వరంగల్, న్యూస్‌లైన్ : వరుసగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలు మినహా.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో నష్ట తీవ్రత ఎక్కువగానే ఉంది. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పం టలు నీట మునిగాయి. పొలాల్లో ఇసుక మేటలు దర్శనమిస్తుండగా.. పత్తి మొక్కలు జాలువారుతున్నాయి. మొక్కజొన్న కంకుల నుంచి మొలకలు వస్తుండడంతోపాటు పెసర, అపరాల సాగు దయనీయంగా మారింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రహదారులు కొట్టుకుపోవడంతో ఆర్‌అండ్‌బీకి భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు గ్రామాలు ఇంకా అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కాగా.. 23 ఏళ్ల తర్వాత ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 562.3 మి.మీ ఉం డగా... ఆదివారం నాటికి 825.8 మి.మీ కురిసింది. దీంతో 1990 నాటి రికార్డు బ్రేక్ అయింది. అప్పుడు అత్యధిక వర్షపాతం 803 మి.మీ నమోదు కాగా... ఈ సీజన్‌లో గత రికార్డును అధిగమించింది. అరుుతే పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులెవ్వరూ గ్రామాల వైపు వెళ్లడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ములుగు మండలంలోని 12 పెద్ద చెరువులు వరద నీటితో నిండి మత్తడిపోస్తున్నాయి. చిన్న జలాశయాలు 45 వరకు ఉండగా... అవి కూడా పూర్తిగా నిండాయి. సుమారు 100 ఎకరాల మేర పత్తి చేను జాలువారే పరిస్థితి నెలకొంది. రామప్ప సరస్సు 34 అడుగులకు చేరింది.. మరో రెండు అడగులు నిండితే మత్తడి పోస్తుంది. 13చెరువులు మత్తడి పోస్తున్నాయి. కొత్తగూడ మండలంలోని 6 పెద్ద చెరువులు, 98 కుంటలు నిండాయి. సుమారు 600 ఎకరాల్లో పత్తి మొక్కజొన్న నష్టం జరిగింది. ఏటూరునాగారం మండలంలోని 14 పెద్ద చెరువులు నిండాయి. మరో 23 చిన్న జలాశాయాలకు గండ్లు పడ్డాయి.
400 ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. మంగపేట మండలంలోని 7 పెద్ద చెరువులు, 25 కుంటలు నిండాయి. దాదాపు 300ఎకరాల్లో ఇసుక మేటలు వేశారు. గౌరారం, ముసలమ్మ వాగులు పొంగుతున్నాయి. మల్లూరు రిజర్వాయరు మత్తడి పడుతోంది. దీని పరిధిలోని చెరువులన్నీ అలుగు పడుతున్నాయి. మొట్లగూడెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శనిగకుంట, పూరేడుపల్లి, నరేందర్‌రావుపేట, గాంధీనగర్, నర్సింహసాగర్ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆదివారం వరకూ వరద ఉధృతి తగ్గలేదు. కమలాపురం, మంగపేట, కోమటిపల్లి, బోరునర్సాపురం, మొట్లగూడెం, తిమ్మంపేట, మల్లూరు, గాంధీనగర్, రమణక్కపేట, రాజుపేట, కత్తిగూడెం, తాడ్వాయి మండలం దామెరవాయి, గంగారం, నర్సింగాపురం, కాటాపురం, బీరెల్లి, నార్లాపురం, కొండపర్తి, తాడ్వాయి, ఇందిరానగర్, ఎల్బాక గ్రామాల్లో పంటలు నీట మునిగాయి.
తొర్రూరు ప్రాంతంలోని దంతాలపల్లి శివారులో సూర్యాపేట-దంతాలపల్లి రహదారి శుక్రవారం తెగిపోయింది. అక్కడ అదివారం తాత్కాలికంగా కంకర వేసి రోడ్డు వేశారు. కానీ... నీటి ప్రవాహానికి ఆ రోడ్డు కుంగుతోంది. దంతాలపల్లి, తొర్రూరు, మరిపెడ ప్రాంతాలకు వెళ్లే భీరిశెట్టిగూడెం, రేపోణి, కుమ్మరికుంట్ల రోడ్లు అధ్వానంగా మారాయి. వేములపల్లి, రామానుజాపురం, గన్నెపల్లి గ్రామాల్లో సైతం రోడ్లు దెబ్బతినడంతో నడక కూడా ఇబ్బందిగా మారింది.
ఇటీవల కురుస్తున్న భారీవర్షాలతో భూపాలపల్లి మండలంలోని భీంఘన్‌పూర్ రిజర్వాయర్ నీటితో నిండింది. గణపు రం మండలంలోని గణపసముద్రం చెరువు నిండి రెండడుగుల మేర మత్తడి పోస్తోంది.దీంతో మోరంచపల్లి-చెల్పూరు రోడ్డులోని కల్వర్టుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా కొండాపూర్-అప్పాయపల్లి,ఘనపురం-ధర్మరావ్ పేట రోడ్లు వరద నీటితో పూర్తిగా దెబ్బతిన్నాయి.మోరంచవాగు ఉధృతికి 1500ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లింది. రేగొండ మండలం రామన్నగూడెం పెద్ద చెరువు మత్తడి పడడంతో భాగిర్తిపేట-రేగొండ రహదారిలోని కల్వర్టుపై నుంచి నీరు ప్రవహిస్తోంది, రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. కాగా..వర్షంతో మొగుళ్లపల్లి మండల పరి ధిలో సమారు మూడు వేల ఎకరాల్లో పత్తి పంట జాలువారింది.
మహబూబాబాద్ మండలంలోని నడివాడ శివారులోని గడ్డిగూడెం చెరువుకు బుంగ పడడంతో సుమారు 30 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చెరువు బుంగను రైతులు ఎండు గడ్డితో పూడ్చివేశారు. చెరువు మత్తడి పోయడంతో ఆ నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమాండ్లపల్లి, నడివాడ, రెడ్యాల, కంబాలపల్లి శివారులోని మొట్లతండాలో వరద ఉధృతికి సుమారు 110 ఎకరాలలో వరి పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి లెవల్ వంతెనను తాకుతోంది.
కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని ఈదుల చెరువు మత్తడి పోస్తోంది. దీంతో 100 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. కాట్రపల్లి గ్రామంలో చెరువు కట్టకు బుంగ పడడంతో సుమారు 50 ఎకరాల్లో వరి నీట మునిగింది. నెల్లికుదురు మండలంలోని సుమారు 20 చెరువులు, 45 కుంటలు మత్తడి పోస్తున్నాయి. 200 ఎకరాల్లో వరి పంట కొట్టుకుపోగా... 300 ఎకరాల్లో వరి నీట మునిగింది. 1000 హెక్టార్లలో పెసర పంటకు నష్టం వాటిల్లిన ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పరకాల నియోజకవర్గంలోని పరకాల, ఆత్మకూరు, సంగెం, గీసుకొండ మండలాల్లో అన్ని చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి. పరకాలలోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు పక్కన వేసిన వరినాట్లు కొట్టుకుపోయాయి. పరకాల పెద్దచెరువు, కంఠాత్మకూరు, నడికూడ, రాయపర్తి, లక్ష్మీపురం గ్రామాల్లోని చెరువులు మత్తళ్ల పోయడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. సంగెం, కాట్రపల్లిలో ఇల్లు నేలమట్టమయ్యాయి. నాలుగు మండలాల్లో సూమారు 950 ఎకరాల మేర పత్తి పంట నీటమునిగినట్లు అంచనా.
నర్సంపేట నియోజకవర్గంలో ప్రధాన నీటి వనరులైన పాకాల సరస్సు, వూధన్నపేట చెరువు, రంగాయుచెరువు, కోపాకుల చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి. నియోజకవర్గంలో 65వేల ఎకరాల విస్తీర్ణంలో వరిపంట సాగయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్‌తోపాటు రబీ సాగు ఈ సారి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు నెక్కొండ పెద్ద చెరువు, దుగ్గొండి ఊరచెరువులు,చిన్న నీటి కుంటలు కూడా అలుగు పోస్తున్నాయి.
వరద నష్టం అపారం
Published Mon, Aug 19 2013 3:10 AM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM
Advertisement