ఖరీఫ్ ఖతమేనా?
* కరుణించని వరుణుడు
* రుణాలపై నోరు మెదపని సర్కారు
* రైతులపై దయచూపని బ్యాంకులు
* ఖరీఫ్ ఖతమేనా?
తొందరగా పలకరిస్తుందని ఊరించిన తొలకరి చినుకులు రోజులు గడుస్తున్నా జాడలేదు. అపుడపుడు కారుమబ్బులు దోబూచులాడుతున్నాయి కానీ వరుణుడు కరుణించలేదు. మరోవైపు బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటం లేదు... ఫలితంగా ఇప్పటికీ కూడా జిల్లాలో నారుమళ్లు ఊపందుకోలేదు. మొత్తంగా ఖరీఫ్ ఆలస్యమయ్యే పరిస్ధితి. సాగు ఆలస్యమైతే దిగుబడులు తగ్గడం ఖాయమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ఉత్తరాంధ్ర జిల్లా, ఒక మధ్యకోస్తా జిల్లా, ఒక దక్షిణ కోస్తా జిల్లా, ఒక రాయలసీమ జిల్లాల్లో పరిస్థితేమిటో చూద్దాం.
పశ్చిమ గోదావరిః గత అయిదేళ్లగా పశ్చిమ గోదావరి రైతులకు కష్టాలే కష్టాలు. ప్రతీ ఏటా ఖరీఫ్ సాగు నష్టాల పాలవుతోంది. నీలం తుఫాన్ తాలూకు నష్ట పరిహారం నేటికీ రైతులకు పూర్తిగా అందలేదు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 2.5 లక్షల హెక్టార్లలో వరిపంట పండించాల్సి ఉంది. జూలై నెలాఖరు వచ్చినా సాగు ముందుకు సాగటం లేదు....జూన్ మొదటి వారంలో ప్రవేశించవలసిన తొలకరి రుతుపవనాలు ముఖం చాటేయడంతో సాగు ఆలస్యమయ్యే స్ధితి వచ్చింది. ఇప్పటి వరకు 40 వేల హెక్టర్లలో మాత్రమే నాట్లు పడ్డాయి.
విజయనగరం: జిల్లాలో సాధారణం కంటే 16 శాతం తక్కువ వర్షపాతంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే జిల్లాలో ఎనభైశాతానికి పైగా కేవలం వర్షాధార భూములే. ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.06 లక్షల హెక్టార్లలో వరి పండిస్తారు.
ప్రకాశం: జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి ప్రతికూలతతో పంటలు సాగుచేయలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా జూన్‌లో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే... ఈ ఏడాది కేవలం 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది జూలైలో 89.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈ ఏడాది 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేయలే పరిస్థితి నెలకొంది.
అనంతపురం: జిల్లాలో మరోసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కోటి ఆశలతో ఖరీఫ్ పనులు ప్రారంభించిన రైతన్నలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 16 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 47 మండలాల్లో ఏరువాక ముందుకు సాగటం లేదు. జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో సుమారు 25 లక్షల ఎకరాల్లో వేరుసెనగ పంట సాగు చేస్తారు. ఇప్పటిదాకా కేవలం అన్ని పంటలు కలిపి మూడు లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవగా... 2. 32 లక్షల హెక్టార్ల వేరుసెనగ పంట మాత్రమే సాగైంది.