ప్రజల సహకారంతోనే సత్ఫలితాలు
ప్రజల సహకారంతోనే సత్ఫలితాలు
Published Tue, Jun 27 2017 12:02 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
జిల్లాలో రూ.100 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు
సామర్లకోట : ప్రజల సహకారం ఉంటేనే అభివృద్ధి పనుల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. రూ.30 కోట్లతో పెద్దాపురం–సామర్లకోట నాలుగు లైన్ల రోడ్డుకు సోమవారం సాయంత్రం ఆయన ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద శంకుస్థాపన చేశారు. అన్నపూర్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసం గించారు. జిల్లాలో ఒకేరోజు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.100 కోట్లతో ఆర్‌అండ్‌బీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గతంలో ఉన్న ఆర్‌అండ్‌బీ మంత్రులు జిల్లాకు అన్యాయం చేశారని, దాంతో తాను చదువుకున్న తూర్పు గోదావరి జిల్లా, పుట్టిన విశాఖ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధచూపుతానని హామీ ఇచ్చారు. రాజానగరం నుంచి కాకినాడ వరకు రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా సామర్లకోట రైల్వే ట్రాకుపై మరో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తి చేశామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడీబీ రోడ్డును కలుపుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవడంతో ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.1.50 లక్షలు ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమానికి అ«ధ్యక్షత వహించిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు రోడ్డు నిర్మాణంలో భాగంగా రోడ్డు మార్జిన్‌లో ఉన్న విద్యుత్తు స్తంభాల మార్పునకు రూ.2.50 కోట్లు భరించాల్సి వస్తుందని, దానిని రెండు మున్సిపాలిటీలు భరించడానికి అంగీకరించాయని తెలిపారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు ప్రసంగించారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌లు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ముత్యాల రాజబ్బాయి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, రైతు సంఘం అధ్యక్షుడు కంటే బాబు, ఎంపీపీ గొడత మార్త, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టరు చందలాడ అనంతపద్మనాభం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement