average Rainfall
-
Hyderabad: అక్టోబర్‌లోనూ నగరాన్ని ముంచుతోన్న వానలు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ముగిసి.. అక్టోబరు మాసంలోకి ప్రవేశించినా.. కుండపోత వానలు హైదరాబాద్ నగర వాసుల గుండెను చెరువు చేస్తున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కురుస్తున్న వానలు మహానగరాన్ని నిండా ముంచుతున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి అక్టోబరు 14 వరకు నగరవ్యాప్తంగా సరాసరిన.. సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అక్టోబరులో పదేళ్ల వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే 2020 అక్టోబరు 14న అత్యధికంగా సిటీలో 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. విశ్వవ్యాప్తంగా వాతావరణ మార్పుల పరంగా లానినాగా పిలిచే ప్రభావంతో ఈ ఏడాది డిసెంబరు వరకు తరచూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ అంచనాలు సిటీజన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తుపానులు, అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులు, కింది స్థాయి గాలులు, క్యుములోనింబస్ మేఘాలు.. ఇలా ప్రభావమైదేనా గత కొన్ని నెలలుగా నగరంలో వానలు దంచికొడుతున్నాయి. రాత్రి వేళ కురుస్తున్న వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు వందలాది బస్తీల వాసులు నానా అవస్థలు పడుతున్నారు. జడివానలకు చెట్లు, కొమ్మలు విరిగిపడుతున్నాయి. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. రహదారులపై పోటెత్తిన వరద నీరు తొలగించడం బల్దియా, జలమండలి అత్యవసర విభాగాలకు కత్తిమీద సాములా మారింది. ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. వాన కష్టాలతో గత కొన్నిరోజులుగా నగరంలో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. పలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునేవారికి నిత్యం కురుస్తున్న జడివానలు కష్టాలు మిగులుస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలున్నవారిని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం కురుస్తున్న వర్షాలకు కారణాలపై వాతావరణ శాఖను ‘సాక్షి’ సంప్రదించగా..లానినా ప్రభావంతో విశ్వవ్యాప్తంగా వర్షాలు అధికంగా కురుస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామం నగరానికే మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. (క్లిక్: క్యాబ్‌లు, ఆటోల్లో అడ్డగోలు వసూళ్లు.. ప్రేక్షకపాత్రలో రవాణాశాఖ) భారీ వర్ష సూచన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నగరంలో ఆకాశం మేఘావృతమై పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు బండ్లగూడ, వెస్ట్‌మారేడ్‌పల్లి, కాప్రా తదితర ప్రాంతాల్లో అర సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు హిమా యత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. వరదనీటి చేరికను బట్టి జలమండలి అధికారులు జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి నీటిని వదిలిపెడుతున్నారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
సగటు వర్షపాతం 79 శాతం
సాక్షి, ముంబై : ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం 79 శాతం నమోదు అయింది. ప్రాంతాలు, జిల్లాలవారీగా పరిశీలించినట్టయితే 28 జిల్లాల్లో సగటు వర్షపాతం కన్నా చాల తక్కువగా నమోదైంది. మరాఠ్వాడాలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షభావం కారణంగా కరువుపరిస్థితులు ఏర్పడ్డాయి. మరాఠ్వాడా మినహా, కొంకణ్, మధ్యమహారాష్ట్ర, విదర్భలోని పలు జిల్లాల్లో సగటువర్షపాతంకంటే తక్కువగా కురిసినప్పటికీ కొంతమేర ఇక్కడి వర్షాలు రైతులతోపాటు అందరికి సంతృప్తినిచ్చాయని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో వర్షాలు రాకపోయినా జూలైలో వరుణుడు కరిణించాడు. కోంకణ్ ప్రాంతంలో ఇప్పటి వరకు సగటున 85 శాతం వర్షపాతం నమోదుకాగా, విదర్భలో 84 శాతం వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం... ముంబైతోపాటు విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో సగటువర్షపాతం కంటే అధికంగా నమోదైంది. వాతావరణ శాఖ అందించిన వివరాల మేరకు ముంబైలోని కొలాబా, శాంతాక్రజ్లల్లో సగటు వర్షపాతం కంటే 5 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. జూన్‌లో పెద్దగా వర్షాలు లేకపోయినా, జూలై రెండో వారం తర్వాత భారీ వర్షాలు కురిశాయి. ముంబైలో సగటుకంటే అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ర్ట్రంలో గోందియాలో సగటు వర్షపాతం కంటే అత్యధికంగా వర్షాలు కురిశాయి. ఇక్కడ 14 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు అమరావతిలో 13 శాతం, వర్ధాలో ఎనిమిది శాతం, నాగపూర్ జిల్లాలో ఆరు శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. హింగోలి, నాందేడ్‌లో అత్యల్పం... రాష్ట్రంలో అత్యల్పంగా వర్షపాతం హింగోలి, నాందే డ్ జిల్లాల్లో నమోదైంది. మరాఠ్వాడా ప్రాంతాలైన ఈ రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు చాల తక్కువగా వర్షాలు కురిశాయి. హింగోలిలో 35 శాతం తక్కువ వర్షపాతం, నాందేడ్ జిల్లాలో 31 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. మరాఠ్వాడా ప్రాంతంలోని పర్భణీలో 32 శాతం, బీడ్‌లో 49 శాతం మాత్రమే వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
రైతుల్లో తీవ్రమవుతున్న ఆందోళన
-
కరువు ఉరుముతోంది
* కమ్ముకుంటున్న కరువు ఛాయలు * ముందుకు కదలని నైరుతి రుతు పవనాలు * దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు * సాధారణం కంటే 38 శాతం * తక్కువ వర్షపాతం నమోదు * రిజర్వాయర్లలో తగ్గుతున్న మట్టాలు * వరి నాట్లు గత ఏడాదిలో సగమే * ఏపీ, తెలంగాణల్లోనూ గడ్డు పరిస్థితి * కోస్తాంధ్రలో 73% తక్కువ వర్షం * రైతుల్లో తీవ్రమవుతున్న ఆందోళన ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం కన్నా 70%... తెలంగాణలో 46% తక్కువ నమోదయ్యాయి. జూలై నెల తొలి రెండు వారాల్లో గనక ఈ పరిస్థితి మారకుంటే ఖరీఫ్‌ను కరువు కబళించినట్టే!! సాక్షి, న్యూఢిల్లీ: వరుణుడు కరుణించట్లేదు... నేల తల్లిని పలకరించట్లేదు! రుతుపవనాలు కొంత విస్తరించినా ఫలితం కనిపించడం లేదు. నైరుతి రుతుపవనాలు ముందుకు కదలకుండా మారాం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరువు ఛాయలు ఉరుముకొస్తున్నాయి. వాన జాడ లేక అన్నదాతల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ఈ సీజన్లో ఇంకా వర్షం ఊసే లేని ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. మబ్బులు ముఖం చాటేయడంతో ఇప్పటికైతే ఖరీఫ్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉండవచ్చునన్న వాతావరణ నిపుణుల అంచనాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక దక్షిణాదిన మరింత గడ్డు పరిస్థితి నెలకొంది. తెలుగు నేలనే చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కన్నా దాదాపు 70 శాతం, తెలంగాణలో 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై తొలి రెండు వారాల్లో ఈ పరిస్థితి మారకుంటే ఇక ఖరీఫ్‌ను కరువు ఆక్రమించినట్టే! కొన్ని చోట్ల ఎండ తీవ్రతలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి బేసిన్లలోని రిజర్వాయర్లలో నీటి మట్టం గత ఏడాదితో పోల్చితే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం ఆందోళన క లిగిస్తోంది. కాగా రానున్న రెండు మూడు రోజుల్లోనూ వాతావరణంలో పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈసారి పంటల సాగు విస్తీర్ణం కూడా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు సమాచారం. నైరుతి విస్తరించినా...: జూన్ 14 నుంచి 20 మధ్య నైరుతి రుతుపవనాలు.. మధ్య అరేబియా సముద్రం, ఉత్తర అరేబియా ప్రాంతం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గ ఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, సిక్కిం వరకు విస్తరించాయి. అలాగే మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర ప్రదేశ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాలకూ చేరుకున్నాయి. కానీ అనువైన వాతావరణ పరిస్థితులు ఏర్పడక వర్షాలు మాత్రం ఆశించిన మేర కురవడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 12 నుంచి 18 మధ్య దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. ఆ వారంలో 45 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. ఈ నెలలో ఇప్పటివరకు 117.6 మిల్లీమీటర్ల మేర సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 72.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే ఇది సాధారణం కంటే 38 శాతం తక్కువన్నమాట! తగ్గిన పంట విస్తీర్ణం... సకాలంలో వానలు లేక రైతులు మథనపడుతున్నారు. సాగుకు సర్వం సిద్ధం చేసుకుని ఆకాశం వైపే ఆశగా చూస్తున్నారు. కొన్ని చోట్ల ఒకట్రెండు వానలు పడటంతో విత్తనాలు వేసి మోసపోయారు. వరుణుడే వారిని ముంచేశాడు. మళ్లీ వాన జాడ లేక.. విత్తనాలు మొలవక రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ వర్షపాతం కారణంగా దేశవ్యాప్తంగా పంటల సాగు ఊపందుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో గత ఏడాదికంటే తక్కువ విస్తీర్ణంలో పంటలు వేశారు. ఈ నెల 21 నాటికి అంతకుముందు సంవత్సరంతో పోల్చితే వరి సాగు 53% తక్కువగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 16.4 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 7.59 లక్షల హెక్టార్లలోనే వరినాట్లు పూర్తయ్యాయి. అలాగే నూనెగింజల పంటల సాగు విస్తీర్ణమూ దాదాపు 85 శాతం తక్కువగా నమోదైంది. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే పత్తి 28.9%, చెరకు 1.4% తక్కువగా సాగు నమోదైంది. మరోవైపు తగ్గుతున్న నీటి నిల్వలు ఆందోళన రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 85 ప్రధాన రిజర్వాయర్లలోని నిల్వలు గత వారంలోనే 4.2% మేర పడిపోయాయి. మరోవైపు జూలై, ఆగస్టు నెలల్లో పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని, అయినా ఎన్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు సాధారణం కంటే తక్కువగానే పడతాయని వాతావరణ శాఖ అంటోంది.