
చాదర్‌ఘాట్ వంతెన వద్ద ప్రవహిస్తున్న మూసీ నీరు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ముగిసి.. అక్టోబరు మాసంలోకి ప్రవేశించినా.. కుండపోత వానలు హైదరాబాద్ నగర వాసుల గుండెను చెరువు చేస్తున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కురుస్తున్న వానలు మహానగరాన్ని నిండా ముంచుతున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి అక్టోబరు 14 వరకు నగరవ్యాప్తంగా సరాసరిన.. సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అక్టోబరులో పదేళ్ల వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే 2020 అక్టోబరు 14న అత్యధికంగా సిటీలో 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. విశ్వవ్యాప్తంగా వాతావరణ మార్పుల పరంగా లానినాగా పిలిచే ప్రభావంతో ఈ ఏడాది డిసెంబరు వరకు తరచూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ అంచనాలు సిటీజన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
తుపానులు, అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులు, కింది స్థాయి గాలులు, క్యుములోనింబస్ మేఘాలు.. ఇలా ప్రభావమైదేనా గత కొన్ని నెలలుగా నగరంలో వానలు దంచికొడుతున్నాయి. రాత్రి వేళ కురుస్తున్న వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు వందలాది బస్తీల వాసులు నానా అవస్థలు పడుతున్నారు. జడివానలకు చెట్లు, కొమ్మలు విరిగిపడుతున్నాయి. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. రహదారులపై పోటెత్తిన వరద నీరు తొలగించడం బల్దియా, జలమండలి అత్యవసర విభాగాలకు కత్తిమీద సాములా మారింది.
ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. వాన కష్టాలతో గత కొన్నిరోజులుగా నగరంలో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. పలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునేవారికి నిత్యం కురుస్తున్న జడివానలు కష్టాలు మిగులుస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలున్నవారిని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం కురుస్తున్న వర్షాలకు కారణాలపై వాతావరణ శాఖను ‘సాక్షి’ సంప్రదించగా..లానినా ప్రభావంతో విశ్వవ్యాప్తంగా వర్షాలు అధికంగా కురుస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామం నగరానికే మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. (క్లిక్: క్యాబ్‌లు, ఆటోల్లో అడ్డగోలు వసూళ్లు.. ప్రేక్షకపాత్రలో రవాణాశాఖ)
భారీ వర్ష సూచన
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నగరంలో ఆకాశం మేఘావృతమై పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు బండ్లగూడ, వెస్ట్‌మారేడ్‌పల్లి, కాప్రా తదితర ప్రాంతాల్లో అర సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు హిమా యత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. వరదనీటి చేరికను బట్టి జలమండలి అధికారులు జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి నీటిని వదిలిపెడుతున్నారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment