సాక్షి, ముంబై : ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం 79 శాతం నమోదు అయింది. ప్రాంతాలు, జిల్లాలవారీగా పరిశీలించినట్టయితే 28 జిల్లాల్లో సగటు వర్షపాతం కన్నా చాల తక్కువగా నమోదైంది. మరాఠ్వాడాలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షభావం కారణంగా కరువుపరిస్థితులు ఏర్పడ్డాయి. మరాఠ్వాడా మినహా, కొంకణ్, మధ్యమహారాష్ట్ర, విదర్భలోని పలు జిల్లాల్లో సగటువర్షపాతంకంటే తక్కువగా కురిసినప్పటికీ కొంతమేర ఇక్కడి వర్షాలు రైతులతోపాటు అందరికి సంతృప్తినిచ్చాయని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో వర్షాలు రాకపోయినా జూలైలో వరుణుడు కరిణించాడు. కోంకణ్ ప్రాంతంలో ఇప్పటి వరకు సగటున 85 శాతం వర్షపాతం నమోదుకాగా, విదర్భలో 84 శాతం వర్షపాతం నమోదైంది.
అధిక వర్షపాతం...
ముంబైతోపాటు విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో సగటువర్షపాతం కంటే అధికంగా నమోదైంది. వాతావరణ శాఖ అందించిన వివరాల మేరకు ముంబైలోని కొలాబా, శాంతాక్రజ్‌లల్లో సగటు వర్షపాతం కంటే 5 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. జూన్‌లో పెద్దగా వర్షాలు లేకపోయినా, జూలై రెండో వారం తర్వాత భారీ వర్షాలు కురిశాయి. ముంబైలో సగటుకంటే అధిక వర్షపాతం నమోదైంది.
మరోవైపు రాష్ర్ట్రంలో గోందియాలో సగటు వర్షపాతం కంటే అత్యధికంగా వర్షాలు కురిశాయి. ఇక్కడ 14 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు అమరావతిలో 13 శాతం, వర్ధాలో ఎనిమిది శాతం, నాగపూర్ జిల్లాలో ఆరు శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
హింగోలి, నాందేడ్‌లో అత్యల్పం...
రాష్ట్రంలో అత్యల్పంగా వర్షపాతం హింగోలి, నాందే డ్ జిల్లాల్లో నమోదైంది. మరాఠ్వాడా ప్రాంతాలైన ఈ రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు చాల తక్కువగా వర్షాలు కురిశాయి. హింగోలిలో 35 శాతం తక్కువ వర్షపాతం, నాందేడ్ జిల్లాలో 31 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. మరాఠ్వాడా ప్రాంతంలోని పర్భణీలో 32 శాతం, బీడ్‌లో 49 శాతం మాత్రమే వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది.
సగటు వర్షపాతం 79 శాతం
Published Wed, Aug 6 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement