సీతంపేట, న్యూస్‌లైన్: పూర్తిగా గిరిజన ప్రాంతం.. జిల్లా ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన సీతంపేట జెడ్పీటీసీ స్థానాన్ని బీసీలకు కేటాయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం ప్రకటించిన జెడ్పీటీసీ రిజర్వేషన్లలో సీతంపేటను బీసీ మహిళకు కేటాయించినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసింది. దీనిపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వారు సిద్ధమవుతున్నారు. గిరిజనులు అత్యధికంగా నివసిస్తునన పూర్తిస్థాయి సబ్‌ప్లాన్ మండలంగా ఉన్న సీతంపేటను గిరిజనులకు కాకుండా గిరిజనేతరులైన బీసీలకు కేటాయించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మండలంలో 50,747 మంది జనాభా ఉన్నారు. వీరిలో బీసీ వర్గానికి చెందిన వారు 1500 మంది మాత్రమే ఉన్నారు. మండలాలు, జెడ్పీటీసీల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఈ జెడ్పీటీసీ స్థానాన్ని గిరిజనులకే కేటాయిస్తున్నారు. అయితే రొటేషన్ పద్ధతిలో ఈసారి బీసీ మహిళకు కేటాయించాల్సి వచ్చిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఎంపీడీవో గార రవణమ్మను వివరణ కోరగా ఏ ప్రాతిపాదికన కేటాయించారో త నకు కూడా తెలియదని చెప్పారు.
రొటేషన్ పద్ధతే కారణం కావచ్చన్నారు. అయితే రొటేషన్ పేరుతో మెజారిటీ వర్గంగా ఉన్న గిరిజనులపై గిరిజనేతరులను రుద్దడం న్యాయం కాదని గిరిజన సంఘాల నేతలు వాదిస్తున్నారు. ఇది గిరిజనుల హక్కులను కాలరాయడమేనని అంటున్నారు. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి.
గిరిజన స్థానం గిరిజనేతరులకా?!
Published Sat, Mar 8 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement