రాష్ట్రవ్యాప్తంగా తగ్గుతున్న గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు
నిజామాబాద్ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తుండటం.. పలుచోట్ల వానలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా దాదాపు అన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 39.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 22.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, హనుమకొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయింది. మిగతా ప్రాంతాల్లో కూడా 3 డిగ్రీలు తక్కువగా నమోదు అయింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించాయి. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment