ఆశలు సజీవం
భారీ వర్షాలతో రైతుల్లో ఆనందం
- పునాస పంటలకు జీవం
- గోడ కూలి వృద్ధురాలి మృతి
- పుల్కల్‌లో 8.24 సెంటీమీటర్ల వర్షం
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వానలు పునాస పంటలకు జీవం పోస్తున్నాయి. విత్తనం వేసిన రోజు నుంచి చినుకు కోసం వెయ్యి కళ్లలో ఎదురు చూసిన రైతులకు ఈ వర్షాలు ఎంతో ఊరట నిచ్చాయి. అల్ప పీడన ప్రభావంతో వర్షాలు కురవటంతో మొక్కజొన్న, పత్తి, మిరప, పెసర పంటలకు మేలు జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటున 32.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధిక వర్షపాతం. మూడు రోజులుగా ముసురు పడుతుండగా, శనివారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పుల్కల్ మండలంలో 8.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మెదక్ మండలంలో 19.2మిల్లిమీటర్లు, పాపన్నపేటలో 44.6, చిన్నశంకరంపేటలో 67.8, రామాయంపేటలో 16.4 మి.మి.వర్షపాతం నమోదైంది. ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. చెరువులో కూడా కొంతమేర నీరు వచ్చింది. వరినాట్లు కొనసాగుతున్నాయి. పొలాల్లో నీరు నిల్వ కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. ఆరుతడి పంటలకు కూడా ఈ వర్షాలు ప్రాణం పోశాయి.
ఇదిలా ఉండగా.. వైద్య, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం, ముందస్తు జాగ్రత్తలు చేపట్టక పోవడంతో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మిరుదొడ్డి మండలం కేంద్రంలో ఇంటి పై కప్పు కూలి ఆండాళమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. కౌడిపల్లి మండలం తిమ్మాపురంలో పాత పాఠశాల భవనం కూలిపోయింది. పాతపడి కూలిపోయే పరిస్థితి ఉండటంతో రెండేళ్లుగా ఆ భవనం వినియోగించడం లేదు. రే గోడు మండలం కొత్వాన్‌పల్లిలో అతిసార ప్రబలింది. గ్రామానికి చెందిన దాదాపు 10 మందికి పైగా అతిసారబారిన పడ్డారు.
పిడుగు పడి ఎద్దు మృతి
మిరుదొడ్డి :పిడుగు పడి ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని అందె గ్రామంలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సూకూరి లింగం శుక్ర వారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద ఎద్దును కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ నేపథ్యంలో ఎద్దుపై పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందిందని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఎద్దు విలువ సుమారు రూ. 45 వేలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. కాగా శనివారం తెల్లవారు జామున కురిసిన వర్షం కారణంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న కాన్గంటి ముత్యాలుకు చెందిన ప్రహరీతో పాటు మరుగుదొడ్డి కుప్ప కూలి పోయింది.