గిరిజనుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
గిరిజనుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
Published Wed, Jan 11 2017 10:34 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్
రంపచోడవరం : గిరిజనుల ఆరోగ్య భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో బు«ధవారం జాతీయ ఆరోగ్యమిషన్ నిధులు రూ.106 లక్షలతో నిర్మించే జిల్లా ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ టి.రత్నాబాయి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఐటీడీఏ పీఓ ఎ.ఎస్.దినేష్‌కుమార్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా రూ.59 లక్షలతో నిర్మించిన పేయింగ్ రూమ్‌లను ప్రారంభించారు. వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రూ.60 లక్షలతో నిర్మించిన రక్తనిధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గిరిజనులు కూడా మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పేస్‌లిప్టు కింద 71 ఆస్పత్రులు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యులను నియమించాలని, అంబులెన్స్‌లు, అవసమైన చోట కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ రత్నాబాయి మాట్లాడుతూ ఏజెన్సీ వృద్ధాశ్రమం నిర్మించాలని కోరారు.
ఆస్పత్రి అదనపు భవనం ప్రారంభం
అడ్డతీగల : రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అడ్డతీగలలో రూ.2.76 కోట్లతో నిర్మించిన ఆస్పత్రి అదనపు భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఏజెన్సీలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి నఫీసా మంత్రిని కోరారు. అందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్, రంపచోడవరం ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, సర్పంచ్ వై నిరంజనీదేవి, ఏజేసీ జె.రాధాకృష్ణమూర్తి, డీఎంహెచ్‌ఓ చంద్రయ్య, డీసీహెచ్‌ఎస్ రమేష్‌కిçషోర్, ఏజెన్సీ డీఎంహెచ్‌ఓ పవన్‌కుమార్, అడ్డతీగల ఎంపీపీ అన్నం సత్తిబాబు, జెడ్పీటీసీ అడారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement