సాక్షి, హైదరాబాద్: ఈసారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని మురిపించాయి. వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్రంలో అత్యధిక వర్షాలు నమోదయ్యా యి. జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం 75.19 సెంటీమీటర్లు. కాగా, ఈ ఏడాది నైరుతి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 104.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 39 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. గతేడాది నైరుతి సీజన్‌లో 46 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది అది కాస్త తగ్గినప్పటికీ సంతృప్తికరంగా వర్షాలు కురవడం గమనార్హం. ఇదిలా ఉండగా అక్టోబర్ 1వ తేదీనుంచి రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమైంది. డిసెంబర్ 31వ తేదీవరకు ఉండే ఈ సీజన్‌లో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది.
ఆగస్టులో తగ్గినా..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 3వ తేదీన కేరళకు చేరుకోగా.. అదేనెల 5వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్ 10వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. సీజన్ ప్రారంభం నుంచి రుతుపవనాలు చురుకుగా ఉండ డంతో వాతావరణ శాఖ వేసిన ముం దస్తు వర్షపాతం అంచనాలు దాదాపు సరిపోయా యి. సీజన్ ముగిసేనాటికి రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 13 జిల్లాల్లో 50% కంటే ఎక్కువ వానలు కురిశాయి. నైరుతి సీజన్‌లో 105 రోజులు రెయినీ డేస్ నమోదు కాగా, 7నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన రోజులు 72. అదేవిధంగా 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన రోజులు 28 కాగా, 21 సెంటీమీటర్ల కంటే అధిక వర్షం కురిసిన రోజులు 5 ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండేళ్లు వరుసగా..
2006 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే గతేడాది 46 శాతం అధిక వర్షాలు కురిశాయి. ఈ ఏడాది 39 శాతం అధికంగా వానలు కురిసి రెండోసారి రికార్డు సృష్టించాయి. వరుసగా రెండుసార్లు అత్యధిక వర్షపాతం నమోదు కావడం పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. 2019లో 6 శాతం అధిక వర్షాలు నమోదు కాగా 2014 నుంచి 2018 వరకు లోటు వర్షపాతం నమోదైంది. అంతకు ముందు కొన్నిసార్లు లోటు వర్షపాతం నమోదు కాగా, మరికొన్నిసార్లు సింగిల్ డిజిట్‌లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిశాయి.
Comments
Please login to add a commentAdd a comment