రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు
అక్టోబర్‌లో పలు చోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాల అంచనాలు విడుదల చేసిన వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు.. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ అంతే స్థాయిలో జోరుగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో మూడు నెలల కాలంలో వర్షాలు, ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ తాజాగా అంచనాలు విడుదల చేసింది.
ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం 11.32 సెంటీమీటర్లుకాగా, సీజన్ ముగిసేనాటికి ఇంతకు మించి వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. నార్త్–ఈస్ట్ మాన్‌సూన్ సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 12 శాతం అధికంగా వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొన్న ఐఎండీ.. అక్టోబర్‌లో మాత్రం 15 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 73.86 సెంటీమీటర్లు కాగా, సీజన్ ముగిసే నాటికి 96.26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, సీజన్ మారుతున్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు.
4 ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు..
ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో జోరువానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. నాలుగు ఉమ్మడి జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్టోబర్ నెలలో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక వర్షాలు నమోదు కాగా.. ఖమ్మం, భద్రాచలం, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. ఈశాన్య సీజన్‌లో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలో ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment