సాక్షి, ములుగు : ఓ వింతవ్యాధి ఆ గ్రామాన్ని కబలిస్తోంది. వరుస మరణాలు ఆ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో ఆరుగురు బలయ్యారు. దీంతో తమ గ్రామానికి ఎవరో చేతబడి చేశారని ఆందోళన చెందుతున్న అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోతున్నారు. ప్రాణ భయంతో ఊరు వదిలి వలస వెళ్ళిపోతున్నారు. వారిని బలి తీసుకుంటున్న ఆ వ్యాదేంటో వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇది ములుగు కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామం. వరంగల్‌కు 145 కి.మీ దూరంలో, ములుగు జిల్లా కేంద్రానికి 95కి.మీ దూరంలో వుండే ఏటూరునాగారం ఏజెన్సీలోని ఓ మారుమూల గ్రామం ఇది. ఈ కుగ్రామం గత 20 రోజులుగా మృత్యు భయంతో బెంబేలెత్తిపోతోంది. (20 రోజుల్లో ఆరుగురు మృతి.. కారణం?)
ఎవరిని పలుకరించినా మృత్యు భయమే
గ్రామంలో ఏ ఒక్కరికి కంటిమీద కునుకు లేదు. ఏ ఇంట్లో అలికిడి అయినా ఏదో జరిగి పోతుందనే ఆందోళన వెంటాడుతుంది. కడుపునొప్పి జ్వరంవస్తే చాలు.. ఇక చావు తప్పదని ఆందోళన. అందుకు కారణం గత 20 రోజుల్లో ఈ గ్రామానికి చెందిన ఆరుగురు చనిపోవడమే. వాళ్లకు కడుపునొప్పి వచ్చిన కొద్దిసేపటికే కడుపంతా ఉబ్బి రక్తంతో వాంతులు చేసుకొని కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఎర్రయ్య, లక్ష్మీనారాయణ, కుమారి, దుర్గమ్మ, రమేష్, రాధిక అనే ఆరుగురు ఒకే రకమైన వింతవ్యాధితో చనిపోయారు. అంతా కడుపు ఉబ్బి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో ఎవరికైనా కడుపునొప్పి వచ్చిందంటేచాలు చావు తప్పదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముప్పునపల్లిలో ఎటు చూసినా విషాద వాతావరణమే అలముకొని ఉంది. మరణించిన వారి ఫ్లెక్సీలు, ఇళ్లకు తాళాలే వేలాడుతున్నాయి. ఎవరిని పలుకరించినా మృత్యు భయమే కనిపిస్తుంది. ఇప్పటివరకు మరణించిన వారంతా అంతా ఒకే విధంగా వింత వ్యాధితో మృతి చెందడంతో ఊరికి ఎవరో చేతబడి చేశారని, ఏదో శక్తి ఈ ఊరిని ఆవహించిందని ఆందోళన చెందుతున్నారు.
ఆరోగ్య శాఖ అధికారులకూ అంతు చిక్కని రోగం
ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అంతుచిక్కని వింత వ్యాధి వారి ప్రాణాలు మింగేస్తుండడంతో ఊరంతా ప్రాణభయంతో ఊరి విడిచి వలసబాట పట్టారు. ఇప్పటికే 40కి పైగా కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ళు, ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో ఏ ఇంటికి చూసినా ఇలా తాళాలు వేలాడుతున్నాయి. ఏదో శక్తి ఊరిని ఆవహించిందని ఆందోళన చెందుతున్న ఇక్కడి ప్రజలు ఇక్కడ ఉంటే ప్రాణాలు మిగలవనే ఆందోళనతోనే ఊరువిడిచి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. వింతవ్యాధితో ఊరంతా మృత్యువాత పడుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించారు. చనిపోయిన వారితోపాటు ప్రస్తుతం బ్రతికి ఉన్నవారి కుటుంబ సభ్యులకు మలేరియా, కరోనా, డెంగ్యూ టైపాయిడ్ టెస్టులు నిర్వహించారు. కానీ ఎలాంటి ఫలితంలేదు. నెగిటివ్ గానే వస్తుంది. ఈ చావులకు కారణమేమిటో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అంతు చిక్కడం లేదు.
మూఢనమ్మకాల వైపు అడుగులు
స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే మకాంవేసి మరోచావు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వరుస మరణాల నేపథ్యంలో మూఢనమ్మకాల వైపు అడుగులు వేస్తున్నారు. కచ్చితంగా ఏదో శక్తి ఆవహించిందని, చేతబడి చేశారని గ్రామమంతా ఆందోళన చెందుతుండడంతో స్థానిక సర్పంచ్ కూడా అయోమయంలో చిక్కుకున్నారు. వైద్యులకు కూడా ఈ వ్యాధి అంతుచిక్కకపోవడం వల్ల మూఢ నమ్మకాలవైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఊళ్ళో మిగిలిన15 కుటుంబాలు చీకటి పడితేచాలు ఒక్కచోట చేరి మృత్యువును జయించేందుకు మానవ ప్రయత్నాలు చేస్తూ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారి మరణాలకు కారణాలు తెలియదు... ఎప్పుడు ఎవరు బలవుతారో అర్థంకాక వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భీతిల్లుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment