తాజా పరిస్థితుల మేరకు ఐఎండీ అంచనా
ప్రస్తుతానికి సాధారణం కంటే 9% ఎక్కువగానే నమోదు
నెలాఖరులో భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ
అయినా చాలాచోట్ల లోటు ఉంటుందంటున్న ఐఎండీ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. జూన్ నెల మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఆ తర్వాత అత్యంత చురుకుగా కదిలి ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం రుతుపవనాల కదలికలు మందగమనంలోనే ఉన్నాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్ నెలకు సంబంధించిన అంచనాలను ఐఎండీ తాజాగా విడుదల చేసింది. ఈ నెలలో రాష్ట్రంలోని చాలాచోట్ల లోటు వర్షపాతం నమోదయ్యే పరిస్థితులే కనిపిస్తున్నట్లు తెలిపింది.
నెలాఖరులో వర్షాలు కురుస్తాయని, సాధారణ వర్షపాతానికి దగ్గరగా గణాంకాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ మొత్తం మీదా చాలాచోట్ల లోటు ఉంటుందని ప్రకటించింది.
8 జిల్లాల్లో సాధారణం..11 జిల్లాల్లో లోటు
జూన్ నెలలో ఇప్పటివరకు 7.85 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. బుధవారం ఉదయానికి 8.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 9 శాతం అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఈనెల చివరి వారంలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, తూర్పు ప్రాంత జిల్లాల్లోనే ఇందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక 11 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. మంచిర్యాలలో లోటు ఎక్కువగా నమోదైంది.
రానున్న రెండ్రోజుల్లో వర్షసూచన
ప్రస్తుతం కోస్తాంధ్రను ఆనుకుని తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందని, దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జూన్‌లో ఇప్పటివరకు జిల్లాల వారీగా వర్షపాతం..
» తీవ్ర లోటు (–60% నుంచి –99%): మంచిర్యాల
» లోటు(–20% నుంచి –59%): ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి
» సాధారణం(+19% నుంచి –19%): వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, ఖమ్మం
» అధికం(+20% నుంచి +59%): మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నారాయణపేట
» అత్యధికం(+60% పైబడి): హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ
జూన్‌లో సాధారణ వర్షపాతం : 12.94 సెంటీమీటర్లు
బుధవారం నాటికి కురవాల్సిన వర్షం : 7.85 సెంటీమీటర్లు
నమోదైన వర్షపాతం : 8.53 సెంటీమీటర్లు సాధారణం కంటే 9 శాతం అధికంగా నమోదు
Comments
Please login to add a commentAdd a comment