14 జిల్లాల్లో సాధారణం, 11 జిల్లాల్లో అధికం, 6 జిల్లాల్లో అత్యధికం
మంచిర్యాల జిల్లాలో ఇప్పటికీ లోటు వర్షపాతమే
రాష్ట్రవ్యాప్తంగా 84 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ తొలి నెల ఎక్కువగా సాధారణ వర్ష పాతంతోనే సరిపెట్టింది. రాష్ట్రంలో కురిసిన సగ టు వర్షపాతం గణాంకాలు కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ జిల్లాలవారీగా పరిశీలిస్తే వర్షపాతం సాధారణ స్థితిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నైరుతి సీజన్‌లో జూన్ సాధారణ వర్షపాతం 12.94 సెంటీమీటర్లుకాగా ఈసారి 16 సెంటీమీటర్ల మేర సగటు వర్షపాతం కురిసింది. ఈ లెక్కన రాష్ట్రంలో సగటున కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 23% అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
కొన్నిచోట్ల అత్యధికంతో పెరిగిన సగటు..
జూన్ ఒకటో తేదీ నుంచి సెపె్టంబర్ 30 మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సీజన్ మొదటి నెలలో తొలకరి వర్షాలు మొదలు భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే గత నెలలో పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. కానీ కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర సగటు వర్షపాతం పైకి ఎగబాకింది.
84 మండలాల్లో లోటు వర్షపాతం...
రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో వర్షాలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ ఆరు జిల్లాల్లో మాత్రం అత్యధిక వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవగా 14 జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మండలాలవారీగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే 159 మండలాల్లో అత్యధికం, 171 మండలాల్లో అధికం, 198 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
84 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జూన్ తొలివారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవగా... రెండో వారం నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మూడు వారంలో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతమే నమోదవగా చివరి వారంలో మళ్లీ వర్షాలు ఆశాజనకంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణం కంటే రెట్టింపు వర్షాలు నమోదవగా రెండో స్థానంలో నల్లగొండ జిల్లా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment