ఇదో కేసు స్టడీ
ఇదో కేసు స్టడీ
Published Thu, Jun 29 2017 3:07 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
చాపరాయి మరణాలపై మంత్రి కామినేని
ఏజెన్సీలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన
కాళ్లవాపు మరణాలతో ఏం గుణపాఠం నేర్చుకున్నారు?
ఏజెన్సీలో అంటువ్యాధుల బారినపడి 16 మంది గిరిజనులు నెల్లాళ్ల వ్యవధిలో మరణిస్తే ఆ ౾అంశాన్ని మంత్రి కామినేని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా వ్యాఖ్యానించడమే దానికి అద్దం పడుతోంది.
రంపచోడవరం: చాపరాయిలో గిరిజనుల మరణాలు ఒక కేసు స్టడీలాంటివని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వాఖ్యానించారు. మారుమూల లోతట్టు గ్రామాల్లోని గిరిజన పల్లెలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని అమరావతిలో మంగళవారం వ్యాఖ్యానించిన మంత్రి కామినేని బుధవారం రంపచోడవరం పర్యటనలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారు. అంతుచిక్కని వ్యాధులతో, అంటురోగాలతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. రంపచోడవరంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంత మంది చనిపోతే నేర్చుకుంటారు?
గత ఏడాది విలీన మండలంలో కాళ్లవాపు వ్యాధితో 14 మంది గిరిజనులు మృతి చెందారు. అప్పుడు చింతూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కనీసం వచ్చిన రోగులకు వైద్య సేవలందించేందుకు పూర్తి స్ధాయిలో వైద్య సిబ్బంది నియమించలేదు. ఒక పక్క గిరిజనుల ప్రాణాలు పోతుంటే కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. ఇప్పటికీ కాళ్లవాపు వ్యాధికి మూలాలను తెలుసుకోలేకపోయారు. గ్రామాల్లో రక్షిత మంచినీరు ఇచ్చేందుకు ఆర్‌ఓ ప్లాంట్లును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించడం లేదు.
గైనిక్ సేవలు అందక మాతాశిశు మరణాలు
రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో 50 వరకు మతాశిశు మరణాలు సంభవించాయి. దీనిపై ప్రభుత్వం నేటికీ సీరియస్‌గా పరిగణించలేదు. గైనిక్ సేవలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోలేదు. గిరిజన మహిళలకు పౌష్టికాహారం అందడం లేదు. పీహెచ్‌సీ పరిధిలో క్షేత్రస్ధాయిలో పనిచేసే సిబ్బంది పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదు.
ఆశల సేవలకు ఏదీ గుర్తింపు?
ఏజెన్సీలో గ్రామస్ధాయిలో పనిచేసే ఆశ వర్కర్లకు వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే అతి కొద్దిపాటి జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. వారు గ్రామాల్లో వ్యాధినిరోధక కార్యక్రమాల అమలుకు పనిచేస్తున్నారు. వైద్య ఆరోగ్య పరిస్ధితులపై పీహెచ్‌సీ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వంటి కీలకమైన పనులు చేస్తున్నారు. అలాంటి వీరికి నెల నెలా చెల్లించాల్సిన రూ. 400 కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఏడాది కాలంగా ఆశవర్కర్లుకు చెల్లించాల్సిన రూ. 6 లక్షలు నేటికీ విడుదల కాలేదు. 2007 నుంచి 2014 వరకు ఎనిమిదేళ్లు పాటు సంవత్సరానికి మూడు నెలలు చొప్పున 24 నెలలు గౌరవ వేతనం రూ.19 లక్షల 20 వేలు నేటికి అందలేదు. విడుదలైన ఈ డబ్బు ఎవరి దగ్గర ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
Advertisement