R&B
-
రూ.242 కోట్లతో కొత్తగా 16 వంతెనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. మొత్తం రూ.242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతోపాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. కోస్తా జిల్లాల పరిధిలోని ఏడు వంతెనలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు రూ.137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 9 వంతెనలను నాబార్డ్ నిధులు రూ.105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది. -
నిమ్స్‌కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్ మంజూరు చేసింది. నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్‌కు సీఎం కేసీఆర్ జూన్ 14న భూమి పూజ చేశారు. నిమ్స్‌కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు ఆర్అండ్బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. -
ఎన్డీబీ టెండర్లు రద్దు
సాక్షి, అమరావతి: టెండర్లలో పోటీతత్వం పెంపొందించేందుకే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రద్దుచేశామని రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు స్పష్టంచేశారు. రీ టెండర్లలో వాస్తవాలు తెలుస్తాయని, పచ్చ పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, వారికి నమ్మకం కలిగించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లను రద్దుచేసినట్లు ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన ఆర్ అండ్ బీ ఈఎన్సీ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్ ప్రాజెక్టు ఫేజ్–1లో టెండర్లు పిలిచామని.. 26 పనులు, 13 ప్యాకేజీలకు 25 టెండర్ బిడ్లు మాత్రమే వచ్చాయన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్లు చేసిన విషయం రీ టెండర్లలో బహిర్గతం అవుతుందన్నారు. పారదర్శకంగా పనిచేయడమే కాదు.. పారదర్శకత ప్రతిబింబించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని.. టెండర్ల స్పందనపై ఆయన సమగ్రంగా సమీక్ష చేశారని కృష్ణబాబు వివరించారు. అధిక మొత్తం విలువగల టెండర్లలో తక్కువ మంది పాల్గొనడం సహజమేనని ఎన్డీబీ పేర్కొన్నా.. పారదర్శకత, నిష్పాక్షికతకు పెద్దపీట వేసేందుకే ప్రస్తుత టెండర్లను రద్దుచేసి మళ్లీ టెండర్లకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లను పూర్తిచేయాలని ఎన్డీబీ కోరిందని, అయితే.. తాను కేంద్రంతో మాట్లాడి గడువు కోరతానని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కృష్ణబాబు ఇంకా ఏమన్నారంటే.. – అర్హత విషయంలో చాలా కంపెనీలున్నా, 14 కంపెనీలే టెండరు వేయడానికి గల కారణాలు తెలుసుకుంటాం. – ఏపీ ప్రభుత్వం, ఎన్డీబీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు లోబడి ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం పనులను నిర్వహిస్తాం. – ఎక్కువమంది టెండరులో పాల్గొనేలా చేస్తే, రాష్ట్రంలో మరింత ఎక్కువ కిలోమీటర్లు అభివృద్ధి చేసే అవకాశముంది. – జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్, రివర్స్ బిడ్డింగ్ కూడా పారదర్శకత కోసమే. – కాంట్రాక్టర్లకు బ్యాంకులలో లిక్విడిటీ, కోవిడ్ కారణంగా లేబర్ అందుబాటు ఇబ్బందులు ఉండచ్చు. విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదు. ముందుగా 15 శాతం అడ్వాన్స్‌లు విడుదల చేస్తారు. – ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం టెండరు విలువ ఎంత ఉంటుందో.. కాంట్రాక్టు కంపెనీ టర్నోవర్ అంత ఉండాలి. – రాష్ట్రంలో అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో సంప్రదించమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశాం. కాంట్రాక్టర్లు బ్యాంకు గ్యారంటీ, జీపీఏ మాత్రమే హార్డ్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. – ఏ రకమైన సమస్య ఉన్నా కాంట్రాక్టు ఏజెన్సీలు నేరుగా సూపరింటెండెంట్/చీఫ్ ఇంజనీర్లను సంప్రదించవచ్చు. – జరిగిన టెండర్లపై ఒక్క ఫిర్యాదు లేదా అభ్యంతరం రాలేదు. – టెండరు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. – ప్రాజెక్టు టెండర్లను భౌతికంగా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం. – టెండర్ల పూర్తికి 45 రోజుల గడువు ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ అదనపు కార్యదర్శి చెప్పారు. – మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. – కొన్ని వార్తాపత్రికలు, పనికట్టుకుని నిరాధారమైన వార్తలు ప్రచురించడం, ప్రజల్లో లేనిపోని అనుమానాలకు తావిచ్చేలా దురుద్దేశ్యపూర్వక రాతలు రాశాయి. వాటిని నివృత్తి చేస్తూ టెండరుదారుల్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు కలగకుండా ఈ టెండర్లు రద్దుచేశాం. – ఎక్కువ మంది టెండర్లలో పాల్గొంటే ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యత పెరుగుతుంది. – నిధులు మిగలడంవల్ల మరిన్ని పనులు చేపట్టే వీలు కలుగుతుందన్న అభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్ వ్యక్తంచేశారు. -
రోడ్లు అద్దాల్లా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రోడ్ల నిర్మాణంలో భద్రత, నాణ్యతకు పెద్దపీట వేయాలని ఆర్అండ్బీ కమిషనర్ సునీల్‌శర్మ అన్నారు. రోడ్లు అద్దాల్లా ఉండాలన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఆర్అండ్ బీ ఆధ్వర్యంలో రాబోయే 5 ఏళ్లలో రోడ్ల స్థితిగతులు, చేపట్టాల్సిన పనులపై మేధోమథనం జరిగింది. రాష్ట్రంలోని రోడ్ల స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించిన క్రమంలో ఈ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సునీల్‌శర్మ ఇంజనీర్లకు పలు విషయాల్లో దిశానిర్దేశం చేశారు. రాబోయే ఐదేళ్లలో చేయాల్సిన పనులపై ఈ నెల 15లోగా సమగ్ర నివేదిక రూపొం దించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీని ఆధారంగా బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. త్వరలో ఖాళీల భర్తీ: గణపతిరెడ్డి ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రోడ్లు దేశంలోనే గర్వపడేలా నిర్మించాలన్నారు. పని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో 135 ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నారు. మరో ఈఎన్సీ లింగయ్య మాట్లాడుతూ, క్షేత్రస్థాయి లో పనిచేసే ఇంజనీర్లకు ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్ల నిర్వహణ కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని ఈఎన్సీ రవీందర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాంబులపై అవగాహన అవసరం: సతీశ్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తోన్న సిబ్బందికి మావోలు అమర్చే బాంబులపై అవగాహన కల్పించాలని చీఫ్ ఇంజనీర్ సతీశ్ కోరారు. ఐ–సాప్ ద్వారా రుణం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్ చందూలాల్ కోరారు. మరో చీఫ్ ఇంజనర్ ఆశారాణి పంచాయతీ రోడ్ల పురోగతి వివరించారు. -
విమానాశ్రయంపై చిగురిస్తున్న ఆశలు
అడ్డాకుల(దేవరకద్ర): అడ్డాకుల మండల పరిధిలో మినీ విమానాశ్రయం ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో అధికారులు స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు. మండలంలోని గుడిబండ శివారులో మంగళవారం ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు స్థలపరిశీలన చేశారు. మహబూబ్‌నగర్ ఆర్అండ్బీ ఏఈ వేణుగోపాల్, అడ్డాకుల గిర్దావర్ మంజుల, సర్వేయర్ సాయిబాబా, రెవెన్యూ కార్యదర్శి కిరణ్ చిన్నమునుగల్‌ఛేడ్, పెద్దమునుగల్‌ఛేడ్ శివారులోని ఓ స్థలాన్ని పరిశీలించారు. అయితే అక్కడ చెరువు కాలువ ఉండటంతో గుడిబండలోని సర్వే నంబర్ 108 పరిసరాల్లోని ఇతర సర్వే నంబర్లలో పొలాలను పరిశీలించారు. దాదాపు 300 ఎకరాల స్థలాన్ని గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. హైదరాబాద్ నుంచి 120కిలోమీటర్ల దూరంలో స్థలాలను ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో అధికారులు ఇక్కడి స్థలాన్ని ఎంపిక నిమిత్తం పరిశీలించి మ్యాపులను రూపొందిస్తున్నారు. కాగా, తొలుత అడ్డాకులతో పాటు మూసాపేట, భూత్పూర్ మండలాల్లోని పలుప్రాంతాలను అధికారులు పరిశీలించారు. అదేవిధంగా భూత్పూర్ మండలంలోని రావులపల్లిలో కూడా ఓ స్థలాన్ని పరిశీలించగా ఓ దశలో అక్కడే విమానాశ్రయం ఏర్పాటు కానుందన్న ప్రచారం సాగింది. అయితే ఆయా ప్రాంతాలు విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా లేవని ఉన్నతాధికారులు తిరస్కరించడంతో తాజాగా అడ్డాకుల మండలంలో అధికారులు సర్వే చేస్తున్నారు. దీంతో అడ్డాకుల మండలంలో మినీ విమానాశ్రయం ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. -
మోక్షం లేదా..!
♦ కొట్టాలకు వెళ్లేందుకు గతుకులుగా ఉన్న రోడ్డు ♦ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్అండ్బీ విలీనానికి రాని ఆదేశాలు ♦ పట్టించుకోని అధికారులు కొట్టాల(రాజుపాళెం) : గ్రామాల్లో ఉన్న పంచాయతీ రాజ్ రోడ్లకు మోక్షం కలగడం లేదు. ఎన్నో ఏళ్లుగా గతుకుల రోడ్లతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. అదే కోవలోనే రాజుపాళెం మండలంలోని కొట్టాల రోడ్డు ఉంది. ఈ రోడ్డును అభివృద్ధి చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాదెగూడూరు నుంచి కొట్టాల గ్రామానికి పంచాయతీ శాఖ రాజ్ అధికారులు కొన్నేళ్ల కిత్రం తారురోడ్డును వేశారు. ఎనిమిదేళ్లుగా పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఈ రోడ్డుకు మరమ్మతులు లేదా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఒకసారి ఆర్ఆర్ఎం గ్రాంటు కింద నిధులు మంజూరు చేసి టెండరు ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ టెండరును రద్దు చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ రోడ్డుకు నిధులు మంజూరు కాలేదు. విలీనానికి బ్రేక్: ఈ రోడ్డు అభివృద్ధికి నిధులు లేవని పం చాయతీ రాజ్ శాఖ చేతులెత్తేయడంతో.. ఆర్అండ్బీ అధికారులు ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీలోకి విలీనం చేసేందుకు ఉన్నతాధికారులకు ఇటీవల ప్రతిపాదనలు పంపిం చారు. వాటికి కూడా మోక్షం కలగలేదు. ఈ రోడ్డును గాదెగూడూరు నుంచి కూలూరు సమీపంలోని కుందూ నదిపై నిర్మించిన హైలెవెల్ వంతెన వరకు అనుసంధానం చేశారు. ఈ దారి అధ్వానంగా ఉండటంతో గతంలో ఆర్టీసీ బస్సును కూ డా రద్దు చేశారు. తిరిగి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ అధికారుల వద్దకు వెళ్లి బస్సును తిప్పాలని కోరడంతో వారు తిప్పుతున్నారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా చాగలమర్రిలోని జాతీయ రహదారి 40కి ఈ రోడ్డు అనుసంధానంగా ఉంది. నిత్యం ఈ దారిలో రాకపోకలు జరుగుతుండేవి. అయితే గుంతలమయంగా మారడంతో కూలూరు మీదుగా వాహనదారులు వెళుతున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బీ అధి కారులైనా చొరవ తీసుకొని పంచాయతీ రాజ్‌శాఖలో ఉన్న ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీలోకి బదలాయించి అభివృద్ధి చేయాలని కొట్టాల గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోడ్డును మరిచారు మా గ్రామానికి వెళ్లే కొట్టాల రోడ్డును అభివృద్ధి చేయడంలో అటు అధికారులు, ప్రజాప్రతినిధులు మరిచారు. బండ్ల బాట కన్నా అధ్వానంగా ఉండటంతో ఇబ్బందికరంగా ఉంది. రోజూ చాగలమర్రి, ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు ఈ రోడ్డే దిక్కు. ఏళ్లు గడస్తున్నా గుంతలు కూడా పూడ్చలేదు. – నరసింహరెడ్డి, కొట్టాల నాగరికతకు దూరంగా.. ఆధునిక యుగంలో కూడా కొట్టాల గ్రామం వెనుకబడి ఉంది. ఎవరైనా గ్రామానికి వచ్చేందుకు కనీసం రోడ్డు కూడా బాగలేదు. ఇక్కడ ఒక గ్రామం ఉందని అధికారులకు, పాలకులకు తెలియదా? తెలిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదు. – రంగారెడ్డి, కొట్టాల -
ప్రజల సహకారంతోనే సత్ఫలితాలు
జిల్లాలో రూ.100 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు ఆర్అండ్బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సామర్లకోట : ప్రజల సహకారం ఉంటేనే అభివృద్ధి పనుల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆర్అండ్బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. రూ.30 కోట్లతో పెద్దాపురం–సామర్లకోట నాలుగు లైన్ల రోడ్డుకు సోమవారం సాయంత్రం ఆయన ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద శంకుస్థాపన చేశారు. అన్నపూర్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసం గించారు. జిల్లాలో ఒకేరోజు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.100 కోట్లతో ఆర్అండ్బీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గతంలో ఉన్న ఆర్అండ్బీ మంత్రులు జిల్లాకు అన్యాయం చేశారని, దాంతో తాను చదువుకున్న తూర్పు గోదావరి జిల్లా, పుట్టిన విశాఖ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధచూపుతానని హామీ ఇచ్చారు. రాజానగరం నుంచి కాకినాడ వరకు రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా సామర్లకోట రైల్వే ట్రాకుపై మరో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తి చేశామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడీబీ రోడ్డును కలుపుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవడంతో ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.1.50 లక్షలు ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమానికి అ«ధ్యక్షత వహించిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు రోడ్డు నిర్మాణంలో భాగంగా రోడ్డు మార్జిన్లో ఉన్న విద్యుత్తు స్తంభాల మార్పునకు రూ.2.50 కోట్లు భరించాల్సి వస్తుందని, దానిని రెండు మున్సిపాలిటీలు భరించడానికి అంగీకరించాయని తెలిపారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు ప్రసంగించారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ముత్యాల రాజబ్బాయి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, రైతు సంఘం అధ్యక్షుడు కంటే బాబు, ఎంపీపీ గొడత మార్త, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టరు చందలాడ అనంతపద్మనాభం తదితరులు పాల్గొన్నారు. -
నత్తకు నడక..
⇒ ముందుకెళ్లని ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ ⇒ రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాని వైనం ⇒ పైపులైన్ లీకేజీలతో పరేషాన్ కరీంనగర్ కార్పొరేషన్ : జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా.. మంజూరు చేసిన పనులను పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టు నుంచి వర్క్‌షాప్ వరకు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన జగిత్యాల రోడ్డు పను లు ఇంకా పూర్తికావడం లేదు. మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల మధ్య లోపించిన సమన్వయం ప్రజలకు శాపంగా మారింది. ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు తెచ్చిపెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక సెంటిమెంట్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఆగస్టు 5న కరీంనగర్లో తొలిసారి పర్యటించారు. ఆయన పర్యటనలో ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణకు రూ.46 కోట్లు మంజూరు చేశారు. ఆగస్టు 12న నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. ఆ తర్వాత నిధులు సరిపోవని మరో రూ.29 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.70 కోట్ల నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీచేశారు. అయితే.. పనులు చేపట్టిన నాటి నుంచి అన్నీ అడ్డంకులే. మొదట రోడ్డు వైండింగ్ పనుల్లో తీవ్ర జాప్యం జరగగా, ఆ తర్వాత మంచినీటి పైపులైన్ పనులు రోడ్డు పనులను ముందుకు సాగకుండా చేశాయి. దీంతో ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ నత్తకు నడకనేర్పినట్లు జరుగుతోంది. రెండేళ్లుగా తీవ్ర జాప్యం.. నగరంలోని 14.5 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్ల పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు విస్తరణకు మార్కింగ్, కూల్చివేత పను లు సుమారు ఆరు నెలలపాటు జరిగాయి. ఆ తర్వాత రోడ్డు పనులు ప్రారంభించారు. కోర్టు నుంచి జగిత్యాల రోడ్డు, సివిల్ ఆసుపత్రి నుం చి అపోలో రీచ్రోడ్డు, రాంనగర్ రోడ్డు పనుల ను మొదటి దశలో చేపట్టగా, అప్పటికే ఆ రో డ్లలో ఉన్న పాత కాలంనాటి మంచినీటి పైపులైన్లు పగిలిపోవడం, నెలల తరబడి ప్రజలకు తాగునీటి సరఫరా లేకపోవడంతో వ్యతిరేకత వచ్చింది. మరమ్మతులతో పని జరగకపోవడంతో ఆ తర్వాత కొత్తపైపులైన్లు వేసేందుకు కార్పొరేషన్ టెండర్లు నిర్వహించింది. హెచ్డీపీఈ పైపులైన్లు వేసి శాశ్వత పరిష్కారం చేపట్టాలని భావించారు. కానీ.. అది కూడా బెడిసికొట్టింది. పైపులైన్లు పూర్తయ్యాయని ఆర్అండ్బీ రోడ్ల కాంట్రాక్టర్ రోడ్డు పనులు మొద లు పెట్టారు. అయితే.. కొత్తగా వేసిన హెచ్డీపీఈ పైపులైన్లు కూడా నాసిరకం పనులతో లీకేజీలు బయటపడుతుండడంతో మళ్లీ మొదటికొచ్చింది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ లీకేజీలు అవుతుండడంతో పనులు పడకేశాయి. సర్వసాధారణం.. ఆర్అండ్బీ రోడ్ల పనులు పూర్తిచేసేందుకు మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో నెలకోసారి మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ.. పనులు ముందుకు కదలడం లేదు. మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎక్కడో ఒక చోట తాగునీటి పైపులైన్ లీకేజీ జరగడం సర్వసాధారణంగా మారింది. అయితే.. పైపులైన్ పనులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నామని, ఫిబ్రవరి మొదటి వారంలోనే పైపులైన్ పనులు పూర్తిచేసి అప్పగిస్తామని కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. పాత లీకేజీలను అరికడుతుంటే కొత్త లీకేజీలు కొంప ముంచుతున్నాయి. దీనంతటికీ నాసిరకం పనులే కారణంగా తెలుస్తోంది. లీకేజీలు ఏర్పడుతుంటే పనులు చేయడం సాధ్యం కాదని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 4న మంత్రి కేటీఆర్, 5న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా కోర్టు రోడ్డును పరిశీలించి పనులపై పర్యవేక్షించారు. అయినప్పటికీ ముందుకు కదలడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి రెండు శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ప్రమాదాల మలుపు
► ప్రమాదాలకు కారణమవుతున్న మూల మలుపులు ► పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంట ఉన్న మూలమలుపులు మృత్యు మలుపులుగా మారుతున్నాయి. ఈ మలుపులు ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మండలంలోని పీచర, లక్ష్మణచాంద, మల్లాపూర్, మునిపెల్లి, రాచాపూర్, పొట్టపెల్లి, న్యూవెల్మల్, పీచర గ్రామాలకు వెళ్లే రహదారులు చాలా మూల మలుపులు ఉన్నాయి. దీంతో ఆ రహదారుల వెంట ప్రయాణం చేసేటప్పుడు ముందు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ మార్గాల్లో పలు ప్రమాదాలు సంభవించాయి. మూల మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు ఉండాలని నిబంధనలు ఉన్నా చాలా మలుపుల వద్ద సూచికలు లేవు. ఈ విషయాన్ని సంబంధిత గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే అనేక సార్లు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు కనిపించదు.. మూల మలుపుల వద్ద పిచ్చి మొక్కలు పెరిగి రోడ్డు మొత్తం కనిపించకుండా ఉంది. దీంతో రోడ్డుపై ప్రయాణించే ప్రయాణించే వాహనదారులు తరచు ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొంటున్నారు. వేగంగా వస్తే ప్రమాదం ఖాయం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలు జరిగినా.. మండలంలోని వివిధ రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరును గమనిస్తే వాహనదారులు వెళ్లే సమయంలో ముందు నుంచి వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బొప్పారం గ్రామం వద్ద ఇద్దరు వాహనాదారులు ఢీ కొనగా వారిలో ఒకరు అక్కడిక్కడే మరణించారు. మండలంలోని వడ్యాల్ గ్రామం సమీపంలో గల మూలములపు వద్ద ఇటీవల రెండు ఆటోలు ఢీ కొనగా అందులో ప్రయాణిస్తున్న లక్ష్మణచాంద మహిళ తన ఒక చేతును పూర్తిగా కోల్పోయింది. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మండలవాసులు కోరుతున్నారు. సూచికలు ఏర్పాటు చేయాలి మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారుల మూల మలుపుల వద్ద తప్పనిసరిగా ప్రమాద హెచ్చరికలను సూచించే బోర్డులనుదేర్పాటు చేయాలి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి ఇకమీద నివారణకు చర్యలు తీసుకోవాలి. – రమేశ్ పిచ్చి మొక్కలు తొలగించాలి మండలంలోని ప్రధాన రహదారుల మూల మలుపుల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలి. దీంతో వాహనదారులకు ముందు నుంచి వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్లే ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయి. – జహీరోద్దిన్ బోర్డులను ఏర్పాటు చేస్తాం మండలంలోని ప్రధాన రహదారులపై ఉన్న మూల మలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులను తొందరలోనే ఏర్పాటు చేస్తాం. అంతే గాకండా రహదారుల వెంట గల పిచ్చి మొక్కలను తొలగిస్తాం. ఇకపై ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటాం. – ఎజ్దాని, ఏఈ, ఆర్అండ్బీ -
ఆర్‌అండ్‌ఛీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రహదారులు భవనాల శాఖ (ఆర్అండ్బీ) రహదారులంటే వాహనదారులకు వణుకు పుడుతోంది. జిల్లాలో పలుచోట్ల ఈ రోడ్లలో నిర్మాణ పనులు దీర్ఘకాలికంగా సాగుతుండడమే ఇందుకు కారణం. సాధారణంగా ఒక రోడ్డు పని మొదలు పెడితే ఆరు నెలల్లో పూర్తవుతుందని అంచనా ఉంటుంది. కానీ ఆర్అండ్బీ జిల్లా శాఖ తలపెట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణాలు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో రోజువారీ ప్రయాణికుల బాధలు అంతా ఇంతా కావు. రోడ్డు వెడల్పు, డబుల్‌రోడ్డు నిర్మాణం, వంతెనలు.. ఇలా పలు రకాలుగా ఆ శాఖ పనులు నిర్వహిస్తోంది. నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ల తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్లు వాటిని పూర్తిచేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా ఆ మార్గం నుంచే వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఆర్అండ్బీ విభాగం ఆరు గ్రామీణ నియోజకవర్గాల పరిధిలో 29 పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు అప్పగించింది. ఈ పనులకు సంబంధించి వ్యయం రూ. 557.61కోట్లు. ఇంతటి భారీ మొత్తంలో చేపట్టిన పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 24 ప నులు మొదలుపెట్టగా.. అందులో కేవలం మూడు మాత్రమే పూర్తయ్యాయి. మరో 5 పనులు ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. పూర్తిచేసినట్లు చూపిన మూడు రోడ్ల పనులు అత్యంత తక్కువ వ్యయానికి సంబంధించినవి కావడం గమనార్హం, అంతటా నిర్లక్ష్యమే...! ఆర్అండ్బీ చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒకవైపు నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తుండగా.. మరోవైపు పనులు జరిగే చోట కనీస జాగ్రత్తలు పాటించకపోవంతో ప్రయాణికుల యాతన పడుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచాల వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో కనీసం సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయడం లేదు. గండిపేట నుంచి శంకర్పల్లి రోడ్డు 0/0 కిలోమీటర్ల నుంచి 23/05 వరకు రూ. 75కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల్లో అత్యధిక నిధులు ఈ ప్రాజెక్టుకే కేటాయించగా.. ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఇబ్రహీంపట్నం నుంచి సాగర్ వైపు రోడ్డు నిర్మాణ పనులు రెండు దశల్లో చేపట్టారు. ఇందుకు రూ. 42కోట్లు కేటాయించారు. కృష్ణా పుష్కరాలు వచ్చేలోపు ఈ పనులు పూర్తిచేయాల్సి ఉంది. గడువు సమీపిస్తున్నప్పటికీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో అనుకున్న సమయంలోగా పనులు పూర్తవడంపై సందేహం నెలకొంది. దేవరంపల్లి-శంకర్పల్లి రోడ్డులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ రోడ్డుకు రూ.13 కోట్లు మంజూరైనప్పటికీ.. యంత్రాంగం ఉదాసీనతతో పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 7 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ. 140కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు ఒక్క నిర్మాణమూ పూర్తికాలేదు. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గానికి 6 పనుల నిమిత్తం రూ. 173.5కోట్లు మంజూరు చేయగా.. ఇక్కడ కూడా ఒక్క నిర్మాణమూ పూర్తికాలేదు. హైదరాబాద్‌నుంచి ఎక్కువగా రద్దీ ఉండే ఈ నియోజకవర్గాల్లోని రోడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం వాహనదారులకు నరకం చూపిస్తోంది. -
కబ్జా స్థలాలు స్వాధీనం చేసుకోండి
ఆర్అండ్బీ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన రోడ్లు భవనాలశాఖ స్థలాల ను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటి సరిహద్దులు నిర్ధారించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాటిని తిరిగి రికార్డుల్లో పొందుపరచాలన్నారు. సోమవారం ఆయన ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం చేపట్టిన రోడ్లు, వంతెనల పనులను వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూవివాదాల వల్ల పనుల్లో జాప్యం లేకుం డా చూడాలన్నారు. ఆ వివాదాలను సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించా రు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చ టం, శిథిలమైన రహదారులకు మరమ్మతు చేయటం, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రహదారుల నిర్మాణం, నదులు, వాగులు వంకలపై చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాన్ని గడువులోగా పూర్తిచేయాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు ఇల్లు, కార్యాలయా ల సముదాయం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున డిసెంబరు నాటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. గడువులోగా రోడ్లు పూర్తి చేయని కాంట్రాక్టర్లను ఉపేక్షించబోమన్నారు. హైదరాబాద్‌లో తుదిదశకు చేరుకున్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను డిసెంబరు కల్లా పూర్తిచేయాలన్నారు. ఎర్రమంజిల్‌లో పూర్తయిన రోడ్లు భవనాల శాఖ కార్యాలయ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీలు బిక్షపతి, రవీందర్రావు, గణపతిరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
చినబాబు ఓ చిటికేస్తేసింగిల్ టెండర్ ఓకే
రాజధానిలో రూ.101 కోట్ల పనులు అడ్డదారిలో అప్పగింత * ఆర్అండ్బీ ఆరంతస్తుల భవన టెండర్లలో గోల్మాల్ * ప్రి కాస్ట్ విధానంలో భవన నిర్మాణానికి సాధారణ టెండరు * నాలుగు శాతం కంటే ఎక్సెస్‌కు దాఖలైన టెండరు ఆమోదం * దాఖలైన రెండు టెండర్లలో ఓ టెండర్‌ను డిస్ క్వాలిఫై చేసిన కమిటీ * చినబాబు జోక్యం వల్లే సింగిల్ టెండరు ఆమోదం * కోర్టును ఆశ్రయించిన అనర్హత వేటు పడిన పోటీదారు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ విభాగాలకు నిర్మిస్తున్న భవనాలు అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారాయి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న చినబాబు అండతో రూ.కోట్ల విలువైన పనుల్ని అడ్డదారిలో చేజిక్కించుకుంటూ చెలరేగిపోతున్నారు. దీనికి ఉన్నతాధికారులు తలూపుతుండటంతో యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతోంది. అందులో భాగంగా ఏకంగా రూ.101 కోట్ల విలువైన భవన నిర్మాణ పనుల్ని అస్మదీయుడైన ఓ కాంట్రాక్టరుకు అప్పనంగా అప్పగించేశారు. అదీ 4.6 శాతం ఎక్సెస్‌తో దాఖలైన టెండరుకు కట్టబెట్టారు. దాఖలైన రెండు టెండర్లలో ఓ టెండరును ప్రైస్ బిడ్ తెరవకుండానే అనర్హత వేటు వేశారు. టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించలేదని పోటీదారుడి టెండరును తిరస్కరించారు. అత్యంత గోప్యంగా సింగిల్ టెండరు దారుడితో ఏప్రిల్ నెలాఖరున అగ్రిమెంట్ కుదుర్చుకుని పనులు అప్పగించారు. దీంతో రెండో టెండరు దాఖలు చేసిన పోటీదారుడు కోర్టును ఆశ్రయించారు. రూ.101 కోట్ల టెండర్లలో గోల్మాల్ ఇదీ... రవాణా, ఆర్అండ్బీ శాఖల కోసం ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలోని బందరు రోడ్డులో ఆరంతస్తుల భవనం నిర్మాణానికి గతేడాది ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. రూ.101 కోట్లతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవంతిని ఆర్‌అండ్‌బీకి చెందిన రెండెకరాల స్థలంలో నిర్మించేందుకు నిర్ణయించారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన వెంటనే టెండర్లు పిలిచి భవన నిర్మాణ పనులు మొదలుపెట్టాలి. అంచనా రూ.వంద కోట్లు దాటిందంటే గ్లోబల్ టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సాధారణంగా ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచింది. కేఎంవీ ప్రాజెక్ట్సు, ఛాబ్రాస్ అసోసియేట్స్ టెండర్లు దాఖలు చేశాయి. దాఖలైన టెండర్లలో ప్రైస్ బిడ్ తెరిచే ముందు టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించాలి, టెండర్లలో కేఎంవీ ప్రాజెక్ట్సు 4.6 శాతం ఎక్సెస్‌తో టెండరు దాఖలు చేసినట్లు ప్రైస్‌బిడ్ తెరిచిన తర్వాత ఆర్అండ్బీ అధికారులు పొందుపరిచారు. ఛాబ్రాస్ అసోసియేట్స్ మాత్రం టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించలేదని అనర్హత వేటు వేశారు. సింగిల్ టెండరు వేసిన కేఎంవీ సంస్థకు రూ.101 కోట్ల విలువైన పనుల్ని కట్టబెట్టారు. సింగిల్ టెండరు ఒక్కటే టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధిస్తే మరోసారి టెండర్లు పిలవాలి. అయితే ఏకంగా సింగిల్ టెండరుకు పనుల్ని కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చినబాబు జోక్యం తోనే ఆర్‌అండ్‌బీలో ముఖ్య ఇంజనీరు టెండరు ఆమోదంలో చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలు తోసిరాజని.. రూ.వంద కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలవాలంటే కనీసం జాతీయ స్థాయి పత్రికల్లో టెండరు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆర్అండ్బీ అధికారులు ఏ ప్రకటన జారీ చేయలేదు. అయితే ముందుగానే ఎంపిక చేసుకున్న సంస్థకు టెండరు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఆర్అండ్బీ అధికారులు నిబంధనలన్నీ పక్కన పెట్టారు. ఆరు అంతస్తుల భవన నిర్మాణం, విద్యుత్తు పనులు, ఫర్నీచర్ ఏర్పాటు లాంటి పనుల్ని ప్యాకేజీల కింద విడగొట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే దాఖలైన రెండు టెండర్లలో ఛాబ్రాస్ అసోసియేట్స్ దాఖలు చేసిన టెండరును ప్రాథమిక దశలోనే సాంకేతిక అర్హతలు లేవని పక్కన పెట్టేశారు. విద్యుత్తు పనులు చేయడంలో వైఫల్యం చెందారన్న సాకుతో అసలు ప్రైస్ బిడ్ తెరవకుండా, ప్రీ కాస్ట్ విధానంలో అసలు అర్హత లేదన్న కారణంతో డిస్క్వాలిఫై చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కనీసం ఒకే ఒక టెండరు దాఖలైతే మళ్లీ రెండోసారి టెండరు పిలవాలి. ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా టెండరు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెండరు ఖరారులో ఆర్అండ్బీ అధికారుల నడుమ విభేదాలు పొడచూపినట్లు సమాచారం. కేఎంవీ సంస్థ ఎవరిది? ప్రీ కాస్ట్ విధానంలో భవంతులు నిర్మాణంలో అనుభవం ఉందని పేర్కొంటున్న కేఎంవీ ప్రాజెక్ట్సు నిర్వాహకులకు ప్రభుత్వంలో కీలక వ్యక్తులతో నేరుగా సంబంధాలున్నాయి. చినబాబు జోక్యంతోనే నిబంధనలన్నీ పక్కనపెట్టి టెండరు కేఎంవీ ప్రాజెక్ట్సుకు అప్పగించారు. ఎన్నికల సమయంలో టీడీపీకి ఆర్థిక సాయం అందించారనే కారణంతోనే రాజధాని ప్రాంతంలో చేపడుతున్న ప్రాజెక్టును కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో నిజాం క్లబ్ రెన్యువేషన్స్లో భాగంగా ప్రీ కాస్ట్ విధానంలో అద్భుతంగా నిర్మిస్తున్నారని ఆర్అండ్బీ అధికారులు పేర్కొంటున్నారు. కమిటీ ఆమోదంతోనే ఖరారు చేశాం కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) ఆమోదం తర్వాత సింగిల్ టెండరును ఖరారు చేశామని ఆర్అండ్బీ ఈఎన్సీ గంగాధరం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. తనతో పాటు ఏపీఆర్డీసీ ఎండీ, క్వాలిటీ కంట్రోల్ సీఈ తదితరులతో ఓ కమిటీ ఉంటుందని, ఈ కమిటీ ఆమోదంతోనే సింగిల్ టెండరును ఆమోదించి కేఎంవీ సంస్థకు పనుల్ని కట్టబెట్టామని చెప్పారు. ఛాబ్రాస్ అసోసియేట్స్‌కు విద్యుత్తు పనుల్లో అనుభవం లేదని, ఈ సంస్థకు ఏపీలో కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ లేదని తెలిపారు. ప్రీ కాస్ట్ పనుల్లో కేఎంవీ కాంట్రాక్టు సంస్థకు అనుభవం ఉందని, ఆర్నెల్లలో పూర్తి చేసి ఆరు అంతస్తుల భవనం ఆర్‌అండ్‌బీకి అప్పగించనున్నారని వివరించారు. - గంగాధరం, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ -
గజ్వేల్ రింగ్ రోడ్డుపై స్పష్టత
♦ రూ.200 కోట్లతో ఫోర్‌లేన్ రహదారి ♦ నాలుగు రేడియల్ రోడ్లతో అనుసంధానం ♦ ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు గజ్వేల్ : గజ్వేల్ రింగ్ రోడ్డు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ రోడ్డును నాలుగు లేన్లుగా మార్చి, పట్టణానికి అనుబంధంగా ఉన్న నాలుగు రేడియల్ రోడ్లతో అనుసంధానం చేస్తారు. డబుల్ లేన్ అనుకున్న దానిని నాలుగు లేన్లుగా మారుస్తారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.90కోట్లకు మరో రూ.110కోట్లు వెచ్చించి మొత్తం రూ.200కోట్లతో పనులు చేపట్టాలని భావిస్తున్నట్టు ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు సోమవారం గజ్వేల్‌లో తెలిపారు. నగర పంచాయతీ పరిధిలో దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్య నెలకొని ఉంది. ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించిన సీఎం అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌కు రింగ్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే రింగ్ రోడ్డుకు రూ.90కోట్లు మంజూరు చేశారు. పట్టణంలోని 133/33కేవీ సబ్స్టేషన్నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్ కళాశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతారు. నాలుగు లేన్లుగా.. సోమవారం గజ్వేల్‌కు వచ్చిన ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు రింగ్‌రోడ్డుపై స్పష్టత ఇచ్చారు. మొదట గజ్వేల్ చుట్టూ 19కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 140 ఎకరాలను సేకరించారు. ముందుగా 100మీటర్ల వెడల్పుతో నిర్మించాలనుకున్న ఈ రోడ్డును 150 మీటర్లకు పెంచి నాలుగు లేన్లుగా నిర్మించాలని నిర్ణయించారు. దీంతో అంచనా వ్యయం రూ.200 కోట్లకు పెరగనుంది. రింగ్ రోడ్డు కోసం 140 ఎకరాలు సేకరించగా నాలుగు లేన్లుగా మారిస్తే అదనంగా మరో 70 ఎకరాలు అవసరం. అదేవిధంగా పొడవు సైతం 24 కిలోమీటర్లకు పెరుగుతుంది. పట్టణంలోని పిడిచెడ్, ధర్మారెడ్డిపల్లి, జాలిగామ, సంగాపూర్ రేడియల్ రోడ్లను రింగ్ రోడ్డుతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. రూ. 1663కోట్లతో ఆర్అండ్బీ పనులు జిల్లాలో రూ. 1663 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు రవీందర్రావు తెలిపారు. సోమవారం గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2400 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు ఉండగా అందులో 1641కిలో మీటర్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రూ. 433 కోట్లతో పనులు సాగుతున్నాయన్నారు. ఇక్కడ 110 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్లను డబుల్ లేన్ చేస్తామని, ఈ పనులు జూన్‌లోగా పూర్తవుతాయన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి 6లేన్ల పనులు మోడల్‌గా చేపట్టేందుకు శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. వంద మీటర్ల పొడవునా నమూనాగా చేపట్టిన పనులు సీఎం ఆమోదం పొందిన తరువాత పూర్తి స్థాయిలో చేపడతామన్నారు. -
ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం
* ఏర్పాట్లు ప్రారంభించిన ఆర్అండ్బీ * ఐఏఎస్ అధికారుల సంఘం స్థలంలో నిర్మాణం * అప్రోచ్ రోడ్ల కోసం ఐఏఎస్‌ల ఇళ్ల కూల్చివేత * ఇప్పటికే కొన్ని ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు * అనుమతి కోసం జీఏడీకి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అధికార నివాసం వెనకవైపు ఉన్న ఐఏఎస్ అధికారుల సంఘం స్థలంలో కొత్త భవనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనం సిద్ధమయ్యాక అక్కడికి చేరుకునేందుకు వీలుగా కొత్తగా అప్రోచ్ రోడ్లు నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోసం సమీపంలో ఉన్న ఐఏఎస్ అధికారుల గృహ సముదాయాలు తొలగించాలని అధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనను రోడ్లు భవనాల శాఖ అధికారులు జీఏడీకి పంపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే భవనాల తొలగింపు పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే అక్కడ దాదాపు 25 మంది ఐఏఎస్‌ల గృహాలను ఖాళీ చేయించారు. ఇందులో ఎన్నింటిని తొలగించాలనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ముందువైపు విశాలమైన క్యాంపు కార్యాలయం, వెనకవైపు భారీ గృహసముదాయాన్ని నిర్మించారు. వాస్తులోపం అన్న కారణంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయ భవనాన్ని వినియోగించడం లేదు. వెనకవైపు ఉన్న అధికారిక నివాసాన్నే ఇంటిగా, క్యాంపు కార్యాలయంగా వాడుతున్నారు. కొత్తగా ఐఏఎస్ అధికారుల సంఘం నుంచి సేకరించిన స్థలంలో క్యాంపు కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఆ స్థలంతోపాటు సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్‌కు సంబంధించిన కొంత స్థలాన్ని కూడా వినియోగించనున్నట్టు సమాచారం. ఇక్కడ ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన దూరవిద్య కేంద్రాన్ని ఇప్పటికే తరలించారు. ప్రస్తుతం బేగంపేట ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న క్యాంపు కార్యాలయ రహదారిని కాకుండా కొత్త క్యాంపు కార్యాలయానికి మరో ప్రధాన రహదారిని అధికారులు సిద్ధం చేయనున్నారు. ఇది గ్రీన్ల్యాండ్స్తోపాటు ఇటు బేగంపేటకు, అటు అమీర్‌పేట ప్రధాన రహదారికి వెళ్లేలా నిర్మిస్తారు. -
జీహెచ్ఎంసీ చేతికి రహదారులు
సిటీబ్యూరో: నగరంలో ఆర్ అంబీ పరిధిలో ఉన్న 240.870 కి.మీ.ల రహదారుల నిర్వహణను జీహెచ్ఎంసీకి బదలాయించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా నగరంలోని వివిధ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వీటిలో కొన్ని మార్గాలు ఆర్అండ్బీ పరిధిలో ఉన్నాయి. ఎస్‌ఆర్‌డీపీపై గత డిసెంబర్ 26న ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆర్అండ్బీ నిర్వహణలో ఉన్న రహదారులను జీహెచ్ఎంసీకి బదలాయించాల్సిందిగా అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జీవో జారీ చేశారు. నేషనల్ హైవేలు మినహాయించి రాష్ట్ర హైవే, జిల్లాల్లోని మేజర్ రహదారులను జీహెచ్ఎంసీకి బదలాయించారు. ఇందులో 208.070 కి.మీ.లు మేజర్ జిల్లా రోడ్లు...మిగిలిన 32.800 కి.మీ.లు రాష్ట్ర రహదారులు. త్వరలో యూహెచ్పీలూ... ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ హెల్త్ పోస్టులు (యూహెచ్‌పీలు) త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. ఇప్పటి వరకూ యూహెచ్పీలకు అవసరమైన మందులు, భవనాల నిర్వహణ తదితరాలను జీహెచ్ఎంసీయే చూస్తోంది. నగరానికి సంబంధించి ఆరోగ్యం-పారిశుద్ధ్యం నిర్వహణ దీని పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు .. ముఖ్యంగా పేదబస్తీల్లోని వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు యూహెచ్‌పీల నిర్వహణ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండాలని గతంలో స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లోనూ ప్రస్తావించారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యం అంశాలపై శ్రద్ధ చూపిన జీహెచ్ఎంసీ అధికారులు ఆరోగ్య కేంద్రాల నిర్వహణ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే ఉంటే బాగుంటుందనే తలంపుతో ఉన్నారు. తద్వారా ఆరోగ్యం-పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహనతో పాటు బస్తీల్లో వైద్యశిబిరాలు నిర్వహించేందుకూ వీలుంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రభుత్వం ఒప్పుకుంటుందనే నమ్మకంలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. -
‘రెండు వారాల్లో టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్’
కరీంనగర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మరో రెండువారాల్లో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల్లో 640 సివిల్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఆ తర్వాత విద్యుత్‌శాఖలో మూడువేలకుపైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కరీంనగర్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరగోపాల్ కమిటీ సిలబస్ మార్పుపై చేసిన సిఫారసులు ఇంకా తన పరిశీలనకు రాలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. -
రహదారులు సిద్దం!
సర్కారుకు డీపీఆర్ అందజేత 150 అడుగులకు రూ.2,700 కోట్ల నష్టం అవాంతరాలూ కోకొల్లలు 100 ఫీట్లకు రూ.401 కోట్ల పరిహారం దీనికే మొగ్గు చూపుతున్న ఆర్అండ్బీ అధికారులు వరంగల్ రూరల్ : నగరంతోపాటు చుట్టూ ఉన్న రహదారుల అభివృద్ధిపై డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఆరు లేన్లుగా 150 అడుగులతో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు సర్వే చేశారు. మొత్తం ఐదు రహదారులపై రూపొం దించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. 150 అడుగులుగా రహదారులను అభివృద్ధి చేస్తే రూ.వేల కోట్లలో నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందన్న విషయం సర్వేలో వెలుగుచూసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ అధికారులు 100, 150 అడుగులతో అభివృద్ధి చేస్తే కలిగే లాభనష్టాలను బేరీజు వేస్తూ నివేదికలో పొందుపర్చారు. 150 అడుగులతో అభివృద్ధి చేయూలనుకుంటే నష్టపరిహారం అందించేందుకే నిధులు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుందని, ఈ క్రమంలో విస్తరణకు నిధుల కొరత ఏర్పడుతుందని అంచనా వేశారు. 150 అడుగులుగా మారిస్తే... నగరం, చుట్టు పక్కల రహదారులు హంటర్‌రోడ్-నాయుడు పంప్, కాజీపేట-పెద్దమ్మగడ్డ, కడిపికొండ -ఉర్సుగుట్ట, రాంపూర్-ములుగురోడ్డు (ఎన్‌హెచ్-163), ములుగురోడ్డు-ధర్మారం వరకు ఐదు రోడ్లను 150 అడుగులుగా అభివృద్ధి చేస్తే 7,51,275 చదరపు గజాల స్థలాన్ని సేకరించాలని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. 2,938 పక్కా భవనాలను కూల్చివేయాల్సి ఉంటుందని... ఇందుకోసం బాధితులకు సుమారు రూ.2,700 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. 150 అడుగులు అరుుతే... ఈ ఐదు రహదారులను 100 అడుగులుగా విస్తరిస్తే 1,85,600 చదరపు గజాల స్థలం అవసరమవుతుందని నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు 790 భవనాలను కూల్చివేయాలని, సుమారు రూ. 401 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 1971 మాస్టర్ ప్లాన్ బెటర్... రహదారులను 150 అడుగులుగా విస్తరిస్తే వందలాది పక్కా భవనాలు నేలమట్టమై పలు కుటుంబాలు ఆశ్రయం కోల్పోయే అవకాశాలున్నాయని వివరించిన ఆర్ అండ్ బీ అధికారులు 1971 మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో వివరించారు. వరంగల్ నగర అభివృద్ధి కోసం 1971లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్లు రహదారికి వదిలివేసే విధంగా భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని, ఈ మేరకు నష్టపరిహార భారం ప్రభుత్వంపై తక్కువ పడుతుందని పేర్కొన్నారు. 150 అడుగులతో విస్తరించాల్సి వస్తే నష్టపరిహారం ప్రభుత్వానికి భారంగా మారడంతోపాటు కోర్టు చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నివేదికలో వివరించారు. -
20కోట్లతో మొదలై .. 67 కోట్లకు
భవన నిర్మాణంలో ఆర్ అండ్ బీ అడ్డగోలుతనం సాక్షి, హైదరాబాద్: అదో భారీ బహుళ అంతస్తుల భవనం. రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఈ భవనానికి 2009లో టెండర్లు ఖరారైన సమయంలో దాని అంచనా వ్యయం రూ. 20 కోట్లు. అప్పట్లో పనులు మొదలై ఇప్పటికి కొలిక్కి వస్తున్నాయి. కానీ ప్రస్తుతం దాని అంచనా వ్యయం రూ. 67 కోట్లకుపైమాటే! అంటే మూడు రెట్లకుపైగా పెరిగిపోయింది. అయితే దీని లోతుపాతుల్లోకి వెళితే విస్మయం కలిగించే విషయాలెన్నో వెలుగుచూస్తున్నాయి. సొంత భవనం విషయంలో ఆర్అండ్బీ అధికారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రికల్ ఫిట్టిం గ్స్ కోసమే రూ. 14.50 కోట్లు, అంతర్గత రహదారుల అభివృద్ధికి రూ. 5 కోట్లు చూపారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోడ్లుభవనాల శాఖలో పట్టపగ్గాల్లేని విచ్చలవిడితనానికి ఇదో నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు ప్రతిపాదనలు అందజేయడమే తడువుగా ప్రభుత్వం కూడా అనుమతులిచ్చేస్తోంది. ఇదీ తంతు.. హైదరాబాద్ నడిబొడ్డున ఎర్రమంజిల్‌లో రోడ్లుభవనాల శాఖ ఇంజనీరింగ్ కార్యాలయం ఉంది. అది నిజాం కాలంలో నిర్మించినది కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. దాంతో ఆ విభాగం కోసం కొత్తగా మరో భవనాన్ని నిర్మించాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనం వెనకవైపున ఉన్న విశాల స్థలంలోనే దాన్ని నిర్మించాలని తలపెట్టింది. 2009లో టెండర్ పిలిచి సివిల్ వర్క్ అంచనాను రూ.11.93 కోట్లుగా పేర్కొంది. 0.45 శాతం అధిక ధరను కోట్ చేసిన చబ్రాస్ అసోసియేట్స్ కంపెనీకి దాన్ని కట్టబెట్టారు. ఈ భవనానికి మొత్తం రూ. 20 కోట్లు అవుతుందని అప్పట్లో ఆర్అండ్బీ శాఖ అంచనా వేసింది. రెండంతస్తుల భూగర్భ పార్కింగ్‌తోపాటు ఐదంతస్తుల భారీ భవన సముదాయానికి ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టారు. నిర్మాణం కోసం 2010 ఫిబ్రవరిలో అధికారులు కాంట్రాక్టు సంస్థకు స్థలాన్ని అప్పగించారు. కానీ భవన విస్తీర్ణాన్ని పెంచాలని, ఐదుకు బదులుగా 8 అంతస్తులుగా నిర్మించాలని ఆ తర్వాత నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి 2012లో ప్రతిపాదన పంపారు. విస్తీర్ణం పెరిగినందున భవన నిర్మాణ అంచనాను రూ. 39.96 కోట్లకు పెంచారు. దీన్ని ఇక్కడితో ముగించలేదు. అంతర్గత రహదారులు, భవనం చుట్టూ రిటెయినింగ్ వాల్, భూగర్భ సంప్, దానికి అనుసంధానంగా పంప్హౌస్లాంటి ఇతర పనులు కూడా చేపట్టాల్సి ఉందని 2014లో మరో ప్రతిపాదన చేశారు. ఇందుకోసం మొత్తం అంచనా వ్యయాన్ని రూ. 67.30 కోట్లకు పెంచాలని ప్రభుత్వానికి ఆర్అండ్బీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారం రోజుల క్రితమే రాష్ర్ట ప్రభుత్వం ఇందుకు అనుమతులిచ్చింది. అయితే సాధారణంగా సివిల్ పనుల టెండర్లను పిలిచినప్పుడు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఇతర కీలక పనులకు విడిగా టెండర్లు పిలుస్తారు. అన్నీ ఒకే టెండర్లో పిలవాలనుకున్నప్పుడు ముందుగానే పేర్కొంటారు. కానీ ఇక్కడ ఒక్కోసారి ఒక్కో పనిని చేరుస్తూ ప్రాజెక్టు అంచనాను మారుస్తూ పోయారు. అయితే విడిగా టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు. అన్ని పనులు అదే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ చేశారని కొందరు ఆర్అండ్బీ అధికారులే పేర్కొంటున్నారు. వింతలెన్నో... భవన నిర్మాణం ప్రారంభించే సమయంలో సివిల్ పనుల మొత్తాన్ని రూ.11.93 కోట్లుగా చూపారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ పనుల వ్యయాన్నే రూ. 14.51 కోట్లుగా చూపారు. ఈ భవనాన్ని ఎత్తయిన ప్రాంతంలో నిర్మిస్తున్నందున చుట్టూ రిటెయినింగ్ వాల్ అవసరం ఏర్పడింది. అలాగే ప్రధాన రహదారి నుంచి పైవరకు రోడ్డు నిర్మించాల్సి ఉంది. దీంతో వీటి పేరుతో ఏకంగా రూ. 5 కోట్ల అంచనాను రూపొందించేశారు. కాంట్రాక్టు ఒప్పందం కుదిరిన తర్వాత 2013-14 నాటికి మార్కెట్లో నిర్మాణ సామగ్రి ధరలు ఐదు రెట్లు పెరిగినందున ‘ధరల సవరణ’ పేరుతో అదనంగా రూ. 13.50 కోట్లు ప్రతిపాదించారు. సాధారణంగా ఒప్పంద గడువులోపు పనులు పూర్తి చేస్తేనే ధరల సవరణ వర్తిస్తుంది. కిటికీల నిర్మాణంలో అదనపు మెష్ షట్టర్స్ ఏర్పాటు పేరుతో రూ. 35 లక్షలను అదనంగా చూపారు. కారిడార్ ఫ్లోరింగ్ రాళ్ల రకాన్ని మార్చామన్న పేరుతో రూ. కోటి మేర అంచనా విలువ పెంచారు. -
కేంద్రానికి రూ.1000 కోట్లతో ప్రతిపాదనలు
ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్: వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సరసన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లను కేంద్రం ప్రభుత్వం చేర్చిందని తెలంగాణ రహదారులు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో తీవ్రవాద ప్రాబల్యమున్న జిల్లాల సంఖ్య నాలుగుకు పెరిగిందని, ఈ జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించామన్నారు. శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)ను బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులు/టెండర్లకు సీఓటీ అనుమతి తప్పనిసరి చేసే యోచనలో ఉన్నామన్నారు. సీఓటీ విధివిధానాలను పునః సమీక్షించి కొత్త విధాన రూపకల్పన చేస్తామన్నారు. ఈ అంశంపై నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మునిసిపల్ శాఖలతో చర్చించి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. టెండర్లకు అనుమతుల జారీలో సీఓటీ రెండూ మూడు నెలల సమయం తీసుకుంటుండడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో టెండర్ల అనుమతికి నిర్ణీత గడువు విధిస్తామన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.2 కోట్లకు పైగా వ్యయం చేసే పనులకు సీఓటీ అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. గోదావరి, సీలేరు నదులపై ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న వంతెనలను ఈ ఏడాది మేలోగా పూర్తిచేస్తామన్నారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుల పురోగతిపై ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు హామీ ఇచ్చామని తెలిపారు. -
కన్నీటి నివాళి
15 మందికి అంత్యక్రియలు పూర్తి హిందూపురం ఆస్పత్రిలో కోలుకుంటున్న 45 మంది క్షతగాత్రులు వైద్యసేవలు అందించేందుకు అనంతపురం నుంచి వెళ్లిన డాక్టర్లు ఆర్టీసీ డీఎం, ఇద్దరు ఆర్అండ్బీ అధికారుల సస్పెన్షన్ మృతులకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, ప్రభుత్వ అధికారుల నివాళి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ కార్యాలయం ముట్టడి ‘మాకు మట్టివ్వాల్సినోడివి.. మేమే నీకు మట్టివ్వాల్సొచ్చింది.. ఆ దేవుడికి ఏం అన్యాయం చేశామని మాకీ శిక్ష వేశాడు.. పగ వాడికి కూడా ఈ కష్టం రాకూడదు.. పిల్లగాళ్లందరూ కలిసి పట్నం పోసి సదువుకుంటాండారంటే సంబరపడినాం. ఇలా అరుుపోతుందని కలలో కూడా అనుకోలేదు.. ఒరేయ్.. ఒక్క సారి లెయ్ రా.. అమ్మా అని పిలవరా..’ అంటూ మృతి చెందిన విద్యార్థుల తల్లులు విలపిస్తుంటే ఆ దృశ్యం చూస్తున్న వారి కళ్లు సైతం చెమర్చారుు. అనంతపురం : పెనుకొండ సమీపంలోని ‘షీ-ఫారం’ వద్ద బుధవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 15 మందికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. మావటూరులో ఆరుగురు, నాగలూరులో ఇద్దరు, బండ్లపల్లిలో ఇద్దరితో పాటు మిగిలిన గ్రామాల్లో తక్కిన ఐదుగురికిఅంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయా గ్రామస్తులంతా అంత్యక్రియల్లో పాలు పంచుకుని క న్నీటి నివాళులర్పించారు. చాలామంది విద్యార్థులు కావడంతో కడసారి తమ బిడ్డలను చూస్తూ తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. మావటూరుకు చెందిన నరేంద్ర, అశోక్, నరసింహులు అనే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో వారు మరింత రోదించారు. కోలుకుంటున్న క్షతగాత్రులు ప్రమాదంలో గాయపడిన వారిలో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో 45 మంది, అనంతపురం ఆస్పత్రిలో ఐదుగురు, కర్నూలులో ఒకరు, బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో ఆరుగురు, నిమ్హాన్స్లో 15 మంది, మరో ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స తీసుకుంటున్నారు. అనంతపురం నుంచి ప్రత్యేకంగా వైద్యులు హిందూపురానికి వెళ్లి చికిత్స అందిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం స్థానిక ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతపురంలో చికిత్స పొందుతున్న నలుగురిని ఏజేసీ ఖాజామొహిద్దీన్ పరామర్శించారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు శిద్ధా రాఘవరావు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. ముగ్గురు అధికారుల సస్పెన్షన్ ప్రమాదానికి బాధ్యులుగా తేల్చుతూ మడకశిర డిపో మేనేజర్ సూర్యనారాయణతో పాటు ఆర్అండ్బీ డీఈ శ్రీనివాసులు, ఏఈఈ నాగరాజులను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి శిద్ధా రాఘవరావు బెంగళూరులో ప్రకటించారు. పోలీసులు అందించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలేవీ? ఘటనాస్థలిని పరిశీలించిన ప్రతి ఒక్కరికీ తప్పు కాంట్రాక్టర్దనే విషయం ఇట్టే తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వానికి, మంత్రులకు ఈ విషయం కన్పించడంలేదు. సదరు సబ్ కాంట్రాక్టర్ మంత్రి పరిటాల సునీతకు బంధువు కావడంతో తప్పిదాన్ని ఎలాగైనా ఇతరులపైకి నెట్టేయాలనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. సస్పెండ్ అయిన ఆర్అండ్బీ డీఓ శ్రీనివాసులు, ఏఈఈ నాగరాజు నెల కిందటే పెనుకొండకు బదిలీపై వచ్చారు. వీరు తప్పు చేశారని తేల్చిన మంత్రులకు కాంట్రాక్టర్ చేసిన తప్పిదాలు కనిపించకపోవడంలో ఆంతర్యమేమిటని క్షతగాత్రులు ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిందే.. ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. నిర్మాణసంస్థ రక్షణ గోడ నిర్మించి ఉంటే అసలు ఈ ప్రమాదమే జరిగేది కాదని క్షతగాత్రులు అంటున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా, రోడ్డుకు కుడివైపు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వ్యవహరించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోవడం దారుణమని వారు మండిపడుతున్నారు. ‘కాంట్రాక్టర్, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింద’ని పెనుకొండ మండలం మావటూరుకు చెందిన డిగ్రీ విద్యార్థిని ఆరోపించారు. ‘ఈ ఘోర ప్రమాదానికి ముమ్మాటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమ’ని మడకశిర మండలం చిన్నమంతూరుకు చెందిన పదో తరగతి విద్యార్థి తిరుమలేశు అన్నారు. ‘పది నెలలుగా పనులు జరుగుతున్నాయి. మధ్యలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగారుు. అయినప్పటికీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. జాగ్రత్త చర్యలు తీసుకోలేద’ని నాగలూరుకు చెందిన డిగ్రీ విద్యార్థి బాబు, మేకలపల్లికి చెందిన మమత అన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మృతులకు ‘అనంత’ నివాళి ప్రమాదంలో చనిపోయిన మృతుల్లో అధిక శాతం విద్యార్థులు కావడంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు నివాళులర్పించారు. పాఠశాలల ప్రార్థనా వేళలలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు మౌనం పాటించారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. -
తొలగనున్న ‘ఇరుకు’
ఇరుకు వంతెనల స్థానంలో హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం జిల్లాలోని ఆర్‌అండ్‌బీకి రూ.50.20 కోట్లు పనుల అంచనాల రూపకల్పనలో అధికారులు వరంగల్ రూరల్ :రహదారులు-భవనాల శాఖ పరిధిలో నిడివి తక్కువగా ఉండి ఇరుకుగా ఉన్న బ్రిడ్జీల స్థానంలో హైలెవల్ బ్రిడ్జీలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధు లు కేటాయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం జిల్లాకు రూ.50.20 కోట్లు మంజూరు చేసింది. వి విధ పథకాల కింద రహ దారులను వెడ ల్పు చేసినా పలు బ్రిడ్జీల నిడివి తక్కువగా ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఇటీవల రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు నిధు లు కేటాయించింది. రహదారులు-బ్రిడ్జిలు కలిపి ని ధులు కేటాయిస్తే పనులు నత్తనడకన జరిగే అవకాశాలున్నందున వేర్వేరుగా నిధులను కేటాయిం చినట్లు తెలిసింది. మంజూరైన బ్రిడ్జీల వివరాలు.. తాడ్వాయి మండలం నుంచి బయ్యారం వరకు ఉన్న రహదారి మధ్య గల 15/4-6 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.5 కోట్లు. పసరా నుంచి భూపాలపల్లి రహదారి మధ్య గల 22/8-10, 24/0-2 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లు. పసరా నుంచి భూపాలపల్లి రహదారి మధ్య గల 21/4-6కి.మీ. మధ్య గల బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు.. భూపతిపేట-కొత్తగూడ రహదారి మధ్య గల 3/4-6 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి.. భూపతిపేట-కొత్తగూడ రహదారి మధ్య గల 8/2-4 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి.. ఊరుగొండ-పసరుగొండ రహదారి మధ్య గల 2/8-3/0కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు..మందారిపేట-పోచారం రహదారి మధ్య గల 4/6-5/0 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.50 కోట్లు.. రఘునాథపల్లి-కంచనపల్లి రహదారి మధ్య గల 1/2-4 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి.. తొర్రూరు-వలిగొండ మధ్య గల 0/0 నుంచి 9/3 వరకు 21/750 నుంచి 26/6 వరకు ఉన్న బ్రిడ్జీల సీడీ వర్క్స్ కోసం రూ.2 కోట్లు.. పీడబ్ల్యూడీ రోడ్ కొలుకొండ వయా చిన మడూర్-అప్పిరెడ్డిపల్లిల మధ్య ఉన్న రహదారిలో 5/4 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.20 కోట్లు.. మహబూబాబాద్-నెల్లికుదురుల మధ్య ఉన్న రహదారిలోని 21/2 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.50 కోట్లు.. మహ్మద్‌గౌస్‌పల్లి-గిర్నిబావిల మధ్యగల రహదారిలోని 9/6-8 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు.. మహ్మద్‌గౌస్‌పల్లి-గిర్నిబావిల మధ్య గల రహదారిలోని 10/2-4కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు.. ఆకేరువాగు-పర్వతగిరి బైపాస్ నుంచి కల్లెడ రహదారిలోని 1/180కి.మీ./ కల్లెడ-కొత్తూరు రహదారిలోని 0/6-8కి.మీ. వద్ద బ్రిడ్జీల నిర్మాణానికి రూ.5 కోట్లు.. గొల్లచర్ల-ముల్కలపల్లిల మధ్య గల రహదారిలోని 4/0 కి.మీ. వద్ద బ్రిడ్జి అభివృద్ధి కోసం రూ.1.50 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించి టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్‌అండ్‌బీకి కూడా ఎస్ఎస్ఆర్ వర్తింపు
ఇక అన్ని ఇంజినీరింగ్ విభాగాలకు ఒకే ధర అన్ని శాఖలూ కేంద్ర రవాణాశాఖ డేటాను అనుసరించాల్సిందే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రహదారులను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు భారీఎత్తున పనులు చేపడుతున్న తరుణంలో రోడ్లు భవనాల శాఖ నిర్మాణ ధరలు పెరిగిపోనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్(ఎస్ఎస్ఆర్)ను భారీగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ధరలతోపోలిస్తే 18శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల నమోదవుతుందని అంచనా. రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ మినహా మిగతా ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఏపీ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్ డేటాను అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఇంచుమించు అన్నీ సమం చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే ఆయా శాఖల పనుల్లో అనుసరిస్తున్న ఎస్‌ఎస్‌ఆర్‌ను రోడ్లు భవనాల శాఖ అనుసరించేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్అండ్బీ ఇప్పటికీ 2008-09 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్ఆర్నే వినియోగిస్తోంది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అన్ని ఇంజినీరింగ్ విభాగాలు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ డేటాను అనుసరించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు గతంలో జారీ చేసిన 49వ నెంబర్ జీవోకు రిలాక్సేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖకు రూ.35లక్షల నుంచి రూ.40లక్షలు ఖర్చవుతుండగా ఇతర విభాగాలకు రూ.45 లక్షలకు పైగా ఖర్చవుతోంది. కొత్త ఎస్ఎస్ఆర్ వల్ల ఆర్అండ్బీ కూడా రూ.45 లక్షలకుపైగా ఖర్చు చేయవచ్చు. త్వరలో రూ.10 వేల కోట్లకుపైగా విలువైన పనులు ఆర్అండ్బీ చేపడుతున్నందున ఖజానాపై భారం మోపినా... పనుల్లో వేగం పెంచుతుందంటున్నారు. -
ఆర్‌అండ్‌బీలో ప్రక్షాళన!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం రహదారుల నిర్మాణం, విస్తరణ కు పెద్దపీట వేయడమే కాకుండా, ఆ శాఖను ప్రక్షాళన చేస్తోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అధికారుల నియామకానికి శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యం లోనే జిల్లాలో బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడం అధికారులలో చర్చనీయాంశంగా మారింది. ఆర్అండ్బీ ఎస్ఈగా పనిచేసిన ఎన్.మాధవి సుకన్యను ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. ఆమె స్థానంలో పి.మధుసూదన్‌రెడ్డి నియమించగా, ఆయన ఈ నెల నాలుగున బాధ్యతలు తీసుకున్నారు. నిజామాబాద్ డివిజన్ ఈఈగా పనిచేస్తున్న సీహెచ్ అంజయ్యను అకస్మాత్తుగా బదిలీ చేస్తూ గురువారం ఉ త్తర్వులు వెలువడ్డాయి. ఆయనను బోధన్ ఈఈగా పంపించి, రంగారెడ్డి జిల్లా సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఇంజనీరింగ్ విభాగంలో డెప్యూటేషన్‌పై విధులు నిర్వ హిస్తున్న ఎస్.రాఘవేందర్రెడ్డిని నిజామాబాద్ ఈఈగా నియమించారు. జిల్లాలో రూ.1011.50 కోట్ల విలువ చేసే పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే మరికొందరు డెప్యూటీ ఈఈలు, ఎఈఈలకు స్థానచలనం కలిగే అవశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. టెండర్ల ద్వారా పనులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, వంతెనల విస్తరణ, నిర్మాణాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఆయా మండల కేంద్రాలకు అనుసంధానం చేసే తారురోడ్లు, శిథిలమైన, కొత్త వంతెనల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1011.50 కోట్లను కేటాయిం చింది. రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షణలో జిల్లాలోని 49 సింగిల్‌లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చనున్నారు. గ్రామాలకు మండల అనుసంధానం కోసం 14 రహదారులు, శిథిలమైన వాటితో కలిపి మొత్తం 35 వంతెనలు నిర్మించేందుకు అధికారులు గతంలో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పను ల కోసం మొత్తంగా రూ.1011.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ద్వారా పనుల చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాటిని త్వరి తగతిన పూర్తి చేసేందుకు రహదారులు, భవనాల శాఖలో బదిలీల ప్రక్షాళన జరుగుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
స.హ.చట్టం అమలు తప్పనిసరి
నూజివీడు : సమాచార హక్కుచట్టం అమలులో అధికారులు గిమ్మిక్కులు చేస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార కమిషనర్లు లాం తాంతియాకుమారి, ముత్తంశెట్టి విజయనిర్మల హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలవుతున్న సమాచార హక్కు చట్టం పనితీరును పర్యవేక్షించేందుకు శనివారం వారు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. నూజివీడులోని ఆర్అండ్బీ అతిధి గృహంలో లాం తాంతియాకుమారి మాట్లాడుతూ సమాచార హక్కుచట్టంపై ప్రజలలో గతంలో కంటే చైతన్యం పెరిగిందన్నారు. అవినీతిని అరికట్టడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, ఈ చట్టం పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ చట్టం అమలు బాగా జరుగుతోందన్నారు. జన్మభూమి గ్రామసభల్లో సైతం ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పారు. దేవాదాయశాఖ, సహకారశాఖలు సైతం సమాచారహక్కుచట్టం పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా ప్రజలే ప్రభువులనే విషయాన్ని గమనించాలన్నారు. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోందని, అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లాం తాంతీయాకుమారిని ఇన్‌ఛార్జి ఆర్డీవో ఎన్.రమేష్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి విజయనిర్మల జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్) : ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులు ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని రాష్ట్ర సమాచార హక్కుచట్టం (ఆర్టీఐ) కమిషనర్ ముత్తంశెట్టి విజయనిర్మల సూచిం చారు. జూపూడి నోవా ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టీఐ చట్టంపై జరిగిన అవగాహనా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లోని అవినీతిని బట్టబయలు చేయడంలో ఆర్టీఐ(2005)చట్టం సామాన్యుల చేతిలో వజ్రాయుధమన్నారు. గ్రామపంచాయతీ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ప్రజాధనంతో చేపట్టే పనుల వివరాలను కేవలం రూ.10ఫీజుతో అర్జీపెట్టి తెలుసుకోవచ్చని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు రుసుము అవసరం లేదని తెలిపా రు. అర్జీ ఇచ్చిన 30రోజుల తర్వాత సమాధానం ఇవ్వకపోతే అప్పిలేట్ అధికారిని సంప్రదించాలని, అప్పటికీ సమస్య పరిష్కా రం కాకపోతే రోజుకు రూ.250 చొప్పున రూ.25వేల వరకు సంబంధిత అధికారులకు జరిమానా విధించవచ్చన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు పేదవర్గాలకు 5శాతం మెడికల్ రాయితీ కల్పించాలని, ప్రస్తుతం ఎన్ని ఆస్పత్రులు ఆ విధానాన్ని పాటిస్తున్నాయో ఆర్టీఐ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. కళాశాల డెరైక్టర్ జె.శ్రీనివాసరావు, ఆర్ఐ బేబీసరోజిని ఎస్ఐ లక్ష్మీనారాయణ, వీఆర్వో లలితకుమారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వారి కడుపుకోత తీర్చలేనిది
తూప్రాన్: రైలు బాధిత చిన్నారుల కుటుంబాల కడుపుకోత తీర్చలేనిదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మాసాయిపేట రైలు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కోలుకున్న చిన్నారుల కుటుంబాలకు స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం మంత్రి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతి చెందిన 16 మంది చిన్నారులతో పాటు డ్రైవర్, క్లీనర్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించామన్నారు. గాయపడిన చిన్నారులు కోలుకున్న అనంతరం లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆనాడు చెప్పామన్నారు. కాని మెదక్ ఉప ఎన్నిక కోడ్ అమల్లో ఉన్నందున ఇవ్వడం కుదరలేదని, ప్రస్తుతం కోడ్ ముగియడంతో గాయపడిన 18 మంది చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు వివరించారు. రైలు దుర్ఘటనలో గాయపడిన, దుర్మరణం చెందిన కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. సమగ్ర సర్వే చేపడితే ప్రతి పక్షాలు రాద్దాంతం చేశాయన్నారు. ప్రజలకు సేవకులుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెదక్ ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వదంలో తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఏపీకంటే ముందుగా రైతులకు రుణాలిస్తాం ఏపీ రాష్ట్రంలో కంటే ముందే తెలంగాణలోని రైతులకు ఖరీఫ్ రుణాలు అందించి రైతులను ఆదుకుంటామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. రైతు రుణాల మాఫీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఆర్బీఐ ఎన్ని ఆంక్షలు పెట్టినా రుణమాఫీ చేసితీరుతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకర్లకు రైతుల రుణాలను మాఫీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు మేలు జరగకపోగా, నట్టేట ముంచిన పాపం కాంగ్రెస్‌దేనని విమర్శించారు. ప్రభుత్వం స్పందించిన తీరు అమోఘం.. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని బాధిత కుటుంబాల తల్లిదండ్రులు పేర్కొన్నారు. మంత్రి హరీష్‌రావు తక్షణమే స్పందించి యాశోద ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందించారని కొనియాడారు. వైద్యులు సైతం తమ పిల్లలను కంటికి రెప్పల కాపాడారని అన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, ఎంపీపీ గుమ్మడిశ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు రఘునాథరావు, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ శివమ్మ పాల్గొన్నారు.