
కరువు ఉరుముతోంది
* కమ్ముకుంటున్న కరువు ఛాయలు
* ముందుకు కదలని నైరుతి రుతు పవనాలు
* దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు
* సాధారణం కంటే 38 శాతం
* తక్కువ వర్షపాతం నమోదు
* రిజర్వాయర్లలో తగ్గుతున్న మట్టాలు
* వరి నాట్లు గత ఏడాదిలో సగమే
* ఏపీ, తెలంగాణల్లోనూ గడ్డు పరిస్థితి
* కోస్తాంధ్రలో 73% తక్కువ వర్షం
* రైతుల్లో తీవ్రమవుతున్న ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం కన్నా 70%... తెలంగాణలో 46% తక్కువ నమోదయ్యాయి. జూలై నెల తొలి రెండు వారాల్లో గనక ఈ పరిస్థితి మారకుంటే ఖరీఫ్‌ను కరువు కబళించినట్టే!!
సాక్షి, న్యూఢిల్లీ: వరుణుడు కరుణించట్లేదు... నేల తల్లిని పలకరించట్లేదు! రుతుపవనాలు కొంత విస్తరించినా ఫలితం కనిపించడం లేదు. నైరుతి రుతుపవనాలు ముందుకు కదలకుండా మారాం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరువు ఛాయలు ఉరుముకొస్తున్నాయి. వాన జాడ లేక అన్నదాతల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఇంకా వర్షం ఊసే లేని ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. మబ్బులు ముఖం చాటేయడంతో ఇప్పటికైతే ఖరీఫ్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉండవచ్చునన్న వాతావరణ నిపుణుల అంచనాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక దక్షిణాదిన మరింత గడ్డు పరిస్థితి నెలకొంది. తెలుగు నేలనే చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కన్నా దాదాపు 70 శాతం, తెలంగాణలో 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై తొలి రెండు వారాల్లో ఈ పరిస్థితి మారకుంటే ఇక ఖరీఫ్‌ను కరువు ఆక్రమించినట్టే! కొన్ని చోట్ల ఎండ తీవ్రతలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి బేసిన్లలోని రిజర్వాయర్లలో నీటి మట్టం గత ఏడాదితో పోల్చితే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం ఆందోళన క లిగిస్తోంది. కాగా రానున్న రెండు మూడు రోజుల్లోనూ వాతావరణంలో పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈసారి పంటల సాగు విస్తీర్ణం కూడా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు సమాచారం.
నైరుతి విస్తరించినా...:
జూన్ 14 నుంచి 20 మధ్య నైరుతి రుతుపవనాలు.. మధ్య అరేబియా సముద్రం, ఉత్తర అరేబియా ప్రాంతం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గ ఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, సిక్కిం వరకు విస్తరించాయి. అలాగే మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర ప్రదేశ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాలకూ చేరుకున్నాయి. కానీ అనువైన వాతావరణ పరిస్థితులు ఏర్పడక వర్షాలు మాత్రం ఆశించిన మేర కురవడం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఈ నెల 12 నుంచి 18 మధ్య దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. ఆ వారంలో 45 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. ఈ నెలలో ఇప్పటివరకు 117.6 మిల్లీమీటర్ల మేర సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 72.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే ఇది సాధారణం కంటే 38 శాతం తక్కువన్నమాట!
తగ్గిన పంట విస్తీర్ణం...
సకాలంలో వానలు లేక రైతులు మథనపడుతున్నారు. సాగుకు సర్వం సిద్ధం చేసుకుని ఆకాశం వైపే ఆశగా చూస్తున్నారు. కొన్ని చోట్ల ఒకట్రెండు వానలు పడటంతో విత్తనాలు వేసి మోసపోయారు. వరుణుడే వారిని ముంచేశాడు. మళ్లీ వాన జాడ లేక.. విత్తనాలు మొలవక రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ వర్షపాతం కారణంగా దేశవ్యాప్తంగా పంటల సాగు ఊపందుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో గత ఏడాదికంటే తక్కువ విస్తీర్ణంలో పంటలు వేశారు. ఈ నెల 21 నాటికి అంతకుముందు సంవత్సరంతో పోల్చితే వరి సాగు 53% తక్కువగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 16.4 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 7.59 లక్షల హెక్టార్లలోనే వరినాట్లు పూర్తయ్యాయి.
అలాగే నూనెగింజల పంటల సాగు విస్తీర్ణమూ దాదాపు 85 శాతం తక్కువగా నమోదైంది. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే పత్తి 28.9%, చెరకు 1.4% తక్కువగా సాగు నమోదైంది. మరోవైపు తగ్గుతున్న నీటి నిల్వలు ఆందోళన రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 85 ప్రధాన రిజర్వాయర్లలోని నిల్వలు గత వారంలోనే 4.2% మేర పడిపోయాయి. మరోవైపు జూలై, ఆగస్టు నెలల్లో పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని, అయినా ఎన్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు సాధారణం కంటే తక్కువగానే పడతాయని వాతావరణ శాఖ అంటోంది.