రోగులను పరీక్షిస్తున్న వైద్య బృందం
అన్ని వసతులు సవ్యంగా, పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో డ్యూటీలకు వెళ్లమంటేనే డాక్టర్లు, ఇతర ప్రభుత్వాధికారులు అలసత్వం వహిస్తారు. తప్పదనుకుంటే వారంలో రెండ్రోజులు అలా వెళ్లి ఇలా రావడమే మహా గగనం. అలాంటిది దట్టమైన అరణ్యంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని వెళ్లాల్సిన గ్రామాల్లో వైద్య పరిస్థితి సంగతి గురించి మాట్లాడుకోవడం తప్పే. జ్వరమొస్తేనే దేవుడిపై భారం వేసే ఆదివాసీ గ్రామాలకు లెక్కేలేదు. సీజన్ మారిందంటే చాలు ఏజెన్సీల్లో పడకేసిన వైద్యం, విషజ్వరాలతో చనిపోయే సాటి మనుషుల గురించి లెక్కలేనన్ని వార్తలు చదువుతుంటాం.
మారుమూల గిరిజన పల్లెల్లో ఇప్పటికీ డాక్టర్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. వారం, రెండువారాలకోసారి ఓ ఆశ వర్కర్ వస్తే వస్తారు లేకుంటే అదీ లేదు. అలాంటిది ఓ మండల వైద్యాధికారి.. వైద్య సిబ్బందిని వెంటబెట్టుకుని తమ వద్దకే వస్తే.. ఇది అలాంటి తండాల ప్రజల ఊహకు కూడా అందదు. కానీ ములుగు జిల్లా వాజేడు వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు దీన్ని నిజం చేసి చూపించారు. కనీస వైద్య సేవలు గిరిజనుల హక్కు అని గుర్తించి తానే స్వయంగా ఓ గిరిజన తండాకు వెళ్లి వైద్యసేవలందించారు.
వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలో గుట్టలపైన ఉన్న పెను గోలు ఓ ఆదివాసీల కుగ్రామం. ఊళ్లో 18 ఇండ్లు, 23 కుటుంబాలు, 78 మంది జనాభా ఉన్నారు. వీరికి మట్టిరోడ్డు సౌకర్యం కూడా లేదు. గుట్ట దిగొస్తేనే సరుకులు, వైద్యం అందేది. ఒకట్రెండు కిలోమీటర్లు కాదు 15 కిలోమీటర్ల మేర గుట్ట పైకెక్కి దిగి కిందకు రావడం సులభమేం కాదు. వర్షాకాలంలోనైతే అదో పెద్ద యజ్ఞమే. ఒకే వాగును మూడు చోట్ల దాటాల్సి ఉంది. ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలీని పరిస్థితి వీరిది. పది, పదిహేను రోజులకోసారి ఆశ వర్కర్, ఏఎన్‌ఎంలు వచ్చి ఏదో మందులు ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడి గిరిజనులకు వైద్యమందిం చాలని జిల్లా వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు సంకల్పించారు. సబ్‌యూనిట్ ఆఫీసర్ శరత్ బాబు, హెల్త్ సూపర్‌వైజర్ కోటిరెడ్డి, శేఖర్, చిన్న వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎం రాజేశ్వరి, ఆశ వర్కర్ సమ్మక్కతో కలిసి గురువారం ఉదయం ఏడు గంటలకు వాజేడు నుంచి బయలు దేరారు. గుమ్మడిదొడ్డి గ్రామ చివర నుంచి గుట్ట ఎక్కుతూ 5 గంటల పాటు మధ్యలో వాగును మూడుచోట్ల దాటి 15 కిలోమీటర్లు కాలినడకన పెనుగోలుకు చేరుకున్నారు.
ఆదివాసీలకు వైద్య పరీక్షలు
ఆశ వర్కర్, ఏఎన్‌ఎం రావడమే ఎక్కువైన ఆ ఊరికి వైద్య సిబ్బంది వచ్చారనే సమాచారంతో గ్రామస్తులంతా ఒక్క చోటికి చేరారు. ముందు గిరిజనులతో మాట్లాడిన వైద్య బృందం అందరినీ పరీక్షించి అవసరమైన మందులు ఇచ్చారు. రోగులను పరీక్షించే సమయంలో ఊకే శ్రీలత, బొగ్గుల మల్లేష్, జనార్దన్‌లకు మలేరియా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించి వైద్యం అందించారు. మరో 10 మందికి జ్వరాలు ఉండటంతో వారికి వైద్యం చేశారు. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వారికి చికిత్స చేసి మందులు ఇచ్చారు. ఆ తరువాత గ్రామస్తులకు దోమ తెరలను పంపిణీ చేసి 18 గృహాల్లో దోమల మందు పిచికారీ చేశారు.
వర్షంతో ఆగిన ప్రయాణం
మధ్యాహ్నం 12 గంటలకు పెనుగోలుకు చేరుకున్న వైద్య బృందం ఆదివాసీలకు పరీక్షలు, మందులు, దోమ తెరల పంపిణీ పూర్తయ్యే సమయానికి వర్షం ప్రారంభమైంది. దీంతో గురువారం రాత్రి అక్కడే బసచేశారు. తమకు కలగా మారిన వైద్యాన్ని అందించిన అధికారులపై ఆది వాసీలు తమ గౌరవాన్ని చాటుకున్నారు. వైద్య సిబ్బందికి భోజనాలు పెట్టడంతోపాటు పడుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో గుడ్డి దీపాల వెలుగులోనే వైద్యాధికారి సహా సిబ్బంది విశ్రమించారు. ఉదయం లేవగానే వాజేడుకు రావడానికి పయనమైన వైద్య సిబ్బందికి జోరు వర్షంలోనూ గ్రామ స్తులు వెంటుండి వాగు దాటించారు. గుమ్మడిదొడ్డి గ్రామం వరకు మెడికల్ కిట్లను మోసుకొచ్చి దింపి వెళ్లారు. వైద్యం చేసి వాజేడుకు చేరుకునేంతవరకూ ఆ గ్రామస్తులు కొందరు వీరి వెంటే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఇంతవరకు ఎవరూ తమ ఊరివైపు కన్నెత్తి కూడా చూడలేదని డాక్టర్ మంకిడి వెంకటేశ్వర్లు సేవలను జీవితాంతం గుర్తుంచుకుంటామని పెనుగోలు గ్రామస్తులు తెలిపారు.
అదో మధురానుభూతి
గుట్టల పైనున్న పెనుగోలు గిరిజనులకు వైద్యం అందించడం మధురానుభూతిని మిగిల్చింది. అక్కడికి వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. అది ఇప్పుడు కుదిరింది. వారి ఆతిథ్యం, ఆదరణ మర్చిపోలేనివి. నేను పడుకున్నప్పుడు ఓ తేలు నా దగ్గరగా వస్తే దాన్ని గుర్తించి గ్రామస్తులు చంపారు. చిమ్మ చీకట్లో వారు ఉంటున్న దృశ్యం కలవరం కలిగించింది.
– మంకిడి వెంకటేశ్వర్లు, వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment