Highest rainfall
-
Hyderabad: అక్టోబర్‌లోనూ నగరాన్ని ముంచుతోన్న వానలు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ముగిసి.. అక్టోబరు మాసంలోకి ప్రవేశించినా.. కుండపోత వానలు హైదరాబాద్ నగర వాసుల గుండెను చెరువు చేస్తున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కురుస్తున్న వానలు మహానగరాన్ని నిండా ముంచుతున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి అక్టోబరు 14 వరకు నగరవ్యాప్తంగా సరాసరిన.. సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అక్టోబరులో పదేళ్ల వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే 2020 అక్టోబరు 14న అత్యధికంగా సిటీలో 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. విశ్వవ్యాప్తంగా వాతావరణ మార్పుల పరంగా లానినాగా పిలిచే ప్రభావంతో ఈ ఏడాది డిసెంబరు వరకు తరచూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ అంచనాలు సిటీజన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తుపానులు, అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులు, కింది స్థాయి గాలులు, క్యుములోనింబస్ మేఘాలు.. ఇలా ప్రభావమైదేనా గత కొన్ని నెలలుగా నగరంలో వానలు దంచికొడుతున్నాయి. రాత్రి వేళ కురుస్తున్న వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు వందలాది బస్తీల వాసులు నానా అవస్థలు పడుతున్నారు. జడివానలకు చెట్లు, కొమ్మలు విరిగిపడుతున్నాయి. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. రహదారులపై పోటెత్తిన వరద నీరు తొలగించడం బల్దియా, జలమండలి అత్యవసర విభాగాలకు కత్తిమీద సాములా మారింది. ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. వాన కష్టాలతో గత కొన్నిరోజులుగా నగరంలో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. పలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునేవారికి నిత్యం కురుస్తున్న జడివానలు కష్టాలు మిగులుస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలున్నవారిని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం కురుస్తున్న వర్షాలకు కారణాలపై వాతావరణ శాఖను ‘సాక్షి’ సంప్రదించగా..లానినా ప్రభావంతో విశ్వవ్యాప్తంగా వర్షాలు అధికంగా కురుస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామం నగరానికే మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. (క్లిక్: క్యాబ్‌లు, ఆటోల్లో అడ్డగోలు వసూళ్లు.. ప్రేక్షకపాత్రలో రవాణాశాఖ) భారీ వర్ష సూచన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నగరంలో ఆకాశం మేఘావృతమై పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు బండ్లగూడ, వెస్ట్‌మారేడ్‌పల్లి, కాప్రా తదితర ప్రాంతాల్లో అర సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు హిమా యత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. వరదనీటి చేరికను బట్టి జలమండలి అధికారులు జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి నీటిని వదిలిపెడుతున్నారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
TS: నాలుగు నెలలు.. మస్తు వానలు!
సాక్షి, హైదరాబాద్: ఈసారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని మురిపించాయి. వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్రంలో అత్యధిక వర్షాలు నమోదయ్యా యి. జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం 75.19 సెంటీమీటర్లు. కాగా, ఈ ఏడాది నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 104.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 39 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. గతేడాది నైరుతి సీజన్లో 46 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది అది కాస్త తగ్గినప్పటికీ సంతృప్తికరంగా వర్షాలు కురవడం గమనార్హం. ఇదిలా ఉండగా అక్టోబర్ 1వ తేదీనుంచి రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమైంది. డిసెంబర్ 31వ తేదీవరకు ఉండే ఈ సీజన్లో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది. ఆగస్టులో తగ్గినా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 3వ తేదీన కేరళకు చేరుకోగా.. అదేనెల 5వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్ 10వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. సీజన్ ప్రారంభం నుంచి రుతుపవనాలు చురుకుగా ఉండ డంతో వాతావరణ శాఖ వేసిన ముం దస్తు వర్షపాతం అంచనాలు దాదాపు సరిపోయా యి. సీజన్ ముగిసేనాటికి రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 13 జిల్లాల్లో 50% కంటే ఎక్కువ వానలు కురిశాయి. నైరుతి సీజన్లో 105 రోజులు రెయినీ డేస్ నమోదు కాగా, 7నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన రోజులు 72. అదేవిధంగా 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన రోజులు 28 కాగా, 21 సెంటీమీటర్ల కంటే అధిక వర్షం కురిసిన రోజులు 5 ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రెండేళ్లు వరుసగా.. 2006 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే గతేడాది 46 శాతం అధిక వర్షాలు కురిశాయి. ఈ ఏడాది 39 శాతం అధికంగా వానలు కురిసి రెండోసారి రికార్డు సృష్టించాయి. వరుసగా రెండుసార్లు అత్యధిక వర్షపాతం నమోదు కావడం పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. 2019లో 6 శాతం అధిక వర్షాలు నమోదు కాగా 2014 నుంచి 2018 వరకు లోటు వర్షపాతం నమోదైంది. అంతకు ముందు కొన్నిసార్లు లోటు వర్షపాతం నమోదు కాగా, మరికొన్నిసార్లు సింగిల్ డిజిట్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి సీజన్లో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిశాయి. -
హైదరాబాద్ చరిత్రలో కొత్త రికార్డు
హైదరాబాద్: ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరంలో పాత రికార్డులు బద్దలయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో తాజాగా అత్యధిక వర్షపాతం నమోదైంది. 2000లో అత్యధికంగా 241.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతకుముందు గరిష్టంగా 1908లో 153.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డుగా ఉండేది. ఈ రోజు 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు కాలనీలన్నీ నీటిమునిగాయి. ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు జలమయం కాగా... రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. కూకట్‌పల్లిలోని చెరువులకు గండిపడడంతో ఇళ్లలోని నీరుచేరింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. పదిరోజుల క్రితం పరిగి, వికారాబాద్‌లో 21 సెంటీమీటర్ల వాన నమోదై రికార్డు సృష్టించగా... తాగాజా బుధవారం కుత్భుల్లాపూర్ మండలంలో ఏకంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై గత రికార్డును బద్దలు కొట్టింది. అదేవిధంగా కీసర మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా జిల్లాలో బుధవారం నాడు 5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈనెలలో కురిసిన వర్షాలను పరిశీలిస్తే... ఇప్పటివరకు జిల్లాలో 24 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. 11 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. కందుకూరు, మహేశ్వరం మండలాల్లో మాత్రం లోటు వర్షపాతమే నమోదు కావడం గమనార్హం. కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ వర్షాల వల్ల ఏర్పడే సమస్యల్ని ఎదుర్కొనేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సిద్దమవుతోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి వినతులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసింది. 18004250817 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యల్ని వివరించాలని కలెక్టర్ రఘు నందన్‌రావు సూచించారు. ఈ కంట్రోల్‌రూమ్‌ను నిరంతరం ముగ్గురు పర్యవేక్షిస్తున్నారని, సమస్య విన్నవించిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నగర చరిత్రలో అధిక వర్షపాతం నమోదైన వివరాలు.. సంవత్సరం వర్షపాతం మిల్లీమీటర్లు 1908 153.2 1989 140 2000 241.5 2016 ఆగస్టు 31న 120.5 2016 సెప్టెంబర్ 21న 167.7 రంగారెడ్డి అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు(మిల్లీమీటర్లలో) ప్రాంతం వర్షపాతం మిల్లీమీటర్లు కుత్బుల్లాపూర్ 23.0 బషీరాబాద్ 10.4 బాలానగర్ 11.0 శామీర్‌పేట్ 13.4 కీసర 15.0 మల్కాజ్గిరి 10.5 మేడ్చల్ 10.6. -
నరసాపురంలో అధిక వర్షపాతం
ఏలూరు (మెట్రో): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ముఖ్య ప్రణాళికాధికారి టి.సురేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అధికంగా నరసాపురం మండలంలో 7.6 మిల్లిమీటర్లు వర్షం కురవగా అత్యల్పంగా అత్తిలి మండలంలో 0.2గా నమోదైంది. దేవరపల్లిలో 5.8, దెందులూరులో 4.6, తాళ్లపూడిలో 3, పోల వరం, జీలుగుమిల్లిలో 2.4, గణపవరంలో 2, కామవరపుకోటలో 1.6, మొగల్తూరులో 1.4, చాగల్లులో 1.2,నల్లజర్ల మండలాల్లో 0.8గా వర్షపాతం నమోదైంది -
ఆశలు సజీవం
భారీ వర్షాలతో రైతుల్లో ఆనందం - పునాస పంటలకు జీవం - గోడ కూలి వృద్ధురాలి మృతి - పుల్కల్లో 8.24 సెంటీమీటర్ల వర్షం సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వానలు పునాస పంటలకు జీవం పోస్తున్నాయి. విత్తనం వేసిన రోజు నుంచి చినుకు కోసం వెయ్యి కళ్లలో ఎదురు చూసిన రైతులకు ఈ వర్షాలు ఎంతో ఊరట నిచ్చాయి. అల్ప పీడన ప్రభావంతో వర్షాలు కురవటంతో మొక్కజొన్న, పత్తి, మిరప, పెసర పంటలకు మేలు జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటున 32.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధిక వర్షపాతం. మూడు రోజులుగా ముసురు పడుతుండగా, శనివారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పుల్కల్ మండలంలో 8.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ మండలంలో 19.2మిల్లిమీటర్లు, పాపన్నపేటలో 44.6, చిన్నశంకరంపేటలో 67.8, రామాయంపేటలో 16.4 మి.మి.వర్షపాతం నమోదైంది. ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. చెరువులో కూడా కొంతమేర నీరు వచ్చింది. వరినాట్లు కొనసాగుతున్నాయి. పొలాల్లో నీరు నిల్వ కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. ఆరుతడి పంటలకు కూడా ఈ వర్షాలు ప్రాణం పోశాయి. ఇదిలా ఉండగా.. వైద్య, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం, ముందస్తు జాగ్రత్తలు చేపట్టక పోవడంతో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మిరుదొడ్డి మండలం కేంద్రంలో ఇంటి పై కప్పు కూలి ఆండాళమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. కౌడిపల్లి మండలం తిమ్మాపురంలో పాత పాఠశాల భవనం కూలిపోయింది. పాతపడి కూలిపోయే పరిస్థితి ఉండటంతో రెండేళ్లుగా ఆ భవనం వినియోగించడం లేదు. రే గోడు మండలం కొత్వాన్‌పల్లిలో అతిసార ప్రబలింది. గ్రామానికి చెందిన దాదాపు 10 మందికి పైగా అతిసారబారిన పడ్డారు. పిడుగు పడి ఎద్దు మృతి మిరుదొడ్డి :పిడుగు పడి ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని అందె గ్రామంలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సూకూరి లింగం శుక్ర వారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద ఎద్దును కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ నేపథ్యంలో ఎద్దుపై పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందిందని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఎద్దు విలువ సుమారు రూ. 45 వేలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. కాగా శనివారం తెల్లవారు జామున కురిసిన వర్షం కారణంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న కాన్గంటి ముత్యాలుకు చెందిన ప్రహరీతో పాటు మరుగుదొడ్డి కుప్ప కూలి పోయింది. -
వరద నష్టం అపారం
వరంగల్, న్యూస్‌లైన్ : వరుసగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలు మినహా.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో నష్ట తీవ్రత ఎక్కువగానే ఉంది. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పం టలు నీట మునిగాయి. పొలాల్లో ఇసుక మేటలు దర్శనమిస్తుండగా.. పత్తి మొక్కలు జాలువారుతున్నాయి. మొక్కజొన్న కంకుల నుంచి మొలకలు వస్తుండడంతోపాటు పెసర, అపరాల సాగు దయనీయంగా మారింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులు కొట్టుకుపోవడంతో ఆర్‌అండ్‌బీకి భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు గ్రామాలు ఇంకా అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కాగా.. 23 ఏళ్ల తర్వాత ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 562.3 మి.మీ ఉం డగా... ఆదివారం నాటికి 825.8 మి.మీ కురిసింది. దీంతో 1990 నాటి రికార్డు బ్రేక్ అయింది. అప్పుడు అత్యధిక వర్షపాతం 803 మి.మీ నమోదు కాగా... ఈ సీజన్లో గత రికార్డును అధిగమించింది. అరుుతే పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులెవ్వరూ గ్రామాల వైపు వెళ్లడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ములుగు మండలంలోని 12 పెద్ద చెరువులు వరద నీటితో నిండి మత్తడిపోస్తున్నాయి. చిన్న జలాశయాలు 45 వరకు ఉండగా... అవి కూడా పూర్తిగా నిండాయి. సుమారు 100 ఎకరాల మేర పత్తి చేను జాలువారే పరిస్థితి నెలకొంది. రామప్ప సరస్సు 34 అడుగులకు చేరింది.. మరో రెండు అడగులు నిండితే మత్తడి పోస్తుంది. 13చెరువులు మత్తడి పోస్తున్నాయి. కొత్తగూడ మండలంలోని 6 పెద్ద చెరువులు, 98 కుంటలు నిండాయి. సుమారు 600 ఎకరాల్లో పత్తి మొక్కజొన్న నష్టం జరిగింది. ఏటూరునాగారం మండలంలోని 14 పెద్ద చెరువులు నిండాయి. మరో 23 చిన్న జలాశాయాలకు గండ్లు పడ్డాయి. 400 ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. మంగపేట మండలంలోని 7 పెద్ద చెరువులు, 25 కుంటలు నిండాయి. దాదాపు 300ఎకరాల్లో ఇసుక మేటలు వేశారు. గౌరారం, ముసలమ్మ వాగులు పొంగుతున్నాయి. మల్లూరు రిజర్వాయరు మత్తడి పడుతోంది. దీని పరిధిలోని చెరువులన్నీ అలుగు పడుతున్నాయి. మొట్లగూడెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శనిగకుంట, పూరేడుపల్లి, నరేందర్రావుపేట, గాంధీనగర్, నర్సింహసాగర్ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆదివారం వరకూ వరద ఉధృతి తగ్గలేదు. కమలాపురం, మంగపేట, కోమటిపల్లి, బోరునర్సాపురం, మొట్లగూడెం, తిమ్మంపేట, మల్లూరు, గాంధీనగర్, రమణక్కపేట, రాజుపేట, కత్తిగూడెం, తాడ్వాయి మండలం దామెరవాయి, గంగారం, నర్సింగాపురం, కాటాపురం, బీరెల్లి, నార్లాపురం, కొండపర్తి, తాడ్వాయి, ఇందిరానగర్, ఎల్బాక గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. తొర్రూరు ప్రాంతంలోని దంతాలపల్లి శివారులో సూర్యాపేట-దంతాలపల్లి రహదారి శుక్రవారం తెగిపోయింది. అక్కడ అదివారం తాత్కాలికంగా కంకర వేసి రోడ్డు వేశారు. కానీ... నీటి ప్రవాహానికి ఆ రోడ్డు కుంగుతోంది. దంతాలపల్లి, తొర్రూరు, మరిపెడ ప్రాంతాలకు వెళ్లే భీరిశెట్టిగూడెం, రేపోణి, కుమ్మరికుంట్ల రోడ్లు అధ్వానంగా మారాయి. వేములపల్లి, రామానుజాపురం, గన్నెపల్లి గ్రామాల్లో సైతం రోడ్లు దెబ్బతినడంతో నడక కూడా ఇబ్బందిగా మారింది. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలతో భూపాలపల్లి మండలంలోని భీంఘన్‌పూర్ రిజర్వాయర్ నీటితో నిండింది. గణపు రం మండలంలోని గణపసముద్రం చెరువు నిండి రెండడుగుల మేర మత్తడి పోస్తోంది.దీంతో మోరంచపల్లి-చెల్పూరు రోడ్డులోని కల్వర్టుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా కొండాపూర్-అప్పాయపల్లి,ఘనపురం-ధర్మరావ్ పేట రోడ్లు వరద నీటితో పూర్తిగా దెబ్బతిన్నాయి.మోరంచవాగు ఉధృతికి 1500ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లింది. రేగొండ మండలం రామన్నగూడెం పెద్ద చెరువు మత్తడి పడడంతో భాగిర్తిపేట-రేగొండ రహదారిలోని కల్వర్టుపై నుంచి నీరు ప్రవహిస్తోంది, రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. కాగా..వర్షంతో మొగుళ్లపల్లి మండల పరి ధిలో సమారు మూడు వేల ఎకరాల్లో పత్తి పంట జాలువారింది. మహబూబాబాద్ మండలంలోని నడివాడ శివారులోని గడ్డిగూడెం చెరువుకు బుంగ పడడంతో సుమారు 30 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చెరువు బుంగను రైతులు ఎండు గడ్డితో పూడ్చివేశారు. చెరువు మత్తడి పోయడంతో ఆ నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమాండ్లపల్లి, నడివాడ, రెడ్యాల, కంబాలపల్లి శివారులోని మొట్లతండాలో వరద ఉధృతికి సుమారు 110 ఎకరాలలో వరి పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి లెవల్ వంతెనను తాకుతోంది. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని ఈదుల చెరువు మత్తడి పోస్తోంది. దీంతో 100 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. కాట్రపల్లి గ్రామంలో చెరువు కట్టకు బుంగ పడడంతో సుమారు 50 ఎకరాల్లో వరి నీట మునిగింది. నెల్లికుదురు మండలంలోని సుమారు 20 చెరువులు, 45 కుంటలు మత్తడి పోస్తున్నాయి. 200 ఎకరాల్లో వరి పంట కొట్టుకుపోగా... 300 ఎకరాల్లో వరి నీట మునిగింది. 1000 హెక్టార్లలో పెసర పంటకు నష్టం వాటిల్లిన ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల, ఆత్మకూరు, సంగెం, గీసుకొండ మండలాల్లో అన్ని చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి. పరకాలలోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు పక్కన వేసిన వరినాట్లు కొట్టుకుపోయాయి. పరకాల పెద్దచెరువు, కంఠాత్మకూరు, నడికూడ, రాయపర్తి, లక్ష్మీపురం గ్రామాల్లోని చెరువులు మత్తళ్ల పోయడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. సంగెం, కాట్రపల్లిలో ఇల్లు నేలమట్టమయ్యాయి. నాలుగు మండలాల్లో సూమారు 950 ఎకరాల మేర పత్తి పంట నీటమునిగినట్లు అంచనా. నర్సంపేట నియోజకవర్గంలో ప్రధాన నీటి వనరులైన పాకాల సరస్సు, వూధన్నపేట చెరువు, రంగాయుచెరువు, కోపాకుల చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి. నియోజకవర్గంలో 65వేల ఎకరాల విస్తీర్ణంలో వరిపంట సాగయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్‌తోపాటు రబీ సాగు ఈ సారి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు నెక్కొండ పెద్ద చెరువు, దుగ్గొండి ఊరచెరువులు,చిన్న నీటి కుంటలు కూడా అలుగు పోస్తున్నాయి.