ఒంగోలు టూటౌన్: జిల్లాలో రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో పొలాలు పదునెక్కాయి. ఈ పాటికే వేసిన పంటలకు ఊరట లభించింది. విత్తనం విత్తుకునే అవకాశం అన్నదాతకు కలిగింది. ప్రస్తుతం ఖరీఫ్‌లో పత్తి 3,096 హెక్టార్లు, వేరుశనగ 2,091 హెక్టార్లు, కంది 6,963 హెక్టార్లు, సజ్జ 3,901 హెక్టార్లు వేశారు. పంట కాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తోంది.
వీటితో పాటు వరి 145 హెక్టార్లు, కూరగాయలు 1641 హెక్టార్లు సాగయింది. ఈ నెలలో 89.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 82.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వాతావరణం చల్లబడటం, వర్షం పడటం వలన ప్రస్తుతం వేసిన పంటలపై అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. గత ఏడాది ఇదే నెలలో పత్తి 8,652 హెక్టార్లు, వేరుశనగ 2,961 హెక్టార్లు, కంది 9,657 హెక్టార్లు, సజ్జ 5,590 హెక్టార్లు సాగయింది. ప్రస్తుత ఖరీఫ్‌లో 2,42,064 హెక్టార్లలో పంటలు పదునెక్కిన పొలాలు సాగు చేయాల్సి ఉండగా..సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కేవలం 37,933 హెక్టార్లలో నామమాత్రంగా పంటలు సాగయ్యాయి. ఇకనుంచైనా వర్షాలు సక్రమంగా కురిస్తే ఖరీఫ్ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
అందుబాటులో విత్తనాలు: కంది 1890 క్వింటాళ్లు, జీలుగ 1100 క్వింటాళ్లు, జనుము 1484 క్వింటాళ్లు, పెసర 1048 క్వింటాళ్లు, మినుము 3,606 క్వింటాళ్లు, పెసర 194 క్వింటాళ్లు ఉన్నాయి. మొత్తం 9379 క్వింటాళ్లు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. రైతులకు 50 శాతం రాయితీపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అయా మండలాల్లో ఇస్తున్నారు. ఇప్పటి వరకు 2,804 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అమ్మినట్లు ఏడీఏ రత్నప్రసాద్ తెలిపారు.
ఎరువులు: ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 37 వేల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యూరియా 9,400, డీఏపీ 8,900, కాంప్లెక్స్ ఎరువులు 18,100, ఎంవోపీ (మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ) 900 టన్నులు అందుబాటులో ఉంది. ప్రస్తుతం సీజన్ ముమ్మరం అయితే ఎరువుల కోసం రైతులు పరుగులు తీసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ఏడీఏ రత్నప్రసాద్ తెలిపారు.
జిల్లాలో విస్తారంగా వర్షాలు
ఒంగోలు టౌన్: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. సోమవారం సగటు వర్షపాతం 15.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఒంగోలు 26, టంగుటూరు 9.2, కొత్తపట్నం 24.6, నాగులుప్పలపాడు 1.6, చీమకుర్తి 23.2, మద్దిపాడు 23.4, సంతనూతలపాడు 16.2, అద్దంకి 24.6, కొరిశపాడు 19.8, జే పంగులూరు 36.2, బల్లికురవ 5.2, సంతమాగులూరు 29.2, మార్టూరు 46.2, యద్దనపూడి 46.4, చీరాల 37, వేటపాలెం 36, చినగంజాం 37.4, పర్చూరు 39.4, ఇంకొల్లు 10.6, కారంచేడు 24.6, కందుకూరు 6.2, గుడ్లూరు 2, వలేటివారిపాలెం 5.8, పొన్నలూరు 3.2, కొండపి 10.2, జరుగుమల్లి 8.2, సింగరాయకొండ 8, ఉలవపాడు 3.8, లింగసముద్రం 5.6, కనిగిరి 9, హనుమంతునిపాడు 11.8, పామూరు 1.6, వెలిగండ్ల 7.6, పీసీపల్లి 3.2, పొదిలి 13.8, కొనకనమిట్ల 2.6, మర్రిపూడి 7, దర్శి 38.2, తాళ్లూరు 20.2, ముండ్లమూరు 7, దొనకొండ 11, కురిచేడు 15, తర్లుపాడు 11.8, మార్కాపురం 13, దోర్నాల 8.8, పెద్దారవీడు 11.4, యర్రగొండపాలెం 14.4, త్రిపురాంతకం 18, పుల్లలచెరువు 14, గిద్దలూరు 10, రాచర్ల 10.2, కొమరోలు 9.2, బేస్తవారపేట 12.2, కంభం 9.4, అర్ధవీడులో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జులైలో 89.7 మిల్లీమీటర్ల సగటు వర్షానికిగాను ఇప్పటి వరకు 82.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
పదునెక్కిన పొలాలు
Published Tue, Jul 29 2014 1:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement