గత మూడేళ్లలో 10.50 లక్షల బాటిళ్ల విక్రయం
2023–24 సీజన్ వరకు ఏటా పెరిగిన అమ్మకాలు
సంప్రదాయ ఎరువులకు భిన్నంగా నానో ఎరువులు
గత ఖరీఫ్‌లో మార్కెట్‌లోకి నానో యూరియా ప్లస్
వచ్చే సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్
గత మూడేళ్లలో గణనీయంగా పెరిగిన నానో ఎరువుల అమ్మకాలు.. గత ఖరీఫ్ సీజన్ నుంచి భారీగా తగ్గాయి. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో బయోటెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను 2021లో భారత రైతులు ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
తొలుత యూరియా, ఆ తర్వాత నానో డీఏపీలను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఇఫ్కో గత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వచ్చే సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్‌ను తీసుకొచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, అమరావతి
ఏపీలో తగ్గిన అమ్మకాలు
గడచిన మూడేళ్లలో ఏపీలో ఇఫ్కో అవుట్‌లెట్స్‌తో పాటు ఆర్బీకేల ద్వారా 10.50 లక్షల బాటిళ్ల విక్రయాలు జరిగాయి. కాగా 2024–25 సీజన్ కోసం 10లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిళ్లను ఇఫ్కో సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్–2024లో అతికష్టమ్మీద 1.04లక్షల బాటిళ్ల నానో యూరియా ప్లస్, 48వేల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు జరిగాయి.
కాగా వచ్చే రబీ సీజన్‌లో నానో యూరియా ప్లస్ 3లక్షల బాటిళ్లతో పాటు లక్ష బాటిళ్ల నానో డీఏపీని అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. గడచిన మూడేళ్లుగా ఆర్బీకేల ద్వారా కూడా విక్రయాలు జరపగా, గడచిన ఖరీఫ్ సీజన్ నుంచి ఇఫ్కో అవుట్‌లెట్స్‌తో పాటు ఓపెన్ మార్కెట్ ద్వారా మాత్రమే నానో ఎరువులను అందుబాటులో ఉంచుతోంది.
నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులు, గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్ కూడా ఇస్తున్నారు. గతేడాది ఒక్కొక్కటి రూ.15లక్షల విలువైన ఈ వెహికల్‌తో కూడిన కిసాన్ డ్రోన్స్‌ను 75 మందికి అందజేశారు. ఈ ఏడాది మరో 70 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
500 మిల్లీ లీటర్ల బాటిల్‌లో తీసుకొచ్చిన నానో యూరియా/డీఏపీలు 45 కిలోల సంప్రదాయ యూరియా, డీఏపీ బస్తాకు సమానం. బస్తా యూరియా ధర మార్కెట్‌లో రూ.266.50 ఉండగా, అదే పరిమాణంలో ఉన్న ఈ నానో యూరియాను రూ.225కే ఇఫ్కో అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ డీఏపీ బస్తా మార్కెట్‌లో రూ.1,350 ఉండగా, నానో డీఏపీ బాటిల్ రూ.600కే తెచ్చింది. గడచిన మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా 2021–22 సీజన్‌లో 2.12 కోట్ల బాటిళ్లు, 2022–23లో 3.30 కోట్ల బాటిళ్ల అమ్మకాలు .
దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల సాగు తగ్గడంతో 2023–24లో 2.04 కోట్ల నానో యూరియా, 44 లక్షల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్‌లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఖరీఫ్ సీజన్‌లో కేవలం కోటి బాటిళ్ల నానో యూరియా ప్లస్, 43 లక్షల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. తగ్గిన నానో విక్రయాలు..
Comments
Please login to add a commentAdd a comment