
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పతనమయ్యాయయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడం గమనార్హ. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఊపందుకోవడం.. దీనికితోడు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రానున్న మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ పరిసర ప్రాంతం వరకు విస్తరించినట్లు నిపుణులు చెబుతున్నారు.
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని చాలాప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 22.0 డిగ్రీ ల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.