపాయిడ్ టెస్టులు నిర్వహించారు. కానీ ఎలాంటి ఫలితంలేదు. నెగిటివ్ గానే వస్తుంది. ఈ చావులకు కారణమేమిటో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అంతు చిక్కడం లేదు. మూఢనమ్మకాల వైపు అడుగులు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే మకాంవేసి మరోచావు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వరుస మరణాల నేపథ్యంలో మూఢనమ్మకాల వైపు అడుగులు వేస్తున్నారు. కచ్చితంగా ఏదో శక్తి ఆవహించిందని, చేతబడి చేశారని గ్రామమంతా ఆందోళన చెందుతుండడంతో స్థానిక సర్పంచ్ కూడా అయోమయంలో చిక్కుకున్నారు. వైద్యులకు కూడా ఈ వ్యాధి అంతుచిక్కకపోవడం వల్ల మూఢ నమ్మకాలవైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఊళ్ళో మిగిలిన15 కుటుంబాలు చీకటి పడితేచాలు ఒక్కచోట చేరి మృత్యువును జయించేందుకు మానవ ప్రయత్నాలు చేస్తూ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారి మరణాలకు కారణాలు తెలియదు... ఎప్పుడు ఎవరు బలవుతారో అర్థంకాక వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భీతిల్లుతున్నారు. -
ఏపీ బడ్జెట్ : గిరిజన జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజా బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. వందల సంవత్సరాలుగా అడవుల్లో కొండల్లో నివసిస్తున్న గిరిజనులు సంక్షేమం కాయితాల్లో కనిపిస్తోందిగానీ.. వారి జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. వారి కష్టాలను చూసిన వైఎస్ జగన్ సర్కార్.. గిరిజనం బతుకుల్లో వెలుగులు నింపాలని గట్టి సంకల్పంతో ఉంది. దీనిలో భాగంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యంపై బడ్జెట్లో ప్రత్యేక చర్యలు తీసుకుంది. 2020-21 బడ్జెట్లో గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. (విశాఖనే పరిపాలన రాజధాని) గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం కోసం విశాఖపట్నం జిల్లా పాడేరులో వైఎస్సార్ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్‌పురం, శ్రీశైలంలో అదనంగా ఆరు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు తగిననిధులను బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇక ఉన్నత విద్యను గిరిజన విద్యార్థులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సంస్కృతికి, కళలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలు చేయడానికి విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరాలను వెల్లడించారు. -
నేస్తానికో గుమ్మడి..!
సాక్షి, శ్రీకాకుళం: సంక్రాంతి అంటేనే సందడి. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన వేడుక. గిరిజనుల్లో సంక్రాంతిని చాలా మంది విభిన్నంగా జరుపుకుంటారు. కొండల్లో పోడు పంటలను పండించుకుని జీవించే గిరిజనులు దిగువ ప్రాంతాల్లో ఉంటున్న ఇతర కులాల వారితో నేస్తరికం (స్నేహం) చేస్తుంటారు. సంక్రాంతి పండగతో పాటు దసరా, దీపావళి, ఉగాది వంటి పండగలు వచ్చాయంటే గిరిజన సంప్రదాయ ప్రకారం నేస్తం ఇంటికి వారు అప్పటికి పండించే రకరకాల పంటలను తీసుకుని వెళుతుంటారు. భోగీ రోజున నేస్తం ఇంటికి వెళ్లే గిరిజనులు గుమ్మడికాయ, పెండ్లం (కూరకోసం), అరటి కాయలు, అర టి పళ్లు, కందికాయలు, కందులు, అరటి ఆకులు తీసుకుని వెళుతుంటారు. పండగకు వచ్చే తమ గిరిజన నేస్తానికి దిగువ ప్రాంతంలోని వారు రకరకాల వంటలతో భోజనం పెట్టి కొత్తబట్టలు, బియ్యం, పప్పులు, పిండి వంటలు, దారి ఖర్చులకు కొంత మొత్తం డబ్బులు ఇచ్చి నేస్తాన్ని సంతృప్తి పరిచి పంపిస్తారు. ఇలా సంతృప్తి పొందిన గిరిజన నేస్తం మనసు నిండా దీవించడం ఆనవాయితీ. -
మృతదేహంతో 3 కి.మీ. నడక..!
కొచ్చి : కేరళ పోలీసుల తీరుపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (కేఎస్‌హెచ్చార్సీ) మండిపడింది. ఇద్దరు ఆదివాసీల భుజాలపై దాదాపు మూడు కిలోమీటర్లు మృత దేహాన్ని తరలించిన ఘటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ చీఫ్ సెక్రటరీ, ఎర్ణాకులం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. వివరాలు.. ఎర్ణాకులం జిల్లాలోని కుత్తంపుజా పరిధిలోని కుగ్రామం కాంజీపురలో సోమన్ (37) అనే వ్యక్తి వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అయితే, మృతదేహాన్ని వాహనంలో కాకుండా ఇద్దరు ఆదివాసీలు భుజాన మోసుకెళ్లారు. కాలినడకన 3 కి.మీ ప్రయాణించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తల్ని సుమోటోగా తీసుకున్న కేఎస్‌హెచ్చార్సీ పోలీసుల తీరును తప్పుబట్టింది. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సీఎస్‌కు ఆదేశాలిచ్చింది. కాగా, సరైన రోడ్డు వసతి లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని జిల్లా ఎస్పీ కె.కార్తీక్ తెలిపారు. రోడ్డు సరిగా లేకపోవడంతో పోలీసులు అక్కడికి కాలి నడకన చేరుకుని మృతదేహాన్ని తెచ్చేందుకు ఆ గ్రామస్తుల సాయం తీసుకున్నారని చెప్పారు. కాంజీపురకు ఇప్పటివరకు విద్యుత్, రోడ్డు రవాణా సదుపాయాలు లేవని వెల్లడించారు. -
మా ఊరికి డాక్టరొచ్చిండు
అన్ని వసతులు సవ్యంగా, పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో డ్యూటీలకు వెళ్లమంటేనే డాక్టర్లు, ఇతర ప్రభుత్వాధికారులు అలసత్వం వహిస్తారు. తప్పదనుకుంటే వారంలో రెండ్రోజులు అలా వెళ్లి ఇలా రావడమే మహా గగనం. అలాంటిది దట్టమైన అరణ్యంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని వెళ్లాల్సిన గ్రామాల్లో వైద్య పరిస్థితి సంగతి గురించి మాట్లాడుకోవడం తప్పే. జ్వరమొస్తేనే దేవుడిపై భారం వేసే ఆదివాసీ గ్రామాలకు లెక్కేలేదు. సీజన్ మారిందంటే చాలు ఏజెన్సీల్లో పడకేసిన వైద్యం, విషజ్వరాలతో చనిపోయే సాటి మనుషుల గురించి లెక్కలేనన్ని వార్తలు చదువుతుంటాం. మారుమూల గిరిజన పల్లెల్లో ఇప్పటికీ డాక్టర్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. వారం, రెండువారాలకోసారి ఓ ఆశ వర్కర్ వస్తే వస్తారు లేకుంటే అదీ లేదు. అలాంటిది ఓ మండల వైద్యాధికారి.. వైద్య సిబ్బందిని వెంటబెట్టుకుని తమ వద్దకే వస్తే.. ఇది అలాంటి తండాల ప్రజల ఊహకు కూడా అందదు. కానీ ములుగు జిల్లా వాజేడు వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు దీన్ని నిజం చేసి చూపించారు. కనీస వైద్య సేవలు గిరిజనుల హక్కు అని గుర్తించి తానే స్వయంగా ఓ గిరిజన తండాకు వెళ్లి వైద్యసేవలందించారు. వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలో గుట్టలపైన ఉన్న పెను గోలు ఓ ఆదివాసీల కుగ్రామం. ఊళ్లో 18 ఇండ్లు, 23 కుటుంబాలు, 78 మంది జనాభా ఉన్నారు. వీరికి మట్టిరోడ్డు సౌకర్యం కూడా లేదు. గుట్ట దిగొస్తేనే సరుకులు, వైద్యం అందేది. ఒకట్రెండు కిలోమీటర్లు కాదు 15 కిలోమీటర్ల మేర గుట్ట పైకెక్కి దిగి కిందకు రావడం సులభమేం కాదు. వర్షాకాలంలోనైతే అదో పెద్ద యజ్ఞమే. ఒకే వాగును మూడు చోట్ల దాటాల్సి ఉంది. ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలీని పరిస్థితి వీరిది. పది, పదిహేను రోజులకోసారి ఆశ వర్కర్, ఏఎన్ఎంలు వచ్చి ఏదో మందులు ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడి గిరిజనులకు వైద్యమందిం చాలని జిల్లా వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు సంకల్పించారు. సబ్యూనిట్ ఆఫీసర్ శరత్ బాబు, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, శేఖర్, చిన్న వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం రాజేశ్వరి, ఆశ వర్కర్ సమ్మక్కతో కలిసి గురువారం ఉదయం ఏడు గంటలకు వాజేడు నుంచి బయలు దేరారు. గుమ్మడిదొడ్డి గ్రామ చివర నుంచి గుట్ట ఎక్కుతూ 5 గంటల పాటు మధ్యలో వాగును మూడుచోట్ల దాటి 15 కిలోమీటర్లు కాలినడకన పెనుగోలుకు చేరుకున్నారు. ఆదివాసీలకు వైద్య పరీక్షలు ఆశ వర్కర్, ఏఎన్ఎం రావడమే ఎక్కువైన ఆ ఊరికి వైద్య సిబ్బంది వచ్చారనే సమాచారంతో గ్రామస్తులంతా ఒక్క చోటికి చేరారు. ముందు గిరిజనులతో మాట్లాడిన వైద్య బృందం అందరినీ పరీక్షించి అవసరమైన మందులు ఇచ్చారు. రోగులను పరీక్షించే సమయంలో ఊకే శ్రీలత, బొగ్గుల మల్లేష్, జనార్దన్‌లకు మలేరియా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించి వైద్యం అందించారు. మరో 10 మందికి జ్వరాలు ఉండటంతో వారికి వైద్యం చేశారు. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వారికి చికిత్స చేసి మందులు ఇచ్చారు. ఆ తరువాత గ్రామస్తులకు దోమ తెరలను పంపిణీ చేసి 18 గృహాల్లో దోమల మందు పిచికారీ చేశారు. వర్షంతో ఆగిన ప్రయాణం మధ్యాహ్నం 12 గంటలకు పెనుగోలుకు చేరుకున్న వైద్య బృందం ఆదివాసీలకు పరీక్షలు, మందులు, దోమ తెరల పంపిణీ పూర్తయ్యే సమయానికి వర్షం ప్రారంభమైంది. దీంతో గురువారం రాత్రి అక్కడే బసచేశారు. తమకు కలగా మారిన వైద్యాన్ని అందించిన అధికారులపై ఆది వాసీలు తమ గౌరవాన్ని చాటుకున్నారు. వైద్య సిబ్బందికి భోజనాలు పెట్టడంతోపాటు పడుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో గుడ్డి దీపాల వెలుగులోనే వైద్యాధికారి సహా సిబ్బంది విశ్రమించారు. ఉదయం లేవగానే వాజేడుకు రావడానికి పయనమైన వైద్య సిబ్బందికి జోరు వర్షంలోనూ గ్రామ స్తులు వెంటుండి వాగు దాటించారు. గుమ్మడిదొడ్డి గ్రామం వరకు మెడికల్ కిట్లను మోసుకొచ్చి దింపి వెళ్లారు. వైద్యం చేసి వాజేడుకు చేరుకునేంతవరకూ ఆ గ్రామస్తులు కొందరు వీరి వెంటే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఇంతవరకు ఎవరూ తమ ఊరివైపు కన్నెత్తి కూడా చూడలేదని డాక్టర్ మంకిడి వెంకటేశ్వర్లు సేవలను జీవితాంతం గుర్తుంచుకుంటామని పెనుగోలు గ్రామస్తులు తెలిపారు. అదో మధురానుభూతి గుట్టల పైనున్న పెనుగోలు గిరిజనులకు వైద్యం అందించడం మధురానుభూతిని మిగిల్చింది. అక్కడికి వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. అది ఇప్పుడు కుదిరింది. వారి ఆతిథ్యం, ఆదరణ మర్చిపోలేనివి. నేను పడుకున్నప్పుడు ఓ తేలు నా దగ్గరగా వస్తే దాన్ని గుర్తించి గ్రామస్తులు చంపారు. చిమ్మ చీకట్లో వారు ఉంటున్న దృశ్యం కలవరం కలిగించింది. – మంకిడి వెంకటేశ్వర్లు, వైద్యాధికారి -
ఇంతింతై వనితింతై
మనిషికి రెండు చేతులు ఉన్నట్లే..ప్రతి మనిషి జీవితానికీ రెండు చేతులు ఉంటాయి.ఒకటి నిలబెట్టే హ్యాండ్.ఇంకోటి పడగొట్టే హ్యాండ్. కట్నం వేధింపులు.. భర్త మరణం..ఆడపిల్లకు జన్మనివ్వడం.. శివదేవి లైఫ్‌లో అన్నీ పడగొట్టే హ్యాండ్సే! అయినా ఆమె నిలబడింది. ఇంతింతై.. వనితింతై అన్నట్లు ఎదిగింది.ఏమీ మిగల్చని జీవితంలోంచి...చుట్టూ ఉన్న బతుకుల్ని తన అక్షరాలతో దిద్దేంతగా ఎదిగింది! శివదేవి.. ఉత్తరప్రదేశ్, బందా జిల్లాలో ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు. ఓ దశాబ్దం కిందట శివదేవి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి అత్తింటికి పంపించారు. అప్పుడు వాళ్లు అనుకున్నది చక్కటి వియ్యం అందుకున్నామని. అయితే కూతురి అత్తింటి వారు మాత్రం కయ్యానికి కాలు దువ్వారు! ఇంకా పెళ్లి పీటల మీద ఉండగనే కట్నం చాల్లేదంటూ గొంతెమ్మ కోరికలతో కొత్త కోడలిని హడలెత్తించారు. కయ్యాల మధ్యనే వియ్యాల వారింట్లో కూతుర్ని వదిలి పెట్టారు శివదేవి తల్లిదండ్రులు. కాపురం కష్టాలమయం అని తెలుస్తున్నప్పటికీ పుట్టింటివాళ్లకు భారం కాకూడదని కాలం నెట్టుకొచ్చింది శివదేవి. ఈ కష్టాలు చాలవన్నట్లు ఆమె భర్త అనారోగ్యంతో హఠాత్తుగా మరణించాడు. అప్పటికామె నిండు గర్భిణి. ‘అమ్మగారు అడుగు పెట్టింది.. ఇలా జరిగింది’ అనే దెప్పిపొడుపుల మధ్య పాపాయికి జన్మనిచ్చింది. అసలే డబ్బు పిచ్చి పట్టి ఉన్న అత్తగారిల్లు. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి పోయాడు. పైగా పుట్టింది ఆడపిల్ల. ఒక నిస్సహాయురాలైన మహిళకు ఇంతకంటే నరకం ఇంకేం కావాలి? శివదేవిది అదే పరిస్థితి. భవిష్యత్తు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయకపోతే బతకలేనని మాత్రం తెలుస్తోంది. పోతే అటే పో... ఇక రాకు! ఆదివాసీ, దళిత మహిళలకు వృత్తివిద్యలో శిక్షణనిస్తారని తెలుసుకుంది శివదేవి. అది ఆరు నెలల కోర్సు, ఆ కోర్సులో చేరి చదువుకుంటానని అత్తగారిని అడిగింది. ‘చదువు, శిక్షణ అంటూ వెళ్లాలనుకుంటే... వెళ్లు. ఇక తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టకు’ అని కసిరింది అత్త. ఇంట్లోనే ఉండడమా, ట్రైనింగ్‌కి వెళ్లడమా అనే సందిగ్ధం నుంచి శివదేవి త్వరగానే బయటపడింది. అప్పటికే ఇంట్లో ఓ సారి ఆమె మీద హత్యాప్రయత్నం జరిగింది. ఆ రోజు... తాను తినాల్సిన భోజనం విషపూరితమైంది. అప్పటికి ఇంట్లో అందరూ భోజనం చేశారు. ఆ రోజు భోజనం ఎందుకు విషపూరితమైందో ఆ భగవంతుడికే తెలుసు. తాను ఆ రోజు ఆ భోజనం తినకపోవడానికి కారణమూ ఆ దైవలీల మాత్రమే. పూజ చేసుకున్నాను, వాయనం తీసుకోమంటూ పక్కింటి వాళ్ల కోడలు పిలిచింది. ఆ రోజు అక్కడే భోజనం చేసింది తాను. తాను పక్కింట్లో భోజనం చేసినట్లు తెలిసిన తరవాత తన భోజనాన్ని అత్త రహస్యంగా పారవేయడమూ కంటపడింది. దానిని తిన్న ఇంటి పిల్లి మరణించడం కూడా. ఆ సంఘటన కళ్ల ముందు మెదలగానే శివదేవి ఒక నిర్ణయానికి వచ్చేసింది. తనకు, తన బిడ్డకు ఆ ఇంట్లో రక్షణ లేదు. రక్షణ ఇవ్వలేని ఇంటికోసం ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన అవసరం లేదనుకుందామె. తన పుట్టింటి వాళ్లను ‘ఆ ఆరు నెలలు పాపాయిని దగ్గర ఉంచుకుంటే, నేను ఆరు నెలల పాటు ట్రైనింగ్‌కి వెళ్తాను. ఆ తర్వాత నా జీవితానికి ఒక దారి ఏర్పరుచుకుంటాను. నా కాళ్ల మీద నేను నిలబడతాను’ అని అడిగింది. కూతుర్ని ఆ రొంపిలో నుంచి ఎలా బయటకు తీసుకు రావాలో తెలియక ఆవేదనతో నలిగిపోతున్న శివదేవి తల్లిదండ్రులు, ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకున్నారు. రిపోర్టర్‌గా ఉద్యోగం! ఆరు నెలల శిక్షణలో శివదేవికి తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఎప్పుడో స్కూల్లో చదివి మర్చిపోయిన అక్షరాలను మళ్లీ పరిచయం చేసుకుంది. కోర్సు పూర్తయింది. చదవడం, రాయడంలో పట్టు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. బతుకు పోరాటం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదామెకి. తన ఫ్రెండ్ అనసూయ సలహా ప్రకారం ‘ఖబర్ లహరియా’ పత్రిక ఆఫీసుకు వెళ్లింది. బుందేలీ భాషలో ప్రచురితమవుతుంది. అణగారిన వర్గాల మహిళల సమస్యలకు అద్దం పట్టే పత్రిక అది. అభ్యుదయ భావజాలం కలిగిన మహిళల బృందం ఆ పత్రిక నడుపుతున్నది. శివదేవితో మాట్లాడిన తర్వాత ఆమె పుస్తకాల చదువుకంటే లోకాన్ని, మహిళల కష్టాలను బాగా చదివిందని అర్థమైంది పత్రిక నిర్వహకులకు. పెద్ద పెద్ద పుస్తకాలు చదవకపోయినప్పటికీ ఆమె పితృస్వామ్య,పెట్టుబడిదారీ సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పగలుగుతోంది. ఆమె చూసిన జీవితాలను, వాళ్ల స్థితిగతులను రిపోర్ట్ చేస్తే చాలనుకున్నారు ఖబర్ లహరియా నిర్వహకులు. ఆమెకు రిపోర్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. రాళ్లు రప్పల మధ్య ప్రయాణం శివదేవి రిపోర్ట్ చేయాల్సిన సంఘటనలన్నీ గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లోనే ఉంటాయి. దారి డొంక లేని, బస్సు ముఖం చూడని మారుమూల గ్రామాలకు వెళ్లాలి. నోట్ ప్యాడ్, పెన్ను ఉన్న బ్యాగ్, తలకు స్కార్ఫ్ చుట్టుకుని సైకిల్‌మీద వెళ్తుంటే దళిత వాడలు ఆశ్చర్యంగా చూశాయామెను. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా అత్తగారింటికి చేరింది. వాళ్ల అసహనం హద్దులు దాటింది. కానీ ఆమె మీద దాడి చేయడానికి.. ఇప్పుడామె ఉన్నది తమింటి నాలుగ్గోడల మధ్య కాదు. అప్పటి నిస్సహాయ బేల కాదు. ఆమెను నిలువరించడం తమకు సాధ్యమయ్యే పని కాదని పళ్ల బిగువున భరించారు. ఇన్నింటినీ చూస్తూ తాను నిర్ణయించుకున్న దారిలో కొనసాగింది శివదేవి. రాళ్లు రప్పలతో నిండి ఉన్నది శివదేవి ఉద్యోగ ప్రయాణం మాత్రమే కాదు, ఆమె జీవిత ప్రయాణం కూడా. గ్రామాల్లో సాగుతున్న ఇసుక మాఫియా, బడి లేని గ్రామాలు, బస్సు లేని జనావాసాలు, మహిళల మీద దాడులు, అత్తింటి ఆరళ్లు.. అన్నింటినీ రిపోర్టు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే... 2014 లోక్‌సభ ఎన్నికలు ఆమె ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్. పోలీసులు నవ్వారు ఐదేళ్ల కిందటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. దళిత వాడలను చైతన్యపరచడానికి మహిళా పాఠకులను వారధిగా చేసుకుందామె. ఓటు నిర్ణయం తమదే అయి ఉండాలని... పీడనకు, ప్రలోభాలకు తల ఒగ్గకుండా ధైర్యంగా నిలబడాలని దళితులను చైతన్య పరుస్తూ వ్యాసాలు రాసింది ఖబర్ లహరియా పత్రిక. ఆ పత్రిక కాపీలను మహిళలకు చేర్చడం ద్వారా దళిత సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేది ఆమె ఆలోచన. ‘ఖబర్ లహరియా’ ప్రతులను గ్రామాలకు తీసుకెళ్లి పంచుతోందని అక్కడి అగ్రవర్ణాల వాళ్లకు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో పితృస్వామ్య, భూస్వామ్య భావజాలం ఎక్కువ. అక్కడి గ్రామపెద్దలకు శివదేవి చేస్తున్న పని ఏమాత్రం నచ్చలేదు. కొంతమంది దుండగులు ఆమెను అటకాయించి, ఆమె దగ్గరున్న పత్రిక కాపీలను, ఆమె కెమెరా ఫోన్‌ను లాక్కుని, ఆమెను అసభ్యంగా తిడుతూ, మరోసారి ఈ ఛాయలకు రావద్దని, వెళ్లిపొమ్మని బెదిరించారు. ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తనకు ఎదురైన సంఘటనను తెలియచేస్తూ తనకు రక్షణ కల్పించమని కోరుతూ కంప్లయింట్ రాసిచ్చింది. అక్కడి పోలీసులు సంగతంతా విని ఆమె రాసిన ఫిర్యాదు కాపీని కనీసం చదవకుండా ఓ పక్కన పడేసి, ఆమెను గేలి చేస్తూ నవ్వారు. అయినా శివదేవి క్లిష్టమైన రిపోర్టింగ్‌ని మానుకోలేదు. ఆమెకు పత్రిక కూడా అండగా నిలిచింది. ఆమెకు జిల్లా అంతటా గుర్తింపు రావడానికి కారణం ఆమె రిపోర్ట్ చేసిన సాహసోపేతమైన కథనాలే. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆమె కలానికి మళ్లీ పని ఒత్తిడి పెరిగింది. ఈ పనిని సమర్థంగా నిర్వహించడానికి ఖబర్ లొహారియా నిర్వహకులు ఆమెకు స్కూటీ కొనిచ్చారు. డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన వాయిదాలు ఆమె చెల్లించుకునే పద్ధతిలో వాహనాన్ని ఇచ్చారు. ఆ సంస్థలో ఇలాంటి గుర్తింపును అందుకున్న తొలి ఉద్యోగి శివదేవి. – మంజీర రాని ఇంగ్లిష్‌తోనే నెగ్గుకొచ్చింది! శివదేవి ప్రస్తుతం జీవితం.. పదేళ్ల కఠోర శ్రమకు ఫలితం. 2010లో శిక్షణలో చేరినప్పటి నుంచి ఆమె ఏ రోజూ పని చేయకుండా విశ్రమించింది లేదు. తనకు వచ్చిన కొద్దిపాటి చదువుతోనే రాయదలుచుకున్న విషయాన్ని చక్కగా రాయగలిగిన పట్టు రావడానికి ఆమె పడిన శ్రమ తక్కువేమీ కాదు. ఇంగ్లిష్ రాని శివదేవికి ప్రభుత్వాఫీసుల్లో అధికారులు ఇంగ్లిష్‌లో మాట్లాడినప్పుడు ఎదురైన ఇబ్బందులు కూడా తక్కువేమీ కాదు. అత్తింటి వాళ్లు తనను, తన బిడ్డను చంపేయాలనుకున్నారు. ఆమె బతికి చూపించాలనుకుంది. సమాజం నుంచి గౌరవాలందుకుంటూ బతికి చూపిస్తున్న ధీరవనిత శివదేవి. దళితవాడల్లో తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలకు ఆమెను ఆదర్శవంతంగా చూపిస్తున్నారు. -
గుట్ట దిగి రండి..
అశ్వారావుపేటరూరల్: వారంతా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఎత్తయిన గుట్టపై దాదాపు ఇరవై ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జనావాసాలకు దూరంగా ఉంటున్నారు. వారికి, వారి పిల్లలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. తాగునీరు, రోడ్డు, విద్యుత్ తదితర ఎలాంటి సౌకర్యాలూ లేవు. ఆ గొత్తికోయల గ్రామానికి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం. దాంతో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఈ గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. ఇలాంటి ఈ ప్రాంతానికి తొలిసారిగా ఓ తహసీల్దార్ ఆదివారం కాలినడకన వెళ్లడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. . మండలంలోని మొద్దులమడ గ్రామ రెవెన్యూ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్దమిద్దె అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే మొద్దులమడ అటవీ ప్రాంతం నుంచి రెండు వాగులు దాటి మూడు కిలోమీటర్ల మేర కాలిబాటలో వెళ్లాలి. ఆ తర్వాత ఎత్తయిన గుట్టపై వలస గొత్తికోయల స్థిర నివాసాలు కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో తాగునీరు. విద్యుత్, అంగన్వాడీ, పాఠశాల వంటివి మచ్చుకైనా కనిపించవు. ఇలాంటి ప్రాంతానికి తహసీల్దార్ రాఘవరెడ్డి వెళ్లి గోత్తికోయలతో దాదాపు రెండు గంటల పాటు గడిపారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ఏళ్లుగా గుట్టపై నివాసం ఉండటం వల్ల వారంతా పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎలాంటి సౌకర్యాలు లేని ఈ ప్రాంతాన్ని వదిలి గుట్ట దిగి కిందకు రావాలని సూచించారు. గుట్ట దిగి వస్తే మొద్దులమడ గ్రామం వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. కిందకు వస్తే ప్రభుత్వ పరంగా తాము సహకరిస్తామని, కనీస సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తానని తెలిపారు. అప్పటి వరకు పిల్లలను మొద్దులమడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని సూచించారు. -
మన్యంలో దొంగనోట్లు
విశాఖ, చింతపల్లి(పాడేరు):మన్యంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. వారపుసంతలు వేదికలుగా చేసుకుని వ్యాపారులు నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన వారపుసంతలో తమ్మంగులకు చెందిన ఓ గిరిజన రైతు అటవీఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయించాడు. గుర్తు తెలియని వ్యాపారి అధిక ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అత్యాశకు పోయిన గిరిజనుడు రూ.2 వేల నోటు తీసుకుని ఉత్పత్తులను విక్రయించాడు. నిత్యావసర సరుకుల కోసం కిరాణ దుకాణానికి వెళ్లి రెండు వేల నోటు ఇవ్వగా సదరు వ్యాపారి నోటు నకిలీదని తెలిపాడు. రెండు వేల నోటు మిగతా నోట్లకు భిన్నంగా ఉండండతో గిరిజనుడు ఆ నోటును చించివేసి వెళ్లిపోయాడు. -
సౌర సుజల యోజనతో..
రాయ్‌పూర్: అది మారుమూల గిరిజన కొండ ప్రాంతం. అక్కడి రైతులకు ఎలాంటి ఆదాయ మార్గాలులేవు. కనీసం విద్యుత్ కూడా ఉండేది కాదు. దీంతో పూట గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వారికి వరంలా మారింది. రెండేళ్లలో వారి దశ తిరిగింది. ఆదాయం లక్షల్లోకి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సౌర సుజల యోజన’ పుణ్యమే ఇదంతా. గిరిజనులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఈ పథకం కింద మిరప వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించింది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లోని రైతులకు తక్కువ ధరకే సౌర విద్యుత్ పంప్సెట్లు సమకూర్చింది. కోపా గ్రామానికి చెందిన గుజ్‌నాథ్ రామ్ ఆహార పంటలను సాగుచేస్తూ సరైన దిగుబడులు రాక ఇబ్బందులు పడుతుండేవాడు. ఈ పథకం అమలు తర్వాత తనకున్న ఐదెకరాల్లో రెండేళ్లుగా ఆయన మిర్చితోపాటు, టమాటా, వరి కూడా సాగు చేస్తున్నారు. రామ్ ఏమంటున్నారంటే.. ‘ఇప్పటి వరకు వచ్చిన మిర్చి, టమాటాలను విక్రయించగా రూ.80వేలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా దిగుబడులు చేతికందుతాయి. ఇలా ఎకరానికి రూ.లక్ష వరకు మిగులుతాయి’. ‘సౌర్ సుజల యోజన’ ద్వారా లబ్ధి పొందుతున్న బగీచా, మనోరా ప్రాంతాల్లోని 50 గ్రామాలకు చెందిన 500 మంది రైతుల్లో రామ్ కూడా ఒకరు. ‘2016 వరకు జిల్లాలో కేవలం 300 ఎకరాల్లో మాత్రమే మిరప సాగు జరుగుతుండేది. ఇప్పుడు అది రెండువేల ఎకరాలకు పెరిగింది. దీంతో ఇక్కడి రైతుల జీవనప్రమాణాల్లో గణనీయ మార్పులు వచ్చాయి’ అని జష్పూర్ జాయింట్ కలెక్టర్ ప్రియాంక శుక్లా తెలిపారు. -
భయం గుప్పిట్లో మన్యం
పదిరోజుల పాటు మన్యం భయం గుప్పెట్లోకి వెళ్లనుంది. ఈ నెల 28 నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పట్నుంచే పోలీసులు చర్యలు చేపట్టారు. మన్యంలో 17 స్టేషన్ల పరిధిలోను రోజువారి తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టుల హిట్ జాభితాలో ఉన్న వారికి, అధికార పార్టీ నేతలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు వారోత్సవాలు ముగిసే వరకు మన్యం విడిచి వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. విశాఖపట్నం ,కొయ్యూరు : ప్రతియేటా మావోయిస్టులు నిర్వహిస్తున్న సాయుధపోరాటంలో మరణించిన వారి పెరిట స్లూపాలను నిర్మానం చేసి నివాళులు అర్పి స్తారు. స్తూపాలపై మరణించిన వారి పేర్లను రా స్తారు. వాటిని నివారించేందుకు పోలీసులు కూం బింగ్‌ను ఉధృతం చేశారు.ఇటీవల కాలంలో మిలి షీయా సభ్యుల లొంగుబాట్లు, అరెస్టులు ఎక్కువయ్యాయి. అయినా మావోయిస్టులు చాపకింద నీరులా వారి కార్యకలాపాలను కొన్ని చోట్ల నిర్వహిస్తున్నారు. గూడెం, కొయ్యూరు, చింతపల్లిలో కొంత భాగాన్ని పర్యవేక్షణ చేసే గాలికొండ ఏరియా కమిటీకి నవీన్ నేతృత్వం వహిస్తున్నారు. ఇక చింతపల్లి, జీ మాడుగులలో తిరిగే కోరుకొం డ ఏరియా కమిటీని పెదబయలు కమిటీలో విలీ నం చేసినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులు సం చరించే ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. కూంబింగ్‌ను ఉధృతం చేశారు. ఆగస్టు మూడుతో వారోత్సవాలు ముగిసేంత వరకు పోలీసుల కూం బింగ్ కొనసాగనుంది. స్థానికంగా మావోయిస్టులు కొంత వరకు బలహీన పడినా బయట ప్రాం తాల నుంచి విద్వంసాలు చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిలో భాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కీలక ప్రాం తాల్లో వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. -
గిరిజన వృద్ధురాలి కాళ్లు కడిగిన కలెక్టర్
వైరామవరం (రంపచోడవరం) : వై.రామవరం మండలం శేషరాయి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. మండలంలోని యార్లగడ్డ పంచాయతీ పరిధిలోని మరుమూల ప్రాంతమైన శేషరాయిని గురువారం ఆయన సందర్శించారు. ఆ గ్రామస్తులు ఆయనకు గిరిజన సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి, పూలమాల వేసి స్వాగతం పలికారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్ అధ్యక్షతన ఆ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ కులధ్రువీకరణ పత్రాలు అందించాలనే లక్ష్యంతో ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. శేషరాయి గ్రామంలో రచ్చబండ, అంగన్వాడీ కేంద్రం, అందరికీ పక్కాగృహాలు నిర్మిస్తామన్నారు. వీధివీధికీ సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. వై.రామవరం నుంచి శేషరాయికి, వై.రామవరం నుంచి మఠం భీమవరం మీదుగా గుర్తేడు రోడ్డుకు అటవీశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను తొలగించి, త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం సుమారు 40 మందికి కుల ధ్రువీకరణ పత్రాలు అందించారు. మహిళా సంఘాలకు ట్యాబ్‌లు అందించారు. రైతులకు పురుగుమందుల స్ప్రేయర్స్, బరకాలు అందించారు. చవిటిదిబ్బలు పీహెచ్సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అందిస్తున్న దోమతెరలను పరిశీలించారు. ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణం ప్రారంభం కాగానే గ్రామంలోని ఇద్దరు యువకులకు జీపులు కొనిస్తామని చెప్పారు. ఆ గ్రామంలోని పిల్లలను యార్లగడ్డ గ్రామంలోని పాఠశాలకు తరలించడానికి వాహనాన్ని సమకూరుస్తామన్నారు. అనంతరం అక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో, దారలోవ గ్రామ సమీపంలో ఉన్న దుమ్ముకొండ జలపాతాన్ని సందర్శించారు. 10 కిలోమీటర్ల దూరం నిటారుగా ఉన్న పెద్దకొండపైకి కాలినడకన వెళ్లారు. ఆ జలపాతంతోపాటు, అటవీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను తిలకించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా జలపాతం వద్దకు రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రం వల్ల శేషరాయి గ్రామానికి ఆదాయం చేకూరుతుందన్నారు. అనంతరం మార్గమధ్యలోని గురమంద విశ్వనాథుని దర్శించుకున్నారు. వృద్ధురాలి కాళ్లు కడిగిన కలెక్టర్ శేషరాయిలోని పల్లాల లక్ష్మమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలికి కలెక్టర్ కార్తికేయమిశ్రా పసుపునీళ్ళతో కాళ్ళు కడిగారు. ఆమెను తనను దీవించమని కోరారు. నూరేళ్లూ సుఖసంతోషాలతో జీవించాలని ఆ వృద్ధురాలు కలెక్టర్‌ను దీవించింది. కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, వెలుగు ఏపీడీ సత్యంనాయుడు, మండల ప్రత్యేకాధికారి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ పీకే నాగేశ్వరరావు, అడ్డతీగల సీఐ ఎ.మురళీకృష్ణ, తహసీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ, ఎంపీడీఓ కె.బాపన్నదొర, ఎం ఈఓ కె.ప్రసాదబాబు, సర్పంచ్‌లు దాగేరి పొట్టమ, గుడ్ల సత్యవతి, మాజీ సర్పంచ్ పల్లాల కాశీ విశ్వనాథరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లాల వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్, గ్రామపెద్దలు దాగేరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ మద్యం!
మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రం లోని వైన్ షాపు యజమానులు మండల గ్రామాలు, గిరిజన తండాలలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులకు ట్రాలీ ఆటో ద్వారా మద్యం డోర్ డెలీవరీ చేస్తున్నారు. అక్రమంగా మద్యం డోర్ డెలీవరీ చేస్తున్నందుకు వైన్‌షాపు యజమాన్యం బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి మద్యం బాటిళ్లపై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలను తీసుకుంటున్నారు. వీరికి ఎక్సైజ్, సివిల్ పోలీసుల అండదండలు పుష్క లంగా ఉన్న ట్టు పలువురు గుసగుసలాడుతున్నారు. దీంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లుపడుతుంది. మాడ్గుల మండల కేంద్రంలో ఉన్న శ్రీ బాలాజీ వైన్స్ యజమాన్యం షాపులో నుంచి రోజూ ట్రాలీ ఆటోలో మద్యం తీసుకుని మండల గ్రామాల్లోకి వెళ్లి అక్రమంగా వ్యాపారం చేస్తున్న బెల్టుషాపుల యజమానులకు క్వార్టర్ ఎమ్మార్పీ ధర కంటే రూ. 5 అధిక ధరలకు విక్రయిస్తారు. సదరు బెల్టుషాపుల యజమానులు ఒక్కో క్వార్టర్‌ను రూ. 10నుంచి రూ. 15ల అదనంగా విక్రయిస్తారు. దీంతో మందుబాబులు ఒక్కో క్వార్టర్‌పై ఎమ్మార్పీ కంటే రూ15 నుంచి రూ. 20లు అధిక ధర పెట్టి కొనాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదికన ఒక్కో ఫుల్‌బాటిల్‌పై మద్యం ప్రియులకు రూ. 100 వరకు చేతి సమురు వదులుతోంది. ఫిర్యాదులకు జంకుతున్న వినియోగదారులు అధిక ధరలకు మద్యం అమ్మకాలపై అనేకమార్లు వినియోగదారులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, సెల్ నెంబర్లు బెల్టుషాపుల యజమానులకు ఇవ్వడంతో గ్రామాల్లో తగాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదు చేయడానికి మద్యం ప్రియులు వెనకాడుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయంటూ ఎస్సై గిరీష్‌కుమార్ మండలంలోని నాగిళ్ల, ఇర్విన్, బ్రాహ్మణపల్లి, నర్సాయిపల్లి, కొల్కులపల్లి, తదితర గ్రామాల్లోని బెల్టుషాపులపై దాడులు చేసి మద్యం స్వాధీనపరుచుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. గత నెలరోజులుగా దాడుల పరంపర కొనసాగించిన ఎస్సై గిరీష్‌కుమార్ వారం రోజులుగా మిన్నకుండడంలో అంతర్యమేమిటోనని మండల ప్రజలు, మద్యం ప్రియులు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో దాడులు నిలిపివేసినట్లు సమాచారం. యథేచ్ఛగా డోర్ డెలివరీ.. దీంతో వైన్‌షాపు యజమాన్యం డోర్ డెలీవరీకి తెరలేపడంతో గ్రామాల్లో అక్రమ బెల్టుషాపుల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ విషయం ఆమనగల్లు ఎక్సైజ్ అధికారులకు తెలియదని అనుకంటే పప్పులో కాలేసినట్లే సుమా...మరి ఈ తతంగమంతా వారి కన్నుసన్నల్లోనే జరుగుతుండడంతో వారు జోక్యం చేసుకోవడం లేదు. జిల్లా ఎక్సైజ్ అధికారులు మాత్రం గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నప్పుడు నడిచేది. మాడ్గుల మండలం రంగారెడ్డి జిల్లాలో కలిసిన తర్వాత బెల్టు షాపులకు మద్యం రవాణా, అధిక ధరలకు మద్యం విక్రయాలను పూర్తిగా కట్టడి చేశామని గొప్పలు చెప్పడం గమనార్హం. బెల్టుషాపులకు అనుమతి లేదు గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణకు అనుమతిలేదు. అలాగే వైన్‌షాపు నుంచి మద్యం డోర్ డెలీవరీ చేయకూడదు. మద్యంను ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణ, వాటికి మద్యం రవాణా చేయడం పూర్తిగా అక్రమం. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, ఎక్సైజ్ సీఐ,ఆమనగల్లు -
మరో గర్భశోకం
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు జాయినైతే చాలు ‘క్రిటికల్’ అని ముద్ర వేసి రాజమహేంద్రవరంలోని వైద్య విధాన పరిషత్తు జిల్లా ఆసుపత్రికి తరలించేస్తున్నారు. క్రిటికల్ అనే కేసులను 108 సిబ్బంది మార్గం మధ్యలో డెలివరీలు చేసేస్తున్నారంటే వైద్యుల్లో ఏమేరకు నిర్లక్ష్యం ఆవహించి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా... తూర్పుగోదావరి ,రంపచోడవరం: అమ్మ గర్భగుడి నుంచి బయట ప్రపంచంలోకి వచ్చి కళ్లు తెరవకుండానే పసి కందులకు నిండూ నూరేళ్లు నిండిపోతున్నాయి. ఆసుపత్రుల్లో ప్రసవా లు సురక్షితమని ఓ వైపు చెబుతున్నా ఆ ఆ సుపత్రుల్లో గర్భిణులకు వైద్య సేవలు అం దడం లేదు. ఏజెన్సీలో ఎంత మంది పసికందుల ప్రాణాలు పోతే ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడతాయని పురిటిలోనే పిల్లలను కోల్పోయిన తల్లులు శాపనార్థాలు పెడుతున్నారు. ఎంతమంది పసికందుల కళ్లు మూస్తే అధి కారులు కళ్లు తెరుస్తారోనని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రం పచోడవరం ఏరియాఆసుపత్రిలో మారేడుమిల్లిమండలం చావి డికోటగ్రామానికి చెందిన బత్తుల ప్రేమలత అనే గర్భిణి కాన్పు లోనే పసికందును కోల్పోయి గర్భశోకాన్ని అనుభవిస్తోంది. పురిటి నొప్పులతో బాధ పడుతున్నా పట్టించుకోని వైనం... చావిడికోట గ్రామం నుంచి ప్రేమలత సోమవారం మధ్యాహ్నం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఇన్ పేషెంట్‌గా చేరింది. ఆ సమయంలో వైద్యులు పరీక్ష చేసి బాగానే ఉందని ఆసుపత్రిలోనే ఉంచారు. అదే రోజు రాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతుండడంతో బాధితురాలి అత్త అక్కడే ఉన్న నర్సులకు చెప్పినా చిరాకు పడ్డారే తప్ప ప్రాథమిక వైద్యం కూడా అందించలేదు. ప్రధాన వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో బాధతో నరకయాతన అనుభవించింది. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చి ఆగిపోయింది. ఈ విషయం మళ్లీ వచ్చి ప్రాధేయపడడంతో నర్సులు వచ్చి చూసేసరికే ప్రాణం పోయింది. గర్భిణులకు వైద్యం అందే పరిస్ధితి లేదా... రంపచోడవరంఏరియా ఆసుపత్రిలో గర్భిణులకు కనీస వైద్యం అందించి భరోసానివ్వడంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వి ఫలమవుతున్నారని ఇటీవల జరిగిన ఘటనలే రుజువు చేస్తున్నాయి. వచ్చిన కేసులు క్రిటికల్‌గా ఉన్నాయని రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. విషమంగా ఉన్నయన్న కేసులు మార్గమ«ధ్యలో 108 సిబ్బంది సుఖ ప్రసవం చేయడం విశేషం. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి కేసుల రిఫర ల్ పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో 27 మంది గర్భిణులను రిఫర్ చేయగా మేలో 28 మంది, జూన్‌లో 26 మంది, జూలైలో 55 మంది, ఆగస్టులో 55, సెప్టెంబర్‌లో 21 మంది గర్భిణి కేసులను రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఏరియా ఆసుపత్రిలో ఒక గైనిక్ వైద్యుడిని డిప్యూటేషన్‌పై నియమించా రు. సెలవు పెట్టినప్పుడు, రాత్రి సమయాల్లో ప్రాణంమాదకు వస్తోంది. సోమవారం మృతశిశువు జనన ఘటనపై ఆసుపత్రి ఇన్చార్జి కార్తీక్‌ను వివరణ కోరగా పురిటి నొప్పుల విషయం డ్యూటీలో ఉన్న సిబ్బంది తనకు చెప్పలేదని తెలిపారు. -
గిరిజనుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్ రంపచోడవరం : గిరిజనుల ఆరోగ్య భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో బు«ధవారం జాతీయ ఆరోగ్యమిషన్ నిధులు రూ.106 లక్షలతో నిర్మించే జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ టి.రత్నాబాయి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఐటీడీఏ పీఓ ఎ.ఎస్.దినేష్‌కుమార్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా రూ.59 లక్షలతో నిర్మించిన పేయింగ్ రూమ్‌లను ప్రారంభించారు. వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రూ.60 లక్షలతో నిర్మించిన రక్తనిధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గిరిజనులు కూడా మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పేస్లిప్టు కింద 71 ఆస్పత్రులు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యులను నియమించాలని, అంబులెన్స్‌లు, అవసమైన చోట కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ రత్నాబాయి మాట్లాడుతూ ఏజెన్సీ వృద్ధాశ్రమం నిర్మించాలని కోరారు. ఆస్పత్రి అదనపు భవనం ప్రారంభం అడ్డతీగల : రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అడ్డతీగలలో రూ.2.76 కోట్లతో నిర్మించిన ఆస్పత్రి అదనపు భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఏజెన్సీలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి నఫీసా మంత్రిని కోరారు. అందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్, రంపచోడవరం ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, సర్పంచ్ వై నిరంజనీదేవి, ఏజేసీ జె.రాధాకృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ చంద్రయ్య, డీసీహెచ్ఎస్ రమేష్‌కిçషోర్, ఏజెన్సీ డీఎంహెచ్ఓ పవన్‌కుమార్, అడ్డతీగల ఎంపీపీ అన్నం సత్తిబాబు, జెడ్పీటీసీ అడారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం జిల్లాలో ఆగని ఆందోళనలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా విభజన నేపథ్యంలో వివిధ డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను ముక్కలు చేయవద్దని కోరుతూ బస్సు యాత్ర కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆదివాసీ బస్సుయాత్ర టేకులపల్లికి చేరుకుంది. షెడ్యూల్డ్ ఏరియాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక బోడు రోడ్డు సెంటర్లో ధర్నా చేపట్టారు. వాజేడు, వెంకటాపురం మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు బంద్ చేపట్టాయి. రెండు మండలాలను వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కలపాలనే ప్రతిపాదనను విర మించుకోవాలని డిమాండ్ చేశారు. -
బాక్సైట్ ఉద్యమాన్ని అణిచేందుకే అక్రమ అరెస్టులు
-
బాక్సైట్ ఉద్యమాన్ని అణిచేందుకే అక్రమ అరెస్టులు
ఆరు రోజులైనా తమవారి జాడ చెప్పకపోవడం అన్యాయం ఐటీడీఏ పీవో ఎదుట గోడు వెళ్లబోసుకున్న గిరిజన కుటుంబాలు పాడేరు రూరల్: గిరిజన ప్రాంతంలో బాక్సైట్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ఆరోపించారు. ఆయన బుధవారం స్థానిక గిరిజన సంఘ కార్యాలయంలో బాధిత గిరిజన కుటుంబాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జీకేవీధి మండలం జర్రెల పంచాయతీ మాజీ సర్పంచ్ సాగిన వెంకటరమణను మావోయిస్టులు హత్య చేయడం వెనుక గిరిజనుల హస్తం ఉందని ఆరోపిస్తూ అమాయక గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయమన్నారు. జర్రెల పంచాయితీ కోండ్రుపల్లి గ్రామానికి చెందిన 10 మంది గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకొని 6 రోజులవుతున్నా వారి జాడ బైట పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విచారణ పేరుతో అమాయక గిరిజనులను అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గిరిజనులు సాగు చేస్తున్న అపరాలు, కాఫీ గింజలు చేతికొచ్చిన సమయంలో గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబాలకు తిండి గింజలు కూడా కరువయ్యాయని చెప్పారు. అదుపులోకి తీసుకున్న గిరిజనులను నేటికీ కోర్టులో హాజరుపర్చకుండా మానవహక్కులను పోలీసులు హరిస్తున్నారని, నిర్బంధంలో ఉన్న గిరిజనుల యోగక్షేమాలు వారి కుటుంబాలకు తెలియజేయకపోవడంతో బాధిత కుటుంబాలు తిండీ తిప్పలు లేకుండా పిల్లా పాపలతో పస్తులు ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. అదుపులో ఉన్న గిరిజనులకు హాని జరిగితే గిరిజన ప్రాంతం భగ్గుమంటుందని హెచ్చరించారు. ఈ విషయంపై ప్రభుత్వం, జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జోక్యం చేసుకొని పోలీసుల అదుపులో ఉన్న గిరిజనులను విడిపించి, రక్షణ కల్పించాలని, అక్రమంగా గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విడుదల చేయండి.. లేదా కోర్టులో హాజరుపర్చండి చింతపల్లి రూరల్: పోలీసుల నిర్బంధంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను విడుదలైనా చేయండి.. లేదా కోర్టులో హాజరుపర్చడని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. ఆమె బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జీకేవీధి మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ అడపా విష్ణుమూర్తి, జర్రెల ఎంపీటీసీ భర్త, పార్టీ మండల కార్యదర్శి ప్రసాద్‌లను అక్రమ నిర్బంధంలో ఉంచి కుటుంబీకులకు సైతం ఆచూకి తెలపకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారనే నెపంతో సంబంధం లేని తమ పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నప్పటికీ ఆరు రోజులుగా తమ పార్టీ నాయకులతోపాటు అదే ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆచూకీ చెప్పకపోవడం పోలీసులు చేస్తున్న దమన నీతికి నిదర్శనమని దుయ్యబట్టారు. గిరిజనుల నిర్బంధంపై మానవహక్కుల సంఘాన్ని కూడా కలవనున్నామని, ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు : జర్రెల సంఘటనలో పోలీసు ల నిర్బంధంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకుల కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే ఓదార్చారు. జెడ్పీటీసీ పద్మకుమారి గృహంలో కుటుంబీకులను ఓదార్చుతూ, ఆదివాసీ కుటుంబాలన్నింటికీ అందుబాటులో ఉంటానని, మీ కోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో మాట్లాడానని భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్రెల సర్పంచ్ విజయకుమారి, పార్టీ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు. పీవో ఎదుట గోడు వెల్లబోసుకున్న గిరిజనులు పోలీసుల అదుపులో ఉన్న తమ కుటుంబ సభ్యులను బేషరతుగా విడుదల చేసేందుకు చొరవ చూపాలని బాధిత గిరిజన కుటుంబాలు ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్, సబ్‌కలెక్టర్ లోతేటి శివశంకర్ ఎదుట బుధవారం తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ బాధను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. -
గిరిజన ప్రాంతంలో ఏనుగుల తిష్ఠ
ఎల్.ఎన్.పేట : మండలంలోని జోగివలస గిరిజన ప్రాంతం లో ఏనుగులు తిష్ఠవేశాయి. పది పదిహేను రోజు లుగా వీటి సంచారంతో గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రాణాపాయం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. జోగివలస, కొత్తజోగివలస, కారిగూడ, మెట్టుగూడ, గార్లపాడు, సరడాం సమీప ప్రాంతంలో ఏనుగులు చేరాయి. కొత్తజోగివలసకు ఎగువన ఉన్న గుర్రాల మెట్టపైన నివాసం ఏర్పాటు చేసుకున్న ఏనుగులు చీకటి పడితే కొండదిగి గ్రామాలకు సమీపంలోకి వస్తున్నాయని ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు సవర అనన్య, సవర యశో, సవర బాలరాజు, సవర దిలీప్‌కుమారు, సవర బాలయ్యలతో పాటు పలువురు చెబుతున్నారు. ఉదయానికే గుర్రాల మెట్టపైకి వెళ్లిపోతున్నాయని వివరించారు. నాలుగు ఏనుగులు గ్రామానికి సమీపంలో వచ్చి తిరుగుతున్నాయని, గ్రామంపై దాడి చేస్తాయోమోనని భయంగా ఉందని వాపోతున్నారు. పంటలు ధ్వంసం ఏనుగులు ఇప్పటికే వరిపంటలను నాశనం చేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట పొలాల్లో తిరిగి తొక్కేయడం వల్ల వరి చేను బురదలో కలిసిపోయిందన్నారు. కళ్లాంలో వేసిన వరిచేను కుప్పలను కూడా లాగేసి విసిరేస్తున్నాయని చెప్పారు. జీడి, మామిడి చెట్ల కొమ్మలను విరిచేస్తున్నాయని, అరటి చెట్లను తొక్కేస్తున్నాయని రైతులు వాపోయారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించుకున్న కంది, పసుపు పంటలతో పాటు బొప్పాయి, అరటి చెట్లను ఏనుగులు ధ్వంసం చేయడంతో తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. నిత్యం ఏనుగుల భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం స్పందించి పంటకు పరిహారం ఇవ్వాలని గిరిజన రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తరమివేయాలి సీతంపేట : ఆదివాసీలకు ఏళ్ల తరబడి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నాలుగు ఏనుగులను ఏజెన్సీ నుంచి తరమివేయాలని ఏపీ ఆదివాసీ చైతన్య సేవా సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సూర్యనారాయణ, విప్లవకుమర్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సీతంపేట, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు మండలాల్లో ఏనుగులు సంచరిస్తూ పంటలన్నింటిని నాశనం చేస్తున్నాయన్నారు. పంట నష్టపోయిన వారికి పూర్తిగా పరిహారం కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను తరిమివేసే ఏర్పాట్లు చేయాలని, పంటకు పరిహారం అందించాలని వారు కోరారు. -
నేటి నుంచి వేడుకలు ఆరంభం
ఇంద్రవెల్లి : జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని ప్రధాన్గూడలో ఆదివాసీ గిరిజనులు నాలుగేళ్లుగా గిరిజన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతల్లో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు ఆడుతున్న ఆట పాటలు, సంస్కృతి సంప్రదాయాలకు ఆకర్షితులైన ఆదివాసీ గిరిజన మహిళలు ఆడుతున్నారు. ఏటా దసరా పండుగకు తొమ్మిది రోజుల ముందు నుంచి ఆ గ్రామం పటేల్ ఇంటి ముందు గుండం ఏర్పాటు చేసి, ఆ గుండంలో బతుకమ్మ మొక్క నాటి, దాని చుట్టూ దీపాలు వెలిగించి గిరిజన సంప్రదాయ రీతిలో డోలు, పేప్రే, కాలికోం వాయిద్యాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు నృత్యాలు చేస్తారు. దసరా పండుగ మరుసటి రోజే సాయంత్రం పండుగ ముగుస్తుంది. తంగేడు పువ్వు పల్లె ప్రాంతాలు, అడవిలో తంగేడు పువ్వులు సహజసిద్ధంగా లభిస్తాయి. ఈ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు, మూత్రకోశ వ్యాధులకు తంగేడు పుష్పాన్ని వినియోగిస్తారు. తంగేడు కషాయం శరీరానికి చల్లదానాన్నిస్తుంది. అతిసారం, చర్మ, క్రిమి రోగాలు, నేత్ర జబ్బులకు తంగేడును ఔషధానికి ఉపయోగిస్తారు. తంగేడును నీటిలో వేయడంతో అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. వాతం, ఉష్ణం, ప్రకోపాలను తగ్గించే గుణం ఈ పువ్వులో ఉంది. రక్తప్రసరణకు ఎంతగానో దోహదపడుతుంది. సీతమ్మ జడ కళ్లకు ఇంపుగా కనిపించే సీతమ్మజడ పూలు రంగుల తయారీలో అత్యధికంగా ఉపయోగిస్తారు. సిలోసియా అరెగేటియా అమరాంథస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పుష్పం బతుకమ్మలో అందంగా పేర్చడానికి వినియోగిస్తారు. ఆకర్షకపత్రాలు, నారలు తయారీలోనూ ఈ పుష్పాన్ని వాడుతారు. ఈ పుష్పంలోనూ ఔషధ గుణాలున్నాయి. బీరపువ్వు పసుపు వర్ణంలో ఉండి కంటికి ఇంపుగా కనిపించే బీరపువ్వు రంగుల తయారీలో ఎంతగానో వినియోగిస్తారు. బీరకాయలను ఎండబెట్టి అందులో నుంచి పీచును వెలికితీసి రంగులలో ఉపయోగిస్తారు. బతుకమ్మలు తయారు చేసి నుదుటన తిలకం దిద్దిన మాదిరి బీరపువ్వును అలంకరిస్తారు. గునుగు పువ్వు సిలోసియా అర్జెంటీయా శాస్త్రీయ నామం కలిగిన గునుగు పువ్వు బతుకమ్మకు ఎంతో శోభను తెస్తుంది. తెల్లవర్ణంలో ఉన్న ఈ పుష్పం గ్రామాల్లో పశువులకు దాణాకు ఉపయోగపడుతుంది. గునుగుపూలను నీటిలో వేస్తే మలినాలను పీల్చుకొని శుభ్రం చేస్తుంది. బంతి పువ్వు ‘క్రిసాంథిమమ్ బయాన్కో’ శాస్త్రీయ నామం కలిగిన బంతి పువ్వు చలువదనానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తనాళాలను శుద్ధి చేసి రక్తసరఫరాను మెరుగుపర్చడానికి సరఫరా చేసే ఔషధంలో బంతిపువ్వును వినియోగిస్తారు. గొంతు సంబంధిత వ్యాధులను నయం చేసే లక్షణం ఈ పువ్వులో ఉన్నాయి. సూక్ష్మ క్రీములను నాశనం చేయడంలో బంతి పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుమ్మడి గుమ్మడి పుష్పంలో ఏ,సీ విటమిన్లు అధికంగా ఉన్నాయి. వృద్ధాప్యంలో తలెత్తే కీళ్లనొప్పులను తగ్గించే మందుల తయారీలో ఈ పుష్పాన్ని వాడతారు. ప్రొటెస్ట్గ్రంథికి హానికలిగించకుండా గుమ్మడి పువ్వు రక్షణ కవచంగా పని చేస్తుంది. పొడిబారిన చర్మాన్ని పొలుసులు రాకుండా దోహదపడుతుంది. ఈ పుష్పంలో వేడిని తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి. మందారం ఆకర్షణీయంగా కనిపించే మందారం పువ్వులో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆకర్షణ పత్రాలలో ఈ పుష్పాన్ని వాడతారు. ముఖ్యంగా వెంట్రుకలను నల్లబర్చడానికి తయారు చేసే నూనెలో మందార పుష్పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ పుష్పాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీలోనూ మందారాలను వాడుతారు. అతిసారా వ్యాధితో బాధపడే వారికి మందారం ఉపశమనం కలిగిస్తుంది. ఈ పుష్పాలను ఎండబెట్టి నూనెలో మరిగించి తలకు రాసుకున్నట్లయితే తలనొప్పి త్వరితగతిన తగ్గి ఉపశమనం ఇస్తుంది. రుద్రాక్ష పువ్వు ఔషధ గుణాలు రుద్రాక్ష పువ్వులో మెండుగా ఉన్నాయి. సౌందర్యసాధనాల తయారీలో రుద్రాక్ష పూలను విస్తారంగా వినియోగిస్తారు. కేక్, జల్లీల తయారీలో రుద్రాక్ష పూలు వాడతారు. ఈ పువ్వులో పుండ్లను నయం చేసే గుణం ఎంతగానో ఉంది. వీటి గింజలు వేసిన చెరువుల్లో స్నానం చేసినట్లయితే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం. తొమ్మిది రోజుల్లోనూ ప్రతి ఆడపడుచూ తప్పనిసరిగా బతుకమ్మ చుట్టూ రెండు అడుగులు వేయాలి. రెండు పాటలు పాడాలి అనుకునే సందర్భం సద్దుల బతుకమ్మ. మహిళలు పట్టు చీరెలు, యువతులు పరికిణీలు ధరించి, నగలతో సింగారించుకుంటుంటారు. వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ రాత్రిలో బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరుతోనూ, గౌరమ్మగానూ కొలిచి నీటిలో నిమజ్జనం చేసి పోయి రా.. బతుకమ్మా అంటూ.. హారతులు ఇచ్చి సాగనంపుతారు. వెంట తెచ్చుకున్న పెరుగన్నం, సత్తు పిండి (మొక్కజొన్న, వేరుశెనగ పిండి వేయించి చక్కెర కలిపి) ఇచ్చి పుచ్చుకుంటారు. బియ్యం, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్నలను చక్కెర, బెల్లంతో కలిపి దంచిపెడుతారు. యువతులు, మహిళలు ఒకచోట చేరి శిబ్బుల్లో (బతుకమ్మను పేర్చేది) ఇచ్చిపుచ్చుకుంటుంటారు. -
మెరుగైన వైద్యానికి చర్యలు
అరకు రూరల్ : గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకు ఏరియా ఆస్పత్రిలో వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారానికి ఒకరోజు వైద్య నిపుణులతో కూడిన బృందంతో అరకు ఏరియా ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేసేలా చర్య తీసుకుంటామన్నారు. ఏజెన్సీలో మార్పు ప్రోగ్రాం బాగుందన్నారు. అమృతహస్తం ద్వారా అందుతున్న పౌష్టికాహారం వల్ల మన్యంలో శిశు మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఏజెన్సీలో విధులకు ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే వస్తున్నారని, పీజీలు ముందుకువస్తే బాగుంటుందన్నారు. బాక్సైట్ తవ్వకాలకు తమకు ఎటువంటి సమాచారం రాలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం దీనిపై స్పష్టత రావచ్చన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గతేడాది మంజూరు కాలేదన్నారు. మొత్తం 45 శాఖలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే గతేడాది నిధులు మంజూరయ్యాయన్నారు. ఇసుక రీచ్‌లకు త్వరలో జిల్లా స్థాయి కమిటీతో చర్చించి, విధి విధానాలు రూపొందిస్తామన్నారు. పెదలబుడు, పద్మాపురం మేజర్ పంచాయతీలకు పద్మాపురం సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించాలని తహశీల్దార్ జయప్రకాష్‌ను ఆదేశించారు. వైద్య సేవల తీరుపై ఆరా కలెక్టర్ అంతకుముందు స్థానిక ఏరియా ఆస్పత్రి, మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలో రోజుకు ఎంతమంది ఓపీకి వస్తున్నారు? ఎందరు ఆస్పత్రిలో చేరుతున్నారు? రోగులకు ఏఏ సేవలు అందుతున్నాయి వంటి వివరాలను కాంట్రాక్టు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గైనిక్, జనరల్ వార్డులలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మరుగుదొడ్లు పరిశీలించారు. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారిని చూసి ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో ఎన్ని యూనిట్ల రక్తం నిల్వ ఉంచేందుకు అవకాశం ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నర్సులు ఎంతమంది ఉన్నారు, వారికి నివాస గృహాలు (క్వార్టర్లు) ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ల్యాబ్‌లు, చిన్నపిల్లల కేర్ సెంటర్ పరిశీలించారు. వైద్య నిపుణులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని బెడ్లు ఉన్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మండలంలోని మాడగడ పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. 12 గంటల పీహెచ్సీ కావడంతో రాత్రివేళల్లో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పీహెచ్సీలో డాక్టర్ లేకపోవడంతో హాజరు పట్టికలో ఆబ్సెంట్ నమోదు చేశారు. ఏఎన్ఎంలు స్థానికంగా ఉండడం లేదని చెప్పడంతో స్థానికంగా ఏఎన్ఎంలు నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
గిరిజన స్థానం గిరిజనేతరులకా?!
సీతంపేట, న్యూస్‌లైన్: పూర్తిగా గిరిజన ప్రాంతం.. జిల్లా ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన సీతంపేట జెడ్పీటీసీ స్థానాన్ని బీసీలకు కేటాయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం ప్రకటించిన జెడ్పీటీసీ రిజర్వేషన్లలో సీతంపేటను బీసీ మహిళకు కేటాయించినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసింది. దీనిపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వారు సిద్ధమవుతున్నారు. గిరిజనులు అత్యధికంగా నివసిస్తునన పూర్తిస్థాయి సబ్‌ప్లాన్ మండలంగా ఉన్న సీతంపేటను గిరిజనులకు కాకుండా గిరిజనేతరులైన బీసీలకు కేటాయించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మండలంలో 50,747 మంది జనాభా ఉన్నారు. వీరిలో బీసీ వర్గానికి చెందిన వారు 1500 మంది మాత్రమే ఉన్నారు. మండలాలు, జెడ్పీటీసీల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఈ జెడ్పీటీసీ స్థానాన్ని గిరిజనులకే కేటాయిస్తున్నారు. అయితే రొటేషన్ పద్ధతిలో ఈసారి బీసీ మహిళకు కేటాయించాల్సి వచ్చిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఎంపీడీవో గార రవణమ్మను వివరణ కోరగా ఏ ప్రాతిపాదికన కేటాయించారో త నకు కూడా తెలియదని చెప్పారు. రొటేషన్ పద్ధతే కారణం కావచ్చన్నారు. అయితే రొటేషన్ పేరుతో మెజారిటీ వర్గంగా ఉన్న గిరిజనులపై గిరిజనేతరులను రుద్దడం న్యాయం కాదని గిరిజన సంఘాల నేతలు వాదిస్తున్నారు. ఇది గిరిజనుల హక్కులను కాలరాయడమేనని అంటున్నారు. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. -
‘విలీనం’పై నిరసన
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని 134 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో కలపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆదివాసీలతో పాటు, వివిధ రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముంపు గ్రామాల విలీన నిర్ణయాన్ని నిరసిస్తూ భద్రాచలంలో వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ఆయా పార్టీల జెండాలను, కేంద్రమంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఫొటోలతో ముద్రించిన ఫ్లెక్సీని దహనం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్యర్యంలో శనివారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం డివిజన్లోని గిరిజన గ్రామాలను విడదీసే హక్కు ఎవరిచ్చారని గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు సోందె వీరయ్య ప్రశ్నించారు. ఈనెల 10న అఖిలపక్షం నాయకులు భద్రాచలం డివిజన్ బంద్‌కు పిలుపునిచ్చారు. -
చెక్ స్లిప్ మాయాజాలం !
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘పైసామే పరమాత్మా..’ అన్నట్లు విద్యాశాఖను డబ్బు శాసిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం, ఇతర కుటుంబ అవసరాల నిమిత్తం వెసులుబాటు కల్పించే చెక్ స్లిప్ బదిలీలు డబ్బున్నవారికి వరంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ముట్టజెపితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారైనా సరే.. నేరుగా జిల్లా కేంద్రానికో.. లేదా ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలకో బదిలీ కావడం కష్టమేమీ కాదని పలువురు అంటున్నారు. కొందరు టీచర్లు ఆయా ఉపాధ్యాయ సంఘాల అండతో రాజధానిలో మకాం వేసి.. ఏకంగా ముఖ్యమంత్రి పేషీ నుంచే బదిలీ ఆర్డర్లు తెచ్చుకోవడం జిల్లాలో మంగళవారం చర్చనీయాంశంగా మారింది. ఇలా జిల్లా వ్యాప్తంగా నలుగురు పీజీ హెచ్ఎంలు, ఏడుగురు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఇద్దరు భాషా పండితులు, ఒక పీఈటీ, 11 మంది స్కూల్ అసిస్టెంట్లు, నలుగురు ఎస్జీటీలు ఎలాంటి సమాచారం లేకుండా, ఏకంగా బదిలీ ఆర్డర్‌తో రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం కంగుతిన్నారు. మరో 50 రోజుల్లోనే పదో తరగతి పరీక్షలు ఉండగా, ఇలా ఆకస్మికంగా బదిలీ చేయడం సరికాదని, ఈ ప్రభావం పది ఫలితాలపై పడే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చేతులు మారిన లక్షల రూపాయలు...? ఉపాధ్యాయుల దొడ్దిదారి బదిలీలు పలు ఉపాధ్యాయ సంఘాల వారికి, రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురింపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో కాలంగా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న తాము ఎలాగైనా మైదాన ప్రాంతాలకు, అదీ జిల్లా కేంద్రానికి సమీపంలోకి రావాలనే పలువురు ఉపాధ్యాయుల కోరిక నాయకులకు వరంగా మారింది. మరో రెండు నెలల్లో ప్రభుత్వ పదవీ కాలం ముగియడంతో.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో దొడ్డిదారిన బదిలీల పరంపర కొనసాగించినట్లు సమాచారం. ఇందుకోసం భారీగా వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. వీటితో పాటు సంఘాల నాయకుల ఖర్చులు, మంత్రుల పేషీ నుంచి రికమండెడ్ ఉత్తరాల పేరుతో కూడా వేల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా జిల్లాలో చెక్ స్లిప్ బదిలీల పుణ్యమా అని లక్షలు చేతులు మారాయంటున్నారు. జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు అధికార, ప్రతిపక్ష నాయకులతో కలిసి సీఎం పేషీకి వెళ్లగా, మరికొందరు రాజధానిలో లాబీయింగ్ చేసి ఏకంగా ముఖ్యమంత్రి పేషీలోనే పైరవీలు చేయించినట్లు తెలిసింది. పదో తరగతి ఫలితాలపై ప్రభావం... పలువురు అధికార పార్టీ నాయకులు డబ్బు ఆశతో చేసిన చెక్ స్లిప్ బదిలీల పాపం పదో తరగతి విద్యార్థులకు శాపంగా మారనుంది. మార్చి 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో సంపూర్ణ ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, కనీస ఉత్తీర్ణతా స్థాయి సాధించేంచడం, స్లిప్ టెస్ట్‌లు పెట్టడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో ఆయా పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, సబెక్టు టీచర్ల పాత్ర కీలకం. అయితే మంగళవారం జరిగిన చెక్ స్లిప్ బదిలీల్లో భద్రాచలంలోని నన్నపనేని ఉన్నత పాఠశాల, చర్ల మండలంలోని కుదునూరు ఉన్నత పాఠశాల, కూనవరం మండలం మర్రిగూడెం హైస్కూల్, జూలూరుపాడు జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ముగ్గురు బయోలాజికల్ బోధించే స్కూల్ అసిస్టెంట్లు, ఒక ఇంగ్లిష్ ఎస్ఏ, ఒకరు మాథ్స్ ఎస్ఏ, ఇద్దరు ఫిజికల్ సైన్స్ ఎస్ఏలు, ముగ్గురు సాంఘిక శాస్త్రం ఎస్ఏలు ఖమ్మం పరిసర ప్రాంతాలకు వచ్చారు. ఇంతకాలం ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు బోధించిన ఈ ఉపాధ్యాయులు.. పరీక్షలయ్యేంత వరకు వారి వెంట ఉండి ఉత్తీర్ణత శాతం పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఇలా అర్ధంతరంగా బదిలీ కావడంతో ఆశించిన ఫలితాలు రావడం కష్టమేనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోనున్న మైదాన ప్రాంత నిరుద్యోగులు.. జిల్లాలో ఏజెన్సీ , మైదాన ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలు వేర్వేరుగా జరుగుతాయి. జీవో నంబర్ 3 ప్రకారం ఏజెన్సీలోని ఖాళీలను ఆయా ప్రాంతాల్లోని గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. అయితే మంగళవారం జరిగిన చెక్ స్లిప్ బదిలీల్లో పైన పేర్కొన్న వారితో ఇంకా పలువురు ఉపాధ్యాయులు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు రానున్నారు. దీంతో ఏజెన్సీ ఏరియాల్లో ఖాళీలు ఏర్పడి, మైదాన ప్రాంతంలోని పోస్టులు భర్తీ అవుతాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని 17 మండలాల్లో సింగిల్ డిజిట్స్‌లో మాత్రమే ఖాళీలు ఉండగా, పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆ ఖాళీలు కూడా ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయులతో భర్తీ చేస్తే తమ పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులు డబ్బుకు ఆశపడి తీసుకున్న నిర్ణయంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.